తెదేపా కార్యాలయంపై దాడి ఘటనలో మరో ఏడుగురి అరెస్టు

ప్రధానాంశాలు

Published : 26/10/2021 05:05 IST

తెదేపా కార్యాలయంపై దాడి ఘటనలో మరో ఏడుగురి అరెస్టు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ కార్యాలయంపై దాడికి పాల్పడిన సంఘటనలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు అర్బన్‌ ఎస్పీ కార్యాలయం సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. విజయవాడకు చెందిన వెంకట సత్యనారాయణ (కార్పొరేటర్‌), రజని సుధాకర్‌, వెళ్లబోయినే ప్రభుదాస్‌, కర్నాటి రామస్వామి, మాదాల పవన్‌కుమార్‌, గుంటూరుకు చెందిన బోధపటి కిశోర్‌కుమార్‌, సోమి కమలకుమార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన నిందితులను పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వీడియో క్లిప్పింగ్‌లు, ఇతర ఆధారాలనుబట్టి మిగతా నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.


మరో వీడియో వెలుగులోకి

ఈనాడు, అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయంపై ఈ నెల 19న అల్లరిమూకలు చేసిన దాడి ఘటనకు సంబంధించి తాజాగా మరో వీడియో వెలుగు చూసింది. కార్యాలయం ప్రాంగణం లోపల నిలిపి ఉంచిన ఓ కారు అద్దాల్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఇద్దరు యువకులు ఒకరు తర్వాత మరొకరు పెద్ద చెక్కలు పట్టుకుని కారు అద్దాల్ని పగలకొడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. తర్వాత వారిద్దరూ కార్యాలయం లోపలికి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడుతున్న దృశ్యాలూ ఉన్నాయి. ధ్వంసానికి పాల్పడిన అల్లరిమూకలే సెల్‌ఫోన్లో ఈ వీడియోను తీయించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేయిస్తున్నారని తెదేపా వర్గాలు ఆరోపించాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన