Published : 12/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మామిడి సెస్‌ వేలంలో మతలబు

గత ఏడాది కంటే సగానికే ఖరారు

కార్పొరేషన్‌ ఆదాయానికి గండి

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

అధికారులు, ఉద్యోగులు ఎవరైనా సరే.. తాము విధులు నిర్వహిస్తున్న సంస్థకు ఆర్థిక ప్రయోజనం కలగాలని చూస్తారు.. నగరపాలక సంస్థ అధికారులు మాత్రం.. ఇదేమీ తమకు పట్టవన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా కార్పొరేషన్‌ ఆదాయానికి గండిపడుతుండగా, గుత్తేదార్లు మాత్రం లాభపడుతున్నారు.

నగరపాలక సంస్థ అధికారులు ప్రతి ఏటా మామిడి సీజన్‌లో నగరంలోని మామిడి వ్యాపారుల నుంచి ఆశీల వసూళ్ల కోసం టెండర్లు పిలుస్తారు. ఎక్కువ మంది గుత్తేదార్లకు సమాచారం తెలిసేలా నోటీసు జారీ చేస్తారు. దీని వల్ల వారి మధ్య పోటీ పెరిగి కార్పొరేషన్‌కు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశముంటుంది. ఏళ్లగా అనుసరిస్తున్న విధానం అదే. ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు.

ఇలా వసూళ్లు

మూడు సర్కిళ్ల పరిధిలోని ప్రధాన రహదార్లు, వ్యాపార ప్రాంతాలు, ముఖ్య కూడళ్లు, కీలకప్రాంతాల్లో మామిడికాయలను విక్రయించుకునే వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు. సీజన్లో రూ.లక్షల వ్యాపారం సాగుతుంది. టోకు, చిల్లర వ్యాపారులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేరైతులు, మారు వ్యాపారం చేసుకునేవారు, గంపలు, చిన్న బుట్టలు, బళ్లమీద అమ్ముకునేవారు 10 వేల మంది ఉంటారని అంచనా. వారి నుంచి గంపకు రూ.10 చొప్పున రోజూ ఆశీలు వసూలు చేసుకోవచ్ఛు గత ఏడాది టెండరు ద్వారా నగరపాలక సంస్థకు రూ.16 లక్షలకు పైగా మామిడి సెస్‌ కింద ఆదాయం సమకూరింది. ఈసారి రూ.8.20 లక్షల వద్దే ఆగిపోయింది.

కేవలం ఇద్దరే..

మామిడి సీజన్‌ ప్రారంభానికి ముందే జనవరి, ఫిబ్రవరి నెలలల్లో మామిడిసెస్‌(ఆశీలు) వసూలు కోసం టెండర్లు పిలుస్తారు. ఈ సారి ఆలస్యంగా గత నెల 20న షార్టుటెండరు పిలిచారు. 26వ తేదీ సాయంత్రం సత్యనారాయణపురం సర్కిల్‌-2 కార్యాలయంలో సీల్డ్‌ టెండర్లు తెరిచి, బహిరంగ వేలం నిర్వహించారు. మధ్యలో ఆదివారం సెలవు కావడంతో టెండర్లు వేసేందుకు ఐదురోజులే మిగిలాయి. ఇక నోటీసు కూడా ఎవరికీ తెలియకుండా విడుదల చేయడంతో ఇద్దరు గుత్తేదార్లు మాత్రమే వేలంలో పాల్గొన్నారు. మరోవైపు ఏప్రిల్‌, మే, జూన్‌ జులై వరకు నాలుగు నెలల పాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ మామిడి సెస్‌ వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించినా అప్‌సెట్‌ ధర మాత్రం రూ.8 లక్షలుగానే నిర్ణయించారు. సమాచారం తెలియక అనుభవం ఉన్న గుత్తేదార్లు అనేకమంది టెండర్లకు, వేలానికి దూరం అయ్యాయి. ఇక సీల్డ్‌ టెండర్లు వేసిన ఇద్దరిలో ఒకరు రూ.8,06,001, మరొకరు రూ.8,10,999కు కోట్‌ చేశారు. ఆపై బహిరంగ వేలంలోనూ వీరిదద్దరే పాల్గొనండంతో పోటీ ఆశాజనకంగా సాగలేదు. చివరకు అప్‌సెట్‌ ధరపై రూ.20వేలు మాత్రమే అధికంగా పాడడంతో అధికారులు ఆ వ్యక్తికి పాట కట్టబెట్టేశారు.

గత ఏడాది లెక్క తీసుకోకుండా...

మామిడి వ్యాపారుల సంఖ్య, లావాదేవీల డిమాండ్‌, గత ఏడాది సమకూరిన ఆదాయం, ప్రతి ఏటా నిర్ధారించే అప్‌సెట్‌ ధరల్లో వ్యత్యాసాలు వంటి వాటి ఆధారంగా ప్రస్తుత ఏడాదికి ధర నిర్ణయించాల్సి ఉంది. అందుకు భిన్నంగా గుత్తేదార్లకు సమాచారం లేకపోవడం, వారి మధ్య పోటీ లేకుండా పోవడంతో సంస్థ ఆదాయానికి గండిపడింది.

అధిక వసూళ్లపై ఆరోపణలు..

రాజీవ్‌గాంధీ పార్కు పక్కన ఏటా పాకలు వేసి కమిషన్‌ ఏజెంట్లు ఆధ్వర్యంలో మామిడి క్రయ, విక్రయాల సాగుతాయి. అక్కడ వేలాది టన్నుల పచ్చిమామిడి కాయల బట్టలు అమ్ముడవుతాయి. రైతులు వందల సంఖ్యలో పాల్గొంటారు. టెండరు ఆలస్యమవడంతో కమీషన్‌ ఏజెంట్లే మామిడి సెస్‌ పేరుతో ప్రతి రైతు నుంచి రూ.200కు తగ్గకుండా తీసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి.

కేదారేశ్వరపేట, పాతబస్తీ గణపతిరావురోడ్డు, బీర్టీఎస్‌రోడ్డు, బెంజిసర్కిల్‌, ఎన్టీఆర్‌సర్కిల్‌, పీడబ్ల్యూడి గ్రౌండ్‌ ఏరియా, ఇందిరాగాంధీ మున్సిపల్‌ క్రీడాప్రాంగ ప్రాంతం, బీసెంట్‌ రోడ్డు, కెజి మార్కెట్‌ సెంటర్‌, స్వాతి సెంటర్‌, చిట్టినగర్‌ సెంటర్‌ వంటి అనేక ప్రాంతాల్లో మామిడి వ్యాపారం పెద్దత్తున సాగుంది. ఆయా వ్యాపారుల నుంచి గుత్తేదార్లు నిబంధనలకు విరుద్ధంగా బలవంతపు వసూళ్లకు పాల్పడుతుంటారనే ఆరోపణలున్నాయి. అధికారులు ఊదాసీనంగా వ్యవహరించడంతో ఈ సారి నగరపాలక సంస్థకు భారీ ఎత్తున ఆదాయానికి గండి పడింది.

ఎన్నికల కోడ్‌తో టెండరు ఆలస్యం: శ్రీధర్‌, ఎస్టేట్‌ అధికారి

ఎన్నికలకోడ్‌ కారణంగా ముందుగా మామిడి సెస్‌ వసూళ్లకు సంబంధించిన టెండరును పిలవలేకపోయాం. ప్రతి ఏడాది లాగానే నోటీసు ఇచ్చాం. టెండరు విషయం తమకు తెలియదని కొందరు చెప్పడం పూర్తిగా అవాస్తవం. ఎక్కువ వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని