Published : 12/04/2021 02:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాలుడ్ని బలిగొన్న క్రేన్‌

జి.కొండూరు, న్యూస్‌టుడే: ఆ బాలుడికి ఐదేళ్లకే నూరేళ్లు నిండాయి. పని చేసే ప్రదేశంలోనే కుమారుడ్ని క్రేన్‌ బలిగొనడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆడుతూ.. అల్లరి చేస్తూ.. అప్పటి వరకు కళ్ల ముందు కదలాడిన కుమారుడి మృతితో వారి రోదనలకు అంతే లేకపోయింది. పోలీసుల కథనం ప్రకారం.. కుంటముక్కల నుంచి మైలవరం వెళ్లే రోడ్డులోని ఓ ఇటుక బట్టీ వద్ద కార్మికులు కుటుంబాలతో పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నుంచి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గోపాల్‌ప్రసాద్‌ జోషి భార్యతో కలిసి బట్టీలో పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కాగా.. చిన్న కుమారుడు నిఖిల్‌కుమార్‌జోషి (5) సమీపంలోనే ఆడుకుంటున్నాడు. బట్టీలోని క్రేన్‌ కూడా ఆ సమీపంలోనే పని చేస్తోంది. మధ్యాహ్నం భోజన సమయంలో క్రేన్‌ డ్రైవర్‌ పని ముగించుకొని బాలుడ్ని గమనించకుండా రావడంతో క్రేన్‌ ముందుండే ఇనుప ట్రే ప్రమాదవశాత్తు బాలుడి తలకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తుంటే.. ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. సమాచారం అందుకొన్న జి.కొండూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ ఆర్‌.ధర్మరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని