‘కనీస వేతనాల అమల్లో ప్రభుత్వాలు విఫలం’
eenadu telugu news
Published : 25/09/2021 02:20 IST

‘కనీస వేతనాల అమల్లో ప్రభుత్వాలు విఫలం’


ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, నాయకులు

రేపల్లె, నగరం, బాపట్ల, న్యూస్‌టుడే : స్కీమ్‌ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ అధ్యక్షుడు పి.నాగాంజనేయులు డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ పిలుపు మేరకు ఈ నెల 27న దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా స్థానిక తాలూకా కార్యాలయం కూడలిలో శుక్రవారం అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు. నాగాంజనేయులు మాట్లాడుతూ స్కీమ్‌ వర్కర్లకు ప్రకటించిన కనీస వేతనాలు అమలుపరచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న స్కీమ్‌ వర్కర్ల హక్కులను పాలక ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని దుయ్యబట్టారు. సీపీఐ రేపల్లె సమితి కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ ప్రారంభించిన ఈ ధర్నాలో అంగన్‌వాడీ వర్కర్ల సంఘం రాష్ట్ర సమితి నాయకులు డి.ధనలక్ష్మి, నాగమల్లేశ్వరమ్మ, రత్తమ్మ, దుర్గ, విజయకుమారి, నాగలక్ష్మి, గౌరి, అరుణ, శ్రీస్వరూప, సునీత, మరియమ్మ, ఏఐటీయూసీ రేపల్లె సమితి అధ్యక్షుడు కన్నెగంటి రమేష్‌బాబు, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేపల్లెలో సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, నగరం, బాపట్లలో అగన్‌వాడీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నేతలు మణిలాల్, కేవీ లక్ష్మణరావు, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల పట్టణం : సమ్మెను విజయవంతం చేయడానికి బాపట్లలోని ఎస్‌.ఎన్‌.పి.అగ్రహారంలో పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో శుక్రవారం ప్రజాసంఘాల నేతలు సమావేశమయ్యారు. ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమని అప్పారావు, సీపీఐ ప్రాంతీయ కార్యదర్శి జేబీ శ్రీధర్, నేతలు కరిముల్లా, గుదె రాజారావు, ముత్తిరెడ్డి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
అమలుకు నోచుకోని కార్మిక చట్టాలు..
గుళ్లపల్లి(చెరుకుపల్లి గ్రామీణ): దేశంలో కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని సీఐటీయూ రేపల్లె డివిజన్‌ అధ్యక్షుడు కె.శరత్‌ విమర్శించారు. కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో గుళ్లపల్లిలో అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన నిర్వాహకులతో కలసి ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థి కోచింగ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ సదాశివరావు, కార్మిక నేతలు మంగాదేవి, మల్లీశ్వరి, కుమారి, పంకజం పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని