దర్శన సమయాలు
⇒ వేకువజామున 4 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం భోజన సమయంలో కాసేపు దర్శనాన్ని నిలిపివేస్తారు.
⇒ ఆలయంలో చేసే ప్రధాన పూజలు: ఇంద్రకీలాద్రిపై ఖడ్గమాల, లక్ష కుంకుమార్చన, స్వర్ణపుష్పాలతో అర్చన, శ్రీ చక్రార్చన, చండీహోమం, శాంతి కల్యాణం ప్రధానపూజలు.
⇒ ఖడ్గమాల పూజ తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సేవలో పాల్గొనే భక్తులు రూ. 516 చెల్లించి వేకువజామున 4 గంటలకు ఆలయానికి చేరుకోవాలి. రెండుగంటల పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ పూజ జరుగుతుంది. ఒక టిక్కెట్టుపై దంపతులను అనుమతిస్తారు.
⇒ మిగతా పూజలకూ రుసుం.. రూ. 516 మాత్రమే. ఈ పూజలు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. ఒక టిక్కెట్టుపై దంపతులు పాల్గొనవచ్చు. ఈ పూజల కోసం ఉదయం 8 గంటలకే ఆలయానికి చేరుకోవాలి. ప్రధానమైన పూజల్లో స్వర్ణపుష్ప పూజ ఒకటి. ప్రతి గురువారం సాయంత్రం 5.15 గంటల నుంచి 6.30 గంటల వరకు అమ్మవారి అంతరాలయంలో 108 స్వర్ణపుష్పాలతో జరిగే ఈ పూజలో భక్తులు రూ. 2,500 చెల్లించి పాల్గొనవచ్చు. కేవలం ఏడు టిక్కెట్లు మాత్రమే ఇస్తారు.
⇒ రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు హారతుల సమయం. ఈ సమయంలో అమ్మవారి హారతులు తిలకించేందుకు రూ. 200 టిక్కెట్టు తీసుకుంటే.. ఒక టిక్కెట్టుపై ఇద్దరు చొప్పున అనుమతిస్తారు. స్థలాభావం కారణంగా కేవలం 20 టిక్కెట్లు మాత్రమే రోజూ సాయంత్రం 4 గంటల నుంచి దేవస్థానం అధికారులు కౌంటరులో విక్రయిస్తారు. దసరా ఉత్సవాలు, భవానీదీక్షలు, బ్రహ్మోత్సవాల సమయంలో కాకుండా ఈ పూజలు నిర్వహించుకోవచ్చు. పూజలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్రం, రవిక, లడ్డూప్రసాదం అందజేస్తారు.
|