రుణం ఇప్పించాలన్నా వాటా!
eenadu telugu news
Published : 25/09/2021 02:20 IST

రుణం ఇప్పించాలన్నా వాటా!

డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి అక్రమ వసూళ్లు 
పలుచోట్ల ఆర్పీలు, యానిమేటర్ల చేతివాటం 


డ్వాకా మహిళలు 

న్యూస్‌టుడే, పిడుగురాళ్ల  స్వయం సహాయక సంఘాల ఆర్థికాభ్యున్నతికి దోహదపడాల్సిన కొందరు యానిమేటర్లు, ఆర్పీలు ప్రతిఫలం లేకుండా ఏ పని చేయడం లేదు. ఈ విషయంలో సంతృప్తి చెందితేనే బ్యాంకుల నుంచి వారికి రుణాలు మంజూరయ్యేలా చూస్తున్నారు. వీరి వసూళ్ల పర్వంపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. వెలుగు యానిమేటర్లు, మెప్మా ఆర్పీలు ఒక్కొక్క గ్రూపు దగ్గర రూ.4వేల నుంచి రూ.10వేల దాకా పట్టుబట్టి వసూలు చేస్తున్నారు. గ్రామాల్లో వసూలు చేసిన డబ్బులో యానిమేటర్లు నుంచి వెలుగు కార్యాలయ అధికారులు దాకా, అదే పట్టణాల్లో అయితే ఆర్పీల నుంచి మెప్మా అధికారుల వరకు పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రతి నెలా కొంత డబ్బును పొదుపు చేసుకొని దానిని బ్యాంకులో జమ చేస్తారు. పొదుపు చేసిన డబ్బు ఆధారంగా బ్యాంకు వారికి స్వయం ఉపాధి నిమిత్తం రుణాలు మంజూరు చేస్తుంది. రికార్డుల నిర్వహణ, తీర్మానాలు రాయడం కోసం, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో అయితే యానిమేటర్లు, పట్టణాల్లో అయితే ఆర్పీలను ఏర్పాటు చేసింది. అయితే యానిమేటర్లు, ఆర్పీలు మాత్రం రుణాలు ఇప్పించినందుకు డబ్బులు వసూలు చేస్తూ అక్రమ సంపాదనకు తెరలేపుతున్నారు.

 

* పట్టణంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణం ఇప్పించినందుకు ఓ ఆర్పీ రూ.9 వేలు వసూలు చేశారు. మీకు జీతం వస్తుంది కదా డబ్బులు ఎందుకివ్వాలని సభ్యులు ప్రశ్నిస్తే వారిని నోటికొచ్చినట్లు తిట్టారని ఓ సభ్యురాలు వాపోయారు.

* పిడుగురాళ్ల శివారు ప్రాంతానికి చెందిన ఓ ఆర్పీ రుణం ఇప్పించినందుకు పది శాతం డబ్బులు ఇవ్వాల్సిందేనని సభ్యులు దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు మరో సభ్యురాలు ఆవేదన వ్యక్తం చేసింది. 

* పిడుగురాళ్ల మండలంలోని అద్దంకి నార్కట్‌పల్లిరోడ్డుకు ఆనుకొని ఉన్న గ్రామానికి చెందిన  యానిమేటరు లక్ష రూపాయలకు రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. అదేమని సభ్యులు అడిగితే బ్యాంకుల చుట్టూ తిరిగి ఇప్పించినందుకు ఇవ్వాలన్నట్లు చెబుతున్నారు. 

పొదుపు ఆధారంగా రుణాలు 
జిల్లాలోని 14 పురపాలక సంఘాల్లో 21వేల స్వయం సహాయక సంఘాలున్నాయి. ఇందులో  2.10లక్షల మంది సభ్యులున్నారు. ఈ సంఘాలకు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.102 కోట్లు రుణాలు బ్యాంకు లింకేజీ కింద అందజేశారు. సభ్యత్వం ఉన్న మహిళలు నెలనెలా కొంత సొమ్మును పొదుపు చేసుకొని బ్యాంకులో జమ చేసుకుంటారు. వీరి పొదుపు ఆధారంగా బ్యాంకులు ఆ సంఘాలకు రూ.10 లక్షలు వరకు రుణాలు అందజేస్తున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించినందుకు, రికార్డుల నిర్వహణకు యానిమేటర్లుకు ప్రభుత్వం గౌరవ వేతనం కింద రూ. 8వేలు అందజేస్తుంది. దాంతోపాటు గ్రామ సమాఖ్య నుంచి రూ.2వేలు వస్తుంది. అదేవిధంగా ఆర్పీలకు ప్రభుత్వం రూ.8వేలు, పట్టణ సమాఖ్య నుంచి రూ.2వేలు వస్తుంది. ప్రతి నెలా యానిమేటర్లు, ఆర్పీలకు రూ.10 వేలు గౌరవ వేతనంగా వస్తుంది. కానీ వీరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. 

ఆసరాలోనూ..
రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభ్యున్నతికోసం నవరత్నాల్లో భాగంగా ప్రవేశపెట్టిన వైస్సార్‌ ఆసరా పథకం అమలులోను ఆర్పీలు అవినీతికి పాల్పడుతున్నారు. ఆసరా పథకానికి ఇప్పటికే స్వయం సహాయక సంఘాల సభ్యుల నుంచి బయోమెట్రిక్‌ పూర్తి చేశారు. వారు తీసుకున్న రుణాన్ని బట్టీ సభ్యుల ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేయనుంది. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల ఆర్పీలు సభ్యులను డబ్బులు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. బ్యాంకులో డబ్బులు డిపాజిట్‌ చేసిన వెంటనే సంఘం లీడర్లు నగదు వసూలు చేసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మా పైఅధికారులకు ఇవ్వాలంటూ ఆర్పీలు చెబుతున్నట్లు సంఘ సభ్యులు వాపోతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే రుణం ఇప్పించరని వారు అడిగిన కాడికి ముట్టచెబుతున్నారు. 

అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు 
రుణాల మంజూరు విషయంలో ఆరోపణలు వస్తే బాధ్యులను వెంటనే తొలగిస్తాం. బాధ్యతలు చేపట్టి నెల కావస్తోంది. ఈ సమయంలో ఆరోపణలు వచ్చిన ఐదుగురు ఆర్పీలను తొలగించా. మెప్మా సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయి. 
-పి.వెంకటనారాయణ, మెప్మా పీడీ 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని