Published : 12/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విద్యా సంస్థల్లో కేసుల కలకలం

విజయవాడలోనే 12 పాఠశాలలకు ఐదు రోజుల సెలవు

ఈనాడు, అమరావతి

* విజయవాడ సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఒకేసారి 30మందికి పైగా విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వసతి గృహం సహా మొత్తం కళాశాల ప్రాంగణాన్ని ఖాళీ చేయించి విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు.

* జిల్లాలోని ఓ ప్రముఖ గురుకుల పాఠశాలలోని 20 మంది పిల్లలకు పాజిటివ్‌ రావడంతో.. వసతి గృహం, పాఠశాల ప్రాంగణాలను పది రోజులు మూసేశారు.

కృష్ణా జిల్లాలోని పాఠశాలల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాజిటివ్‌ కేసులు వచ్చిన పాఠశాలలకు ఐదు రోజుల సెలవులు ఇస్తున్నారు. ఇప్పటివరకు విజయవాడ నగరం పరిధిలోనే 12 పాఠశాలలకు ఐదు రోజుల సెలవులు ఇచ్చారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా చాలా పాఠశాలల్లో ఇప్పటికే పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. నగరంలోని కొన్ని ప్రైవేటు ఇంటర్మీడియట్‌ కళాశాలల్లోనూ పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. పాజిటివ్‌ కేసులు వస్తున్న విద్యాసంస్థల్లో మిగతా విద్యార్థులకు కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలను తాత్కాలికంగా ఐదు రోజులు మూసేయిస్తున్నారు. వంద మందికి పైగా ఉండే వసతి గృహాల్లో పాజిటివ్‌ కేసులు వస్తే.. పది రోజుల వరకు సెలవులు ప్రకటిస్తున్నారు.

జిల్లాలో రోజూ 300కు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా ఉంటున్నాయి. వైరస్‌ వ్యాప్తి అత్యంత వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. విద్యార్థులను తరగతి గదుల్లో పెద్దసంఖ్యలో కూర్చోబెట్టి పాఠాలు బోధించడం చేస్తున్నారు. దీనిపై తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తమకు ఇష్టం లేకపోయినా కొన్ని పాఠశాలలు తప్పనిసరిగా రావాలంటూ నిబంధన పెడుతున్నాయంటూ విజయవాడకు చెందిన ఓ విద్యార్థి తండ్రి వాపోయారు. జిల్లాలోని కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మళ్లీ ఆన్‌లైన్‌ తరగతుల బాట పట్టాయి. తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ఎక్కువగా వస్తుండడంతో.. పాఠశాలల నిర్వాహకులు మళ్లీ ఆన్‌లైన్‌ తరగతులను ఆరంభిస్తున్నారు.

నిర్లక్ష్యం వీడాలి..

తరగతి గదిలో బెంచికి ఒక విద్యార్థిని మాత్రమే కూర్చోబెట్టాలి. ఈ నిబంధనను ఎక్కువ శాతం పాఠశాలలు పట్టించుకోవడం లేదు. బెంచీకి ఇద్దరు, ముగ్గురు విద్యార్థులను చాలాచోట్ల కూర్చోబెడుతున్నారు. మాస్కులను తప్పనిసరిగా తరగతి గదిలో ఉన్నంత వరకు ఉండేలా చూడాలి. చాలాచోట్ల మాస్కులు లేకుండానే విద్యార్థులు వస్తున్నారు. విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలోనికి గేటు దాటి వచ్చేటప్పుడే వారి చేతులను శానిటైజ్‌ చేయాలి. ఆరంభంలో కొన్ని పాఠశాలల్లో చేసినా.. ప్రస్తుతం 90శాతం ఎక్కడా అమలు జరగడం లేదు. మధ్యాహ్న భోజనం సమయంలో విద్యార్థులంతా ఒకేచోట చేరి చుట్టూ కూర్చుని తింటున్నారు. వారిపై ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేదు. ప్రైవేటు పాఠశాలల బస్సుల్లోనూ విద్యార్థులు ఒక్కో సీటులో ముగ్గురు కూర్చుని వెళుతున్నారు. కళాశాలలు వదిలిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులు కిక్కిరిసిపోయి.. వేలాడుతూ ఫుట్‌బోర్డు ప్రయాణాలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. జిల్లా యంత్రాంగం ఈ విషయాలపై పూర్తిగా దృష్టిపెట్టడం లేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని