వేధించాడని.. కసితో చంపేశారు
eenadu telugu news
Published : 18/09/2021 03:29 IST

వేధించాడని.. కసితో చంపేశారు

వారం రోజుల్లో హత్య కేసు ఛేదించిన పోలీసులు

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఇన్‌ఛార్జి ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర

ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే : ప్రేమ పేరిట వేధింపులకు పాల్పడుతున్నాడని ఒక యువకుడిని ప్రణాళికాబద్ధంగా యువతి కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేసి.. పెట్రోల్‌ పోసి కాల్చేసి పొదల్లో పడేశారు. ఈ హత్య ఘటనను పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. నిందితులను అరెస్టు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు.

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం మాకోడకు చెందిన బురత్కర్‌ చైతన్య(22) 2018లో పట్టణంలోని ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన పథకంలో శిక్షణ పొందుతున్న సమయంలో ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించేవాడు. ఆమెకు ఇష్టం లేకున్నా లైంగికంగా వేధించేవాడు. ఆమె వివాహం రాంనగర్‌కు చెందిన మావురపు రాజశేఖర్‌తో జూన్‌ 28న జరిగినా చైతన్య వేధించటం మానలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పథకం ప్రకారం ఈ నెల 9న ఆమె ద్వారా చైతన్యకు ఫోన్‌ చేయించి ఇంటికి పిలిపించారు. చైతన్యం 11.30కి ద్విచక్ర వాహనంపై రాంనగర్‌లోని నిందితురాలి ఇంటికి రాగా అప్పటికే ఇంట్లో మాటు వేసి ఉన్న ఏడుగురు కుటుంబ సభ్యులు అతడిపై దాడి చేసి మూతికి టేప్‌ వేసి పార, కట్టెలతో కొట్టి హత్య చేశారు. అనంతరం పరుపులో చుట్టి ఎవరికి అనుమానం రాకుండా ఇల్లు ఖాళీ చేస్తున్నట్లు నటిస్తూ ఆటోలో వేసుకొని మావల పెట్రోలు బంకులో పెట్రోలు కొనుగోలు చేశారు. తలమడుగు మండలం దేవాపూర్‌ శివారు ప్రాంతంలో మృతదేహాన్ని తగుల బెట్టారు. బాధితుని కుటుంబ సభ్యులు తమ కుమారుడు కనిపించటం లేదని ఆదిలాబాద్‌ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదైంది. దేవాపూర్‌ శివారు ప్రాంతంలో కాలిన శవం గుర్తించిన తలమడుగు ఎస్‌ఐ దివ్యభారతి ఈ నెల 14న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మిస్సింగ్‌ కేసు నమోదు కావటం, కాలిపోయిన యువకుని శవం దొరకటం జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ ప్రత్యేకంగా డీఎస్పీ ఎన్‌ఎస్‌వీ వెంకటేశ్వర్‌రావు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. కాలిన శవం చైతన్యదిగా నాలుగు రోజుల్లోనే పోలీసులు గుర్తించారు. ఫోన్‌ వివరాలు, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా కూపీలాగి నిందితుల వివరాలను తెలుసుకున్నారు. హత్య చేసిన మావురపు రాజశేఖర్‌, భార్య(సదరు యువతి), మావురపు చంద్రశేఖర్‌, రొడ్డ సాయికిరణ్‌, మావురపు శైలజ, వీరితో పాటు ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరు పర్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని