వివిధ ఉత్సవాలు..
ఇక్కడి సిద్ధి వినాయకుని మూలవిరాట్ అత్యంత ప్రాచీనమైంది. రోజూ స్వామికి వివిధ పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అభిషేక సేవకు ఈ ఆలయంలో విశేష ప్రాముఖ్యం ఉంది. శివకేశవులకు ప్రీతికరమైన వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పాంచాహ్నిక దీక్షతో అయిదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పూర్ణిమనాడు కల్యాణం.. గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మకర సంక్రాంతి, కనుమనాడు ప్రభల ఉత్సవం చేస్తారు.
విజయదశమి, కార్తీకమాసం మొదటి, నాలుగు సోమవారాలు, కృష్ణాష్టమినాడు ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఏటా మాఘ మాసంలో చదువుల పండుగ జరుగుతుంది. పండగలో భాగంగా గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు. లక్ష కలములను సిద్ది వినాయకుని పాదాల వద్ద ఉంచి... లక్ష దూర్వములతో పూజిస్తారు. అనంతరం ఆ పెన్నులను విద్యార్థులకు పంచుతారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు, చదువులో రాణిస్తారని భక్తుల విశ్వాసం.
|
ఇలా చేరుకోవాలి...
రాజమహేంద్రవరం నుంచి అయినవిల్లికి బస్సు సౌకర్యం ఉంది. అమలాపురం నుంచి బస్సు, ఆటోలో దేవాలయాన్ని చేరుకోవచ్చు. కాకినాడ నుంచి యానాం, అమలాపురం, ముక్తేశ్వరం మీదుగా అయినవిల్లి చేరుకోవచ్చు.
|
సేవలు- రుసుము
అభిషేకం- రూ.150/-
శ్రీలక్ష్మీ గణపతి హోమం - రూ.300/-
వివిధ పండ్ల రసాలతో ఏకాదశ రుద్రాభిషేకం- రూ.250/-(వినాయక చవితి సందర్భంగా)
రుద్రాభిషేకం, లక్ష దూర్వార్చన- రూ.250/-(వినాయక చవితి సందర్భంగా)
శ్రీ గణపతి, సరస్వతీకల్ప ప్రయుక్త సప్తనదీజలాభిషేక, లక్ష కలముల వితరణ మహోత్సవం. - రూ.550/-(మాఘ మాసంలో)
|