Published : 12/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నెలాఖరు వరకు రబీ సాగు నీరు

ఈనాడు, అమరావతి

ఈ ఏడాది పట్టిసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేకుండానే రబీ సీజన్‌ ముగించేందుకు జలవనరుల శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. రెండో పంట రబీకి ఈ నెలాఖరు వరకు (ఏప్రిల్‌ 30) వరకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. తాగునీటి చెరువులకు ఏప్రిల్‌ 30 నాటికి నింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ మేరకు నీటి అవసరాలను తీర్చుతారనేది సందేహాస్పదంగా తయారైంది. సాగర్‌ జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో రబీ సాగు సుంకు మీదకు వచ్చింది. ఈ నెలాఖరు నాటికి కోతలకు వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఇంకా పచ్చగానే ఉన్నాయి. నివర్‌ తుపాను వల్ల ఖరీఫ్‌ దిగుబడులు బాగా తగ్గిపోయాయి. రబీ పంటపై రైతులు ఆశలు పెంచుకున్నారు. సాధారణంగా డెల్టా ప్రాంతంలో రెండో పంటగా మినుము సాగు చేస్తుంటారు. ఈ ఏడాది కూడా ఎక్కువ శాతం మినుము సాగుచేశారు. సాధారణ విస్తీర్ణం కంటే.. కొంత ఎక్కువగానే రబీలో వరి సాగు చేశారు. జిల్లాలో డెల్టా ప్రాంతంలో సుమారు 2.50 లక్షల ఎకరాలను సాగు చేశారు. దీనిలో 25 వేల ఎకరాల వరకు బోర్ల కింద సాగు అవుతోంది. నివర్‌ నష్టం నుంచి కోలుకొని రెండో పంటకు జనవరి, ఫిబ్రవరి మాసాల్లో నాట్లు వేశారు. ప్రస్తుతం ముందుగా వేసిన ప్రాంతాల్లో కోతలకు అందాయి. మిగిలిన ప్రాంతాల్లో ఈ నెలాఖరు వరకు కోతలకు అందే అవకాశం ఉంది.

పులిచింతల నుంచే

ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగునీరు పుష్కలంగా లభించింది. కృష్ణానదికి వరదలు పోటెత్తడంతో నిత్యం కాలువలు నిండుగా పారాయి. చెరువులు నింపారు. గత నాలుగు నెలలుగా నదికి వరద ఆగిపోయింది. దీంతో నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించాల్సి వచ్చింది. ప్రకాశం బ్యారేజీలో ప్రస్తుతం 3 టీఎంసీల నీరు ఉంటుంది. ఇది ఎప్పుడూ నిల్వ చేస్తుంటారు. అత్యవసరమైతే.. దీని నుంచి కొంత వరకూ తాగునీటికి వినియోగిస్తారు. జలాశయానికి వరద ఉంటేనే.. కాలువలకు వదలాలి. ఈ ఏడాది పట్టిసీమ నుంచి నీటిని తీసుకోలేదు. ప్రస్తుతం పులిచింతలలో 15 టీఎంసీల నిల్వ ఉంది. దీనినుంచి తీసుకొనేందుకు ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి ఈనెల 15 వరకు కాలువలకు నీరు విడుదల చేసి.. తర్వాత నిలిపివేయాలని ప్రతిపాదించారు. కానీ ఇంకా నిలువ మీద పంట ఉండటంతో ఎక్కువ అవసరం ఉంటుందని రైతులు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శాఖ కూడా ఏప్రిల్‌ నెలాఖరు వరకు నీటి అవసరం ఉంటుందని సూచించింది. ప్రస్తుతం మూడు కాలువల్లో బందరు కాలువ కిందనే ఎక్కువగా సాగవుతోంది. రైవస్‌, ఏలూరు కాలువ కింద కొంత విస్తీర్ణం తక్కువగా ఉంది. దీంతో ఈనెల 30 వరకు విడుదల చేయాలని నిర్ణయించారు. దీనికి కనీసం 10 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనా. మొత్తం రబీ సాగులో 20 నుంచి 25 టీఎంసీలు అవసరం. ఇప్పటికే సగం నీరు సరఫరా అయింది. ప్రస్తుతం సుంకు దశలో ఎండాకాలం కావడంతో ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. దీంతో పులిచింతల నుంచి అవసరమైన నీటిని దిగుమతి చేసుకొని బ్యారేజీ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

300 చెరువులు నింపాలి

ఈ నెలాఖరు వరకు మూడు కాలువల కింద ఉన్న 300 చెరువులు నింపాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చెరువుల్లో నీటిని నింపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రామాలకు ఎక్కువ శాతం రక్షిత నీటి సరఫరా చెరువుల ద్వారా సీపీడబ్ల్యూ పథకాల ద్వారా చేరుతోంది. వేసవి నీటి ఎద్దడి నివారణకు జిల్లాలో ఉన్న 300 చెరువులను నింపనున్నారు. దీనికి ప్రస్తుతం ఉన్న పులిచింతల నీరు సరిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఖరీఫ్‌కు మళ్లీ గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా తీసుకోనున్నారు. రబీ ధాన్యం కొనుగోలుకు ఆర్‌బీకేలలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించామని సంయుక్త కలెక్టర్‌ మాధవీలత వెల్లడించారు. రైతుల దగ్గర పండిన రబీ ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని వెల్లడించారు. ఖరీఫ్‌లో తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేశామని చెప్పారు.

రబీ సాగు విస్తీర్ణం2.50 లక్షల ఎకరాలు

పంట కాలంఏప్రిల్‌ 30 వరకు

అవసరమైన నీరు10 టీఎంసీలు

తాగునీటి చెరువులు300

అవసరమైన నీరు03 టీఎంసీలు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని