Duggirala MPP: ఉత్కంఠ రేపుతున్న దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక .. రెండో రోజు వాయిదా
eenadu telugu news
Updated : 25/09/2021 18:52 IST

Duggirala MPP: ఉత్కంఠ రేపుతున్న దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక .. రెండో రోజు వాయిదా

దుగ్గిరాల: రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై సందిగ్ధత కొనసాగుతోంది. రెండో రోజు నిర్వహించిన సమావేశానికి తెలుగుదేశం, జనసేన ఎంపీటీసీ సభ్యులు దూరంగా ఉన్నారు. వరుసగా రెండో రోజు ఎంపీపీ ఎన్నికకు సరైన కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేశారు. వరుసగా రెండోసారి కోరం లేనందున తదుపరి చర్యల కోసం రాష్ట్ర ఎన్నికల అధికారికి తెలియజేస్తామని రిటర్నింగ్‌ అధికారి రాం ప్రసన్న తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన తేదీ ప్రకారం మళ్లీ ఎంపీపీ ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా దుగ్గిరాల మండల పరిషత్‌ పీఠం వైకాపా కైవసం చేసుకుంటుందని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో అన్నారు.

ఎంపీపీ పదవిని ఎలాగైనా దక్కించుకుకోవాలని అధికార వైకాపా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మండలంలో తెదేపా అత్యధిక ఎంపీటీసీ స్థానాలను గెలుపొందింది. అయితే ఆ పార్టీ ఎంపీపీ అభ్యర్థి షేక్‌ జబీనాకు కుల ధ్రువీకరణ పత్రం రాకపోవడంతో తెదేపా ఎంపీటీసీలు ఎంపీపీ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. దుగ్గిరాల మండలంలో అధికార వైకాపాకు 8, జనసేనకు 1, తెదేపాకు 9 ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. ఎంపీపీ ఎన్నిక జరగాలంటే కనీసం 9 మంది ఎంపీటీసీలు హాజరుకావాల్సి ఉంటుంది. తెదేపా సభ్యులు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికకు జనసేన ఎంపీటీసీ సభ్యుడి ఓటు కీలకం కానుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని