ఉరుసు నిర్వహణలో వివాదం

ప్రధానాంశాలు

Updated : 28/10/2021 05:39 IST

ఉరుసు నిర్వహణలో వివాదం

ముల్తానీలలో రెండు వర్గాల మధ్య ఘర్షణ
ఇద్దరి మృతి, 10 మందికి తీవ్ర గాయాలు

మృతులు షేక్‌ జహిరోద్దిన్‌, షేక్‌ జహా

ఇచ్చోడ, న్యూస్‌టుడే: ఉరుసు నిర్వహణ విషయమై రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం గుండాల గ్రామంలో ఈ దారుణం జరిగింది.  గుండాలలో నివసించే ముల్తానీలు రెండు వర్గాలుగా చీలిపోయి తరచూ గొడవలు పడుతున్నారు. బుధవారం నుంచి ఉరుసు ఉత్సవాలను నిర్వహించేందుకు రషీద్‌ వర్గానికి చెందిన వారు సిద్ధమయ్యారు. నిర్వహించకుండా చూడాలంటూ సిరాజ్‌ వర్గీయులు మంగళవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఉత్సవాలకు అనుమతి నిరాకరించారు. అయినా రషీద్‌ వర్గీయులు బుధవారం ఉదయం పదకొండు గంటల సమయంలో డీజేలను గ్రామంలోకి తీసుకురావడం గొడవకు దారితీసింది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒక దశలో కోపోద్రిక్తులైన రషీద్‌ వర్గానికి చెందిన వారు..సిరాజ్‌ వర్గానికి చెందిన వారి ఇళ్లపై గొడ్డళ్లు, కర్రలతో దాడులకు దిగారు. ప్రాణభయంతో వారు గ్రామ సమీపంలోని పంటపొలాల్లోకి పారిపోయినా వదల్లేదు. వెంటాడుతూ చిన్నా,పెద్దా, మహిళలు అన్న తేడా లేకుండా విచక్షణ రహితంగా దాడిచేశారు. ఈ ఘటనలో షేక్‌ జహిరోద్దిన్‌(55), షేక్‌ జహా(40) మరణించారు. సిరాజ్‌తోపాటు ఆయన భార్య, కుమార్తె సహా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులను అడ్డుకున్నారు

దాడుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, రషీద్‌ వర్గీయులు వారిని గ్రామంలోనికి అనుమతించలేదు. గాయపడిన వారిని తరలించేందుకు వెళ్లిన 108 వాహనాన్నీ అడ్డుకున్నారు. ఆదిలాబాద్‌ ఎస్పీ రాజేష్‌చంద్ర, నిర్మల్‌ ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌, ఉట్నూరు, నిర్మల్‌ ఏఎస్పీలు పరిస్థితిని సమీక్షించారు. మరిన్ని బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం గాయపడిన వారిని హుటాహుటిన రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో 200 మంది పోలీసులతో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటుచేశారు. దాడికి పాల్పడిన 23 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ రాజేష్‌చంద్ర వెల్లడించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన