Published : 12/04/2021 02:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మద్యం మత్తులో భార్యను కొడుతూ కింద పడి భర్త మృతి

హైదరాబాద్‌. న్యూస్‌టుడే: మద్యం మత్తులో భార్యను కొడుతూ అదుపుతప్పి భవనంపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. చైతన్యపురి ఠాణా పరిధిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టరు రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలికి చెందిన ప్రసాద్‌ (34) వృత్తిరీత్యా మేస్త్రీ. కొన్నేళ్ల క్రితం భార్య ఉషారాణి, పిల్లలతో నగరానికి వచ్చి కొత్తపేట పాతగ్రామంలో అద్దెకు ఉంటున్నాడు. మద్యానికి బానిసైన ప్రసాద్‌ తరచూ భార్యను వేధిస్తూ చేయి చేసుకునేవాడు. శనివారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న ప్రసాద్‌ భార్యపై దాడి చేసే క్రమంలో అదుపుతప్పి తాను అద్దెకు ఉండే 2వ అంతస్తు నుంచి మొదటి అంతస్తులో పడిపోవడంతో తలకు బలమైన గాయమై మృతి చెందాడు.

అభంశుభం తెలియని వయస్సు(12)లో ఉషారాణికి ప్రసాద్‌తో పెళ్లి జరిగింది. ప్రసాద్‌, ఉషారాణి తండ్రి ఇరువురు మేస్త్రీలు కావడంతో ఆ పరిచయంతో 13 ఏళ్ల కిత్రం పెళ్లి జరిపించారు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మద్యానికి బానిసైన ప్రసాద్‌ తన తల్లిదండ్రులతోనూ గొడవలు పడడంతో వారి మధ్య సఖ్యత లేక రాకపోకలు కూడా లేవని సమాచారం. మద్యానికి అతిగా ఖర్చు చేయడంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. దీంతో భార్య ఉషారాణి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో మృతదేహాన్ని తీసుకురాలేని దుస్థితి. చైతన్యపురి పోలీసులు రూ.500 ఇచ్చి భార్యా పిల్లలకు భోజనం ఏర్పాటుచేశారు. దహన సంస్కారాలు చేయడానికి కూడా స్థోమత లేకపోవడంతో భార్యా పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మృతుడి తల్లితండ్రి, ఇతర కుటుంబ సభ్యులు ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో పోస్టుమార్టం అనంతరం ఉస్మానియా ఆసుపత్రి శవాగారంలో మృతదేహాన్ని ఉంచారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని