ఐదుగురు వీఆర్వోల బదిలీలు
eenadu telugu news
Published : 22/10/2021 05:24 IST

ఐదుగురు వీఆర్వోల బదిలీలు

మాచవరం, న్యూస్‌టుడే: మాచవరం మండలంలో ఇష్టారాజ్యంగా ఆన్‌లైన్‌లో మార్పులు చేర్పులు చేసి, వందల ఎకరాలను అక్రమార్కుల పేర్లతో నమోదు చేయడంపై జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. గత నెల 14న ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘ఆన్‌లైన్‌లో భూమాయ’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన కలెక్టర్‌ విచారణాధికారిగా పులిచింతల ప్రత్యేక కలెక్టర్‌ను నియమించారు. ఆయన ఆన్‌లైన్‌లో అక్రమాలు నిజమేనని నివేదిక అందజేయడంతో, ప్రస్తుతం వీఆర్వోలపై చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లపై వేటు పడగా, మిగిలిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రమేయంపై మాచవరం పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ స్థానిక తహశీల్దారును ఆదేశించారు. ఆన్‌లైన్‌లో పెద్దఎత్తున సర్వే నెంబర్లు సృష్టించడం, భూమి లేకున్నా విస్తీర్ణం పెంచడం, ప్రభుత్వ, అసైన్డు భూముల స్థానంలో పట్టా, అనువంశకం నమోదు చేయడం, అసలైన పట్టా భూముల విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేశారు. అక్రమార్కులు గ్రామీణ బ్యాంకులు, వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రూ.కోట్లలో వ్యవసాయ రుణాలు పొందారు. ఈనేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదురుగు వీఆర్వోలపై తాజాగా బదిలీ వేటుపడింది. మాచవరం మండలం పిన్నెల్లి-2 వీఆర్వోగా పనిచేస్తున్న పుల్లయ్యను వట్టిచెరుకూరు మండలం సోపాడు, మోర్జంపాడు-1 వీఆర్వో కోటేశ్వరరావును కాకుమాను మండలం చినలింగాయపాలెం గ్రామానికి బదిలీ చేశారు. అలాగే వేమవరం వీఆర్వోగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణను బెల్లంకొండ మండలం మన్నెసుల్తాన్‌పాలెం, తురకపాలెం వీఆర్వో రామారావును ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు-1, చెన్నాయపాలెం వీఆర్వో ఎస్‌కె అబ్దుల్‌నబీని పొన్నూరు మండలం కొండమూడికి పంపారు. ఈమేరకు జిల్లా అధికారులు మాచవరం తహశీల్దారుకు ఉత్తర్వులు జారీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని