Published : 12/04/2021 02:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టీకా లేని పండగ

వేచిచూసి వెనుదిరిగిన జనం

ఈనాడు-అమరావతి

జిల్లాలో కరోనా టీకా నిల్వలు అడుగంటాయి. ఉన్న అరకొర నిల్వలు పూర్తిగా అయిపోయాయి. ఎవరైనా ఆసుపత్రులకు వస్తే అందుబాటులో లేదని చెప్పి వెనక్కి పంపుతున్నారు. సోమవారం నుంచి టీకా కోసం వచ్చేవారికి ఏం సమాధానం చెప్పాలో యంత్రాంగానికి అంతుబట్టడం లేదు. దేశవ్యాప్తంగా ఈనెల 11 నుంచి 14 వరకు టీకా మహోత్సవం జరపాలని కేంద్రం పిలుపునిచ్చింది. దీంతో జిల్లాలో మండలానికి రెండేసి గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. కానీ అప్పటికే ఆ గ్రామాల పరిధిలోని పీహెచ్‌సీల్లో ఉన్న కొద్దిపాటి నిల్వలను సమీపంలోని మున్సిపాల్టీలకు శనివారం సర్దుబాటు చేశారు. దీంతో మున్సిపల్‌ పట్టణాల్లో మాత్రమే ఆదివారం టీకా కార్యక్రమం కొనసాగింది. అదీ కూడా ఆయా పట్టణాల్లో చాలా తక్కువ మందికి వేశారు. తెనాలిలో 50 మందికి టీకా లేదని చెప్పి పంపేశారు. పిడుగురాళ్లలో 80 మందికి వేశారు. సత్తెనపల్లి, మంగళగిరి పట్టణాల్లో ఆలస్యంగా ప్రారంభించారు. మిగిలిన గ్రామీణ ప్రాంతాల్లో దాని నిర్వహణ మొక్కుబడిగా మారింది.

జీరో నిల్వలకు ఆదేశం

గతంలో పంపిన నిల్వలు మొత్తం పూర్తిగా వినియోగించినట్లు జీరో చేసి చూపితేనే తిరిగి కొత్త నిల్వలు పంపుతామని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ మేరకు జిల్లా యంత్రాంగం స్పందించి ఉన్న నిల్వలు మొత్తాన్ని ఆదివారం వినియోగించింది. ఆదివారం నాటికి 700 వైల్స్‌ ఉన్నాయి. ఒక్కో వైల్‌ పది మందికి వస్తుంది. అంటే ఆదివారం అత్యధికంగా 7 వేల డోసులు వేశారు. టీకా మహోత్సవంలో భాగంగా సగటున రోజుకు జిల్లాలో 7-8 వేల డోసులు వేయాలని యంత్రాంగం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే జిల్లాలో టీకా పండగను నూతనంగా స్టాకు నిల్వలువచ్చిన నాటి నుంచి ప్రారంభించాలనే యోచనలో ఉంది.

జిల్లా యంత్రాంగం ముందుగా ప్రకటించిన విధంగా ఆదివారం పెద్దఎత్తున టీకా వేస్తారని ప్రజలు ఆశింంచి సచివాలయాలు, పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులకు చేరుకున్నారు. అయితే వాటిల్లో ఎక్కడా టీకా నిల్వలు లేవని తెలుసుకుని వెనుదిరిగారు. మేడికొండూరు, ప్రత్తిపాడు, చేబ్రోలు, నకరికల్లు, పెదకూరపాడు, క్రోసూరు, పెదకాకాని, అమృతలూరు, వేమూరు, పెదనందిపాడు, రెంటచింతల, కారంపూడి, మాచవరం, పిడుగురాళ్ల, నిజాంపట్నం తదితర మండలాల్లో టీకా లేకపోవటంతో కార్యక్రమం మొత్తం నిలిచిపోయింది. టీకా కోసం ఇండెంట్‌ పంపామని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డా.చంద్రశేఖర్‌ చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని