Updated : 08/04/2021 04:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వివాదాల ప్రయాణం ముగిసింది

ఈనాడు, అమరావతి

దుర్గగుడి ఈవో ఎం.వి.సురేష్‌బాబు ఎట్టకేలకు బదిలీ అయ్యారు. దేవాదాయశాఖలో ఆర్‌జేసీగా విధులు నిర్వహిస్తున్న డి.భ్రమరాంబను దుర్గగుడి కొత్త ఈవోగా ప్రభుత్వం నియమించింది. 2019 ఆగస్టులో దుర్గగుడి ఈవోగా సురేష్‌బాబు నియమితులయ్యారు. సరిగ్గా 17 నెలలు ఈవోగా కొనసాగారు. సురేష్‌బాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఆలయానికి చెందిన శానిటేషన్‌, సెక్యూరిటీ సహా ప్రధాన టెండర్ల విషయంలో పక్షపాత ధోరణి, వెండి సింహాల చోరీ, ఆలయంలోని ఉద్యోగులతో సఖ్యత లేకపోవడం, ప్రతి విభాగంలోనూ పెరిగిపోయిన అవకతవకలు, పరిపాలన విభాగంపై పట్టులేకపోవడం.. వంటి అనేక వివాదాలు ఈ ఏడాదిన్నర కాలంలో సురేష్‌బాబును వెంటాడాయి. తాజాగా ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలతో సురేష్‌బాబు హయాంలో జరిగిన అవకతవకలు, వివాదాలు వెలుగుచూశాయి. ఆలయానికి చెందిన ప్రతి విభాగంలోనూ అనేక అక్రమాలు బయటపడ్డాయి. ఏసీబీ రెండు నెలల క్రితం ప్రాథమిక నివేదిక ఇచ్చిన వెంటనే.. ఏఏ విభాగాల్లో అక్రమాలు జరిగాయో.. వాటన్నింటికీ బాధ్యులైన 15 మంది కిందిస్థాయి సిబ్బందిపై దేవాదాయశాఖ కమిషనర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. కానీ ఆయా విభాగాల బాధ్యులుగా ఉన్న ఏఈవో, ఈవోపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి నుంచి ఈవోపై చర్యలు లేదంటే బదిలీ ఉండొచ్చని గట్టిగా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈవో సురేష్‌బాబను రాజమండ్రి ఆర్‌జేసీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అనుకూలమైన వారికి టెండర్లు..
పారిశుద్ధ్యం, సెక్యూరిటీ టెండర్లను తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టేందుకు నిబంధనలను కాలరాశారనే ఆరోపణలు ఈవో సురేష్‌బాబుపై ఉన్నాయి. 2019 దసరా ఉత్సవాల సమయంలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం టెండర్‌ పిలిచారు. టెండర్‌లో అర్హత సాధించిన ఎల్‌1, ఎల్‌2ను వేర్వేరు సాకులు చూపి పక్కనబెట్టి.. మూడో స్థానంలో ఉన్న తమ అనుకూలుడైన ఎల్‌3కి ఇచ్చారు. దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత మరో రెండేళ్లకు సదరు సంస్థను కొనసాగించేలా గోప్యంగా ఒప్పందం రాసి ఇచ్చేశారు. దేవాదాయశాఖ కమిషనర్‌ అనుమతి లేకుండా ఇలా చేయడం చట్టవిరుద్ధం. ఏడాది తర్వాత సదరు సంస్థపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కొత్తగా టెండర్లు పిలవాలంటూ కమిషనర్‌ ఆదేశించారు. దీంతో ఈవో కొత్తగా టెండర్లు పిలిచారు. టెండర్లు పిలవడానికి ముందే పాత సంస్థకు రాసి ఇచ్చిన రెండేళ్ల ఒప్పందాన్ని రద్దు చేయాల్సి ఉంది. కానీ అలా చేయకుండా కమిషనర్‌ చెప్పారు కనుక తూతూమంత్రంగా టెండర్లు పిలిచారు. తీరా చూస్తే తమకు రెండేళ్లకు ఒప్పందం ఉందంటూ పాత సంస్థ న్యాయస్థానానికి వెళ్లింది. ఒప్పందం రద్దు చేయకుండా టెండర్లు పిలిస్తే పాత సంస్థ కోర్టుకు వెళ్తుందనే విషయం దుర్గగుడిలో విధులు నిర్వహించే కింది స్థాయి గుమస్తాకు సైతం తెలుసు. కావాలనే సదరు సంస్థను న్యాయస్థానానికి వెళ్లేలా దుర్గగుడి అధికారులే ప్రోత్సహించారనేది అందరికీ తెలిసిన వాస్తవం. తాజాగా ఏసీబీ నివేదికలోనూ ఇదే విషయాన్ని ఎత్తి చూపించారు. సెక్యూరిటీ టెండర్‌ విషయంలోనూ బాధ్యతలు నిర్వహిస్తున్న పాత సంస్థకే మరో ఏడాది పొడిగించేందుకు ఫైల్‌ను తయారు చేసి దేవాదాయశాఖ కమిషనర్‌కు ఈవో పంపించారు. నిబంధనలకు ఇది విరుద్ధమంటూ కమిషనర్‌ తిరస్కరించారు. కొత్తగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. దీంతో మరోసారి టెండర్లు పిలిచి.. నిబంధనలన్నీ పాత సంస్థకే అనుకూలంగా ఉండేలా మార్చి వారికే మళ్లీ టెండర్‌ వచ్చేలా చేశారు. ఫైల్‌ కమిషనర్‌కు పంపించారు. పాత వాళ్లకే మళ్లీ టెండర్‌ ఇవ్వడం, వెండి సింహాల చోరీకి జరగడానికి ఈ సంస్థ నిర్లక్ష్యమే కారణమని అంతా తేల్చడంతో ఇంతవరకు ఫైల్‌ను కమిషనర్‌ ఆమోదించలేదు. కానీ సదరు సంస్థే ఇప్పటికీ కొనసాగుతోంది.  
వెండి సింహాల చోరీతో..
ఆలయ ప్రాంగణంలో ఉంచిన వెండి సింహాల చోరీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో నిర్మానుష్యంగా ఉన్న ఆలయ ప్రాంగణంలో అంతమంది సిబ్బంది, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండగా ఇలాంటి ఘటన జరగడం పూర్తిగా ఆలయ అధికారుల నిర్లక్ష్యమే. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని పోలీసులు కూడా తేల్చారు. కనీసం చోరీ చేసిన వారు ఎవరనేది గుర్తించేందుకు అవసరమైన సీసీ కెమెరా ఫుటేజీ కూడా ఆలయంలో లేదు. కానీ ఈ ఘటనకు బాధ్యులుగా ఒక్కరిపైనా చర్యలు లేవు. కాపలాగా ఉన్న సెక్యూరిటీ సంస్థదే పూర్తి బాధ్యత అని చెప్పిన ఈవో.. తిరిగి అదే సంస్థకు మళ్లీ ఏడాదికి టెండర్‌ కట్టబెట్టేందుకు ప్రయత్నించడం వివాదానికి దారి తీసింది.
గాడితప్పిన పాలన విభాగం
ఏడాదిన్నరలో ఆలయంలోని పరిపాలన విభాగం పూర్తిగా గాడి తప్పింది. టిక్కెట్ల పునర్వినియోగం లాంటివి పెరిగిపోయాయి. ఆలయ ఆదాయానికి గండి కొడుతూ పాత టిక్కెట్లను భక్తులకు విక్రయిస్తూ కొందరు అడ్డంగా దొరికినా.. వారిపై ఫిర్యాదు చేసేందుకు మూడు నాలుగు రోజుల సమయం తీసుకున్నారు. దీని వెనుక ఆలయానికి చెందిన కొంత మంది సిబ్బంది హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహించే కొంతమంది సిబ్బంది ఇలా అడ్డదారిలో డబ్బులకు అలవాటుపడి చాలాకాలంగా టిక్కెట్ల పునర్వినియోగానికి సహకరిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టిక్కెట్లను విక్రయిస్తూ వన్‌టౌన్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు దొరికినా ఆలయంలో ప్రక్షాళన చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించలేదు.
ఏసీబీ తనిఖీలతో బయటపడ్డ లోపాలు...
ఏసీబీ అధికారులు ఫిబ్రవరి నెలలో వరుసగా ఐదు రోజులు ఆలయంలో తనిఖీలు చేశారు. అన్ని విభాగాల ఫైళ్లను లోతుగా పరిశీలించారు. అనేక అవకతవకలను గుర్తించారు. ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేశారు. దీనిలో ఈవో సురేష్‌బాబు వైఫల్యాలను స్పష్టంగా పేర్కొన్నారు. దుర్గగుడికి సంబంధించిన అనేక విభాగాలకు చెందిన బిల్లులను ఎలాంటి ఆడిట్‌ అనుమతులు లేకుండా ఆమోదించినట్టు ఏసీబీ నివేదికలో పేర్కొన్నారు. దర్శనం టిక్కెట్లు, చీరల విభాగం, దేవస్థానానికి సంబంధించిన స్టోర్స్‌, అన్నదానం.. ఇలా ప్రతి విభాగంలోనూ అనేక అవకతవకలను ఏసీబీ గుర్తించింది. ప్రస్తుతం ఏసీబీ పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేసి త్వరలో ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ నేపథ్యంలోనే దుర్గగుడి ఈవో సురేష్‌బాబుపై బదిలీ వేటు పడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని