న్యాయమూర్తులపై దూషణ కేసులో మరో ఆరుగురి అరెస్టు

ప్రధానాంశాలు

Published : 23/10/2021 04:30 IST

న్యాయమూర్తులపై దూషణ కేసులో మరో ఆరుగురి అరెస్టు

ఈనాడు, అమరావతి, గుంటూరు లీగల్‌, న్యూస్‌టుడే: న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను అసభ్యకరంగా దూషిస్తూ, కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సీబీఐ శుక్రవారం మరో ఆరుగుర్ని అరెస్టు చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయిన వారి సంఖ్య 11కు చేరింది. తాజాగా అరెస్టు అయిన వారిలో అవుతు శ్రీధర్‌రెడ్డి(ఏ7), జలగం వెంకట సత్యనారాయణ(ఏ8), శ్రీనాథ్‌ సుస్వరం(ఏ12), దరిశ కిషోర్‌రెడ్డి (ఏ13), గూడ శ్రీధర్‌రెడ్డి (ఏ9)తోపాటు సుద్దులూరి అజయ్‌ అమృత్‌ అనే మరో వ్యక్తి ఉన్నారు. వీరిలో దరిశ కిషోర్‌రెడ్డి మినహా మిగిలిన అయిదుగురిని శుక్రవారం సాయంత్రం గుంటూరు అయిదో అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టులో హాజరుపరిచారు. వీరికి ఇన్‌ఛార్జి జడ్జి పొన్నూరు బుజ్జి నవంబరు మూడు వరకు రిమాండ్‌ విధించారు. ఇదే కేసులో ఇంతకుముందు ధనిరెడ్డి కొండారెడ్డి (ఏ1), పాములు సుధీర్‌ (ఏ3), ఆదర్శ్‌ పట్టపు అలియాస్‌ ఆదర్శ్‌రెడ్డి (ఏ4), లవనూరు సాంబశివారెడ్డి అలియాస్‌ శివారెడ్డి (ఏ6), లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డి (ఏ15) అరెస్టయ్యారు. వీరిపై గుంటూరులోని జూనియర్‌ సివిల్‌ జడ్జి న్యాయస్థానం (సీబీఐ డిజిగ్నేటెడ్‌ కోర్టు)లో ఇప్పటికే సీబీఐ వేర్వేరుగా అభియోగపత్రాలు దాఖలు చేసింది.

విదేశాల్లో ఉన్న నిందితుల్లో మరొకరు అరెస్టు

రాష్ట్ర ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ ఇంటర్వ్యూలు, ప్రసంగాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదిస్తూ, అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అప్పటి హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఫిర్యాదు చేశారు. దాతో గతేడాది ఏప్రిల్‌ 16 నుంచి జులై 17 వరకు ఆంధ్రప్రదేశ్‌ సీఐడీలోని సైబర్‌ నేరాల విభాగం మొత్తం 12 కేసుల్ని నమోదు చేసి, 16 మందిని నిందితులుగా పేర్కొంది. హైకోర్టు ఆదేశాలతో గతేడాది నవంబరు 11న కేసు దర్యాప్తు బాధ్యతల్ని సీబీఐ చేపట్టింది. స్వభావం రీత్యా 12 కేసులూ ఒకే తరహాలో ఉన్నందున.. వాటన్నింటిపై ఒకే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి 16 మందిని నిందితులుగా పేర్కొంది. 17వ నిందితుడి స్థానంలో వివరాలు తెలియని వ్యక్తులని పేర్కొంది. ఇప్పటికే గుర్తించిన నిందితుల్లో ముగ్గురు విదేశాల్లో ఉండగా... వారిలో లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డిని జులైలో, దరిశ కిషోర్‌రెడ్డిని శుక్రవారం అరెస్టు చేసింది. నిందితుల జాబితాలోని 16 మందిలో మణి అన్నపురెడ్డి (ఏ2- విదేశాల్లో ఉంటున్నారు), అభిషేక్‌రెడ్డి (ఏ5), లింగారెడ్డి (ఏ10), చందురెడ్డి (ఏ11), చిరంజీవి (ఏ14), కె.గౌతమి (ఏ16)లు మినహా మిగతా వారంతా అరెస్టయ్యారు.

ఎంఎల్‌ఏటీ, ఇంటర్‌పోల్‌ ద్వారా ఆధారాల సేకరణ

విదేశాల్లో ఉన్న నిందితులకు సంబంధించిన ఆధారాల సేకరణపై సీబీఐ దృష్టిసారించింది. ఎంఎల్‌ఏటీ (మ్యూచువల్‌ లీగల్‌ అసిస్టెన్స్‌ ట్రీటీస్‌), ఇంటర్‌పోల్‌ సహకారం తీసుకుంటోంది. అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి సీబీఐ కేసు నమోదు చేసిన తర్వాత.. నిందితులు ఆయా అభ్యంతరకర పోస్టులన్నింటినీ సామాజిక మాధ్యమాలు, జన బాహుళ్యం నుంచి తొలగించినట్లు సీబీఐ దర్యాప్తులో గుర్తించింది. కొందరు వారి సామాజిక మాధ్యమ ఖాతాల్ని కూడా మూసేసినట్లు తేల్చింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన