‘క్రిప్టో’తో కళ్లు తిరిగే లాభాలంటారు.. ఖాతానే దోచేస్తారు..

ప్రధానాంశాలు

Published : 26/11/2021 04:59 IST

‘క్రిప్టో’తో కళ్లు తిరిగే లాభాలంటారు.. ఖాతానే దోచేస్తారు..

వందకు పైగా వాట్సప్‌ గ్రూపులతో సైబర్‌ నేరస్థుల వల
హైదరాబాద్‌ పరిధిలో రూ.9.6 కోట్ల దోపిడీ వెలుగులోకి

ఈనాడు, హైదరాబాద్‌: ‘బిట్‌కాయిన్‌ కొంటే రోజూ లక్షల్లో లాభాలొస్తాయి.. మీ తరఫున లావాదేవీలు మేం నిర్వహిస్తాం.. నగదును ఎప్పటికప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు’ అంటూ సైబర్‌ నేరస్థులు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అధిక లాభాల ఆశతో ఖాతాలు తెరిచి పెట్టుబడులు పెట్టిన వారికి.. తొలుత భారీ లాభాలు చూపి, తర్వాత ఆ ఖాతాలను బ్లాక్‌ చేసి నిధులు స్వాహా చేసేస్తున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లలో నెల రోజుల్లో ఇలా రూ.9.6 కోట్ల నగదును కాజేశారు. ఈ మోసాలపై 15 ఫిర్యాదులు అందినట్లు పోలీసులు తెలిపారు. ముంబయి, దిల్లీలో ఉంటున్న సైబర్‌ నేరస్థులు క్రిప్టోకరెన్సీ అర్థం వచ్చేలా వందకుపైగా వాట్సప్‌ గ్రూప్‌లను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వాటిల్లో ప్రస్తుతం 3 వేల మందికిపైగా సభ్యులున్నారని సమాచారం.  

ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వ్యాపారులు, ప్రైవేటు కంపెనీల ఉన్నతాధికారుల నంబర్లు సేకరించి.. నిందితులు ఈ గ్రూపుల్లో చేరుస్తున్నారు. నేరస్థులు, వారి అనుచరులు ఆ గ్రూపులో క్రిప్టోకరెన్సీ కొంటే రోజూ లాభం వస్తుందంటూ సంభాషిస్తారు. ‘బిట్‌ కాయిన్‌ కొని, అమ్మడం ద్వారా రూ.లక్ష లాభం వచ్చింది’, ‘15 రోజుల్లో రూ.20 లక్షల లాభం వచ్చింది’ అంటూ లావాదేవీల చిత్రాలను గ్రూపుల్లో పోస్ట్‌ చేస్తారు. ఇదేదో బాగుందనుకుని వాట్సప్‌ బృందాల్లో సభ్యులు తాము కూడా కొంటామని చెప్పగానే.. సైబర్‌ నేరస్థులు  ఓ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేయించి, వారి పేరుతో డిజిటల్‌ ఖాతాని ప్రారంభిస్తున్నారు. ఆ ఖాతా నియంత్రణ నేరస్థుల చేతుల్లోనే ఉంటుంది. తొలుత రూ.లక్ష నగదు డిపాజిట్‌ చేయించి.. బిట్‌కాయిన్‌ కొనిపిస్తారు. మరుసటిరోజు బిట్‌కాయిన్‌ మైనింగ్‌ చేశాం.. మీకు రూ.5 వేలు లాభం వచ్చిందని చెబుతారు. ఖాతాలో రూ.1.05 లక్షలు చూపుతారు. మూడోరోజు ఫోన్‌ చేసి రూ.1.05 లక్షలకు రూ.15 వేలు లాభం వచ్చింది.. లాభాన్ని విత్‌డ్రా చేసుకోండి అని సూచిస్తారు. అపై రూ.లక్షల్లో మదుపు చేయండి కోట్లు పొందండి అంటూ ఫోన్లు చేస్తూనే ఉంటారు. పెద్దమొత్తం పెట్టుబడి పెట్టాక డిజిటల్‌ ఖాతాను మాయం చేస్తున్నారు. రూ.10 లక్షలు మదుపు చేసిన ఓ వ్యక్తికి 30 రోజుల్లోనే రూ.90 లక్షల నగదును ఖాతాలో చూపారు. బేగంపేటలో నివాసముంటున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కొద్దిరోజుల క్రితం వీరి వలలో పడి రూ.63 లక్షలు పోగొట్టుకున్నాడు. అంతకుముందు సైబర్‌ నేరస్థులు అతడి ఖాతాలో రూ.4.5 కోట్ల నగదు నిల్వలు చూపించారు. ఇలా బిట్‌కాయిన్‌ పేరుతో వచ్చే ఫోన్లకు ఆకర్షితులు కావొద్దని, క్రిప్టో కరెన్సీ పేరుతో ఉన్న వాట్సప్‌ బృందాల్లో మిమ్మల్ని చేర్చితే వెంటనే బయటకు రావాలని సైబర్‌క్రైమ్‌ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ సూచించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన