Published : 12/04/2021 02:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తనిఖీలు ఆపేశారు..!

నేతల నుంచి ఫోన్ల మోత?

హడావుడిగా సరకు కోర్టులోకి..

ఈనాడు-అమరావతి

మూడు రోజుల క్రితం గుంటూరులోని ఓ కారం మిల్లులో తొడిమలతో కూడిన మిరపకాయలను

పరిశీలిస్తున్న తనిఖీ అధికారులు (పాతచిత్రం)

ఆహార భద్రత, ప్రమాణాల చట్టం నిబంధనలు ఉల్లంఘించి కారం తయారు చేసి విక్రయాలు చేస్తున్న మిల్లులతో పాటు నగరపాలక నుంచి డీఎన్‌ఓ లైసెన్సులు తీసుకోకుండా నడుపుతున్న హోటళ్లు, రెస్టారెంట్లపై ఒక్కసారిగా యంత్రాంగం దాడులు నిలిపివేసింది. మిర్చియార్డు పరిసరాలతో పాటు అంకిరెడ్డిపాలెం, పేరేచర్ల, నల్లపాడు, చల్లావారిపాలెం, వెంగళాయపాలెం, చుట్టుగుంట, పొత్తూరు, ఓబులనాయుడపాలెం ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కారం మిల్లులు ఉన్నాయి. ఇక్కడ అనేక మిల్లులు నిబంధనలకు విరుద్దంగా నడుపుతూ కల్తీకారం తయారుచేసి విక్రయాలు చేస్తున్నట్లు గతంలో నిఘా విభాగం తనిఖీల్లో వెల్లడైంది. ఈనెల 9న ఆహారభద్రత, పౌరసరఫరాలు, నగరపాలక, తూనికలు-కొలతల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మిర్చియార్డు పరిసరాల్లో తనిఖీలు నిర్వహించగా పలు లోపాలు వెలుగులోకి వచ్చాయి. యంత్రాంగం పరిశీలనకు వెళ్లిన ఐదు మిల్లుల్లో మూడింటికి అసలు ట్రేడ్‌ లైసెన్సులు లేవని డొల్లతనం బయటపడింది. ఆపై ఆ మిల్లుల్లో తొడుములతో కూడిన కారం తయారుచేసి విక్రయాలు చేపడుతున్నట్లు గుర్తించింది. ఇంకెన్ని మిల్లుల్లో ఈ బాగోతం ఉందో పెద్ద సంఖ్యలో దాడులు నిర్వహించి వ్యాపారుల ఆగడాలకు కళ్లెం వేయాల్సి ఉండగా వాటి వరకే పరిమితం కావటం ప్రశ్నార్థకమవుతోంది. తనిఖీలు జరిపిన మిల్లుల్లో రూ.1.43 కోట్ల సరకును యంత్రాంగం స్వాధీనం చేసుకుంది. ఈ పరిణామం మిల్లు వర్గాలకు మింగుడు పడటం లేదు. వెంటనే యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమం ఆ రోజు మధ్యాహ్నం నుంచే కొందరు వ్యాపారులు ప్రారంభించారు. రాయలసీమకు చెందిన నేత ఓ అధికారికి ఫోన్‌ చేసి హెచ్చరించినట్లు సమాచారం. మరోవైపు కొందరు గుజరాతీ వ్యాపారులు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.

ఇదో ఎత్తుగడ.. జప్తు చేసిన సరకును జేసీ కోర్టులో ప్రవేశపెట్టించుకుని ఎంతో కొంత పెనాల్టీ చెల్లించి స్వాధీనం చేసుకోవాలనే ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు ఏమైనా సీజ్‌ చేస్తే జేసీ కోర్టులో వాటిని పెట్టడానికి రోజుల తరబడి సమయం తీసుకునేవారు. అలాంటిది కారం నిల్వలను సీజ్‌చేసిన మూడు రోజుల్లోనే కోర్టులో ప్రవేశపెట్టడం గమనార్హం.

నగరంలో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో నిల్వ ఆహార పదార్థాలు ఉన్నాయని ఇటీవల మార్కెట్‌ ఏరియా, అరండల్‌పేట, బ్రాడీపేట, చుట్టుగుంట ఏరియాలో పరిశీలనకు వెళ్లిన అధికారులు గుర్తించారు. కొన్ని హోటళ్లు అయితే నగరపాలక అనుమతి లేకుండా హోటళ్లు నడుపుతున్నాయని గుర్తించారు. రూ.5 వేల పెనాల్టీతో సరిపుచ్చారు. హోటళ్ల నిర్వాహకులకు ఓ ప్రజాప్రతినిధి దన్నుగా నిలిచి యంత్రాంగం తనిఖీలు లేకుండా అడ్డుపడ్డారనే ప్రచారం జరుగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని