Updated : 03/03/2021 07:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బేరాలు.. బెదిరింపులు

ఈనాడు, అమరావతి

‘మీరు పోటీ చేసినా గెలవరు..
మేము ఇచ్చింది తీసుకో..
అయిదా.. పదా.. అడుగు..’

- పురపోరులో పోటీ చేస్తున్న అభ్యర్థులకు వస్తున్న అవకాశాలు ఇవి.

సాధారణంగా ఎన్నికల్లో ఓటర్లకు గాలం వేస్తూ ప్రలోభాలకు గురి చేస్తుంటారు. కానీ ప్రస్తుతం కౌన్సిలర్‌, కార్పొరేటర్లకే ఆఫర్ల మీద ఆఫర్లు అందుతున్నాయి. అభ్యర్థులను లాగేసేందుకు అధికారపక్షం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తమ అభ్యర్థులను పోటీలో ఉంచడానికి విపక్షాలు నానా తంటాలు పడుతున్నాయి. ఇంకా ఒక్క రోజు కాపాడుకోవడానికి నాయకులు తాపత్రయపడుతున్నారు. నూజివీడులో తొలి రోజు ఒక వార్డు ఏకగ్రీవం అయింది. మరికొన్నింటికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమన్వయం లేమి, నాయకత్వం లోపంతో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు సతమతమవుతన్నారు. మరోవైపు ఎదురుపక్షం ఇస్తున్న ఆఫర్లకు ఊగిసలాడుతున్నారు. నందిగామ నగర పంచాయతీలో ఏకంగా తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు తెదేపా నేతలు వారిని తీసుకొని రహస్య ప్రాంతానికి వెళ్లారు. ఒక్క రోజు కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

వ్యూహ ప్రతివ్యూహాలు..!

పురపోరు రసకందాయంలో పడింది. ప్రస్తుతం నామినేషన్ల ఉపసంహరణ ప్రారంభమైంది. దీంతో ప్రత్యర్థులను ప్రలోభాలకు గురి చేయడమో.. సున్నితంగా హెచ్చరికలు చేయడమో చేస్తున్నారు. జిల్లాలో రెండు కార్పొరేషన్‌లతో పాటు రెండు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. తెరవెనుక హేమాహేమీలు చక్రం తిప్పుతున్నారు. వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. పట్టణ ప్రాంత ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా ఎందుకని ముందుగానే ఏకగ్రీవం చేసుకుంటే మంచిదని రంగంలోకి దిగారు. బలవంతమైన ప్రత్యర్థులకు గాలం వేస్తున్నారు. జాతీయ రహదారిపై ఉన్న నందిగామ నగరపంచాయతీ జనరల్‌ మహిళకు రిజర్వు అయింది. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వు అయిన విషయం తెలిసిందే. 20 వార్డులు ఉన్న నందిగామలో ప్రత్యర్థులకు భారీగా వల పన్నుతున్నారు. రూ.5లక్షల వరకు ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిసింది. లేదంటే పోటీ చేస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నట్లు వాపోతున్నారు. తమ అభ్యర్థులు బయట ఉంటే ఎక్కడ ఎత్తుకెళ్లి ఉపసంహరింప చేస్తారోనని 20 మంది అభ్యర్థులతో తెదేపా రహస్యప్రాంతానికి వెళ్లింది. నందిగామలో పోరు నువ్వానేనా అన్నట్లు ఉంది. ఇక్కడ నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు అధికార పార్టీ తరఫున, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెదేపా తరఫున ప్రచారం చేస్తున్నారు. తెరవెనుక ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి. తిరువూరు నగర పంచాయతీలోనూ 20 వార్డులు ఉన్నాయి. ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయిన ఈ మున్సిపాలిటీలో పోటీ హోరాహోరీ ఉన్నా ప్రతిపక్షానికి దిశా నిర్దేశం లేదు. అప్పుడే బేరసారాలు ప్రారంభమయ్యాయి. కొంతమంది అభ్యర్థులపై వల విసురుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ ఇన్‌ఛార్జిగా మాజీ మంత్రి జవహర్‌బాబు వ్యవహరిస్తున్నారు. ఆయన కోవూరులో ఉన్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలకు ఒకటీ రెండు రోజులు వచ్చి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు సమావేశం నిర్వహించి వార్డుల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కానీ అభ్యర్థులకు దిశానిర్దేశం లేదు. వైకాపా తరఫున ఎమ్మెల్యే రక్షణ నిధి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉయ్యూరు నగర పంచాయతీలోనూ సమీకరణాలు మారుతున్నాయి. అభ్యర్థులకు అధికార పార్టీ వల విసురుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నూజివీడు పురపాలక సంఘంలో

మొత్తం 32 వార్డులు ఉన్నాయి. ఒకటి ఏకగ్రీవం అయింది. తెదేపా తరఫున నామినేషన్‌ వేసిన అభ్యర్థి ఉపసంహరించుకున్నారు. ఇక్కడ తెదేపాకు దిశానిర్దేశం లేదన్న విమర్శ ఉంది. ఇన్‌ఛార్జి ముద్దరబోయిన అంత క్రియాశీలకంగా పాల్గొనడం లేదు. ప్రధానంగా అభ్యర్థులకు వనరులు సమకూర్చుకోలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. మరికొన్ని ఏకగ్రీవాలకు అధికార పక్షం ప్రయత్నాలు చేస్తోంది. వైకాపా తరఫున ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు ప్రచారం నిర్వహిస్తున్నారు. పెడన పురపాలక సంఘంలో 23 వార్డులు ఉన్నాయి. ప్రస్తుతానికి తెదేపా, జనసేన అభ్యర్థులను నిలిపింది. తెరవెనుక ప్రయత్నాలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల అనంతరం పెడన ఎమ్మెల్యే కొంత నెమ్మదించారు. ఇక్కడ కూడా ఏకగ్రీవాలకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. మెజారిటీ వార్డులు గెలిచేందుకు బలమైన ప్రత్యర్థులను ఉపసంహరింప చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కార్పొరేషన్‌లలో..!

విజయవాడ, బందరు కార్పొరేషన్‌లలో ప్రచారం ఊపందుకుంది. నేతలు రంగంలోకి దిగారు. బందరులో తెదేపా తరఫున మాజీ ఎంపీ కొనకొళ్ల నారాయణ, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రంగంలోకి దిగారు. వైకాపా తరఫున మంత్రి పేర్ని వెంకట్రామయ్య ప్రచారం నిర్వహిస్తున్నారు. కొంత మంది అభ్యర్థులకు వల విసిరారన్న ప్రచారం జరిగింది. అయితే వ్యక్తిగత కారణాలతో ఒకరిద్దరు ఉపసంహరింప చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక్కడ పోరు హోరాహోరీగా సాగుతోంది. విజయవాడ కార్పొరేషన్‌లో ప్రచారం ఊపందుకుంది. ఎంపీ కేశినేని నాని తెదేపా తరఫున బాధ్యతలు తీసుకొని ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, తెదేపా అధికార ప్రతినిధి నాగుల్‌మీరా మంగళవారం నుంచి ప్రచారంలోకి దూకారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ కేశినేనితో పాటు వీరు ప్రచారం చేస్తున్నారు. వైకాపా తరఫున మంత్రి వెలంపల్లి ముమ్మరంగా తిరుగుతున్నారు. మధ్య నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తెదేపా తరఫున పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమా ప్రచారం చేస్తున్నారు. తూర్పులో తెదేపా తరఫున ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, వైకాపా తరఫున దేవినేని అవినాష్‌ డివిజన్లలో పర్యటిస్తున్నారు. తెదేపాలో రెండు వార్డులలో అభ్యర్థుల ఖరారుపై వివాదం నెలకొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని