Updated : 13/04/2021 10:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కన్నబిడ్డలతో మహిళ ఆత్మహత్య

అజిత్‌సింగ్‌ నగర్‌(విజయవాడ): ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ గృహిణి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన విజయవాడ గ్రామీణ మండలం నున్న గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సురేంద్రకు వాణి (26)తో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి భావన (3), అక్షయ (10) ఇద్దరు కుమార్తెలు. సురేంద్ర కొన్నేళ్లుగా గ్రామంలోనే చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇటీవల వ్యాపారపరంగా దెబ్బతిన్నాడు. దీంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆటో నడిపి ఇంటికి రాగా,  భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు వాంతులు చేసుకోవడం గమనించాడు. ‘ఏమైంది’అని వారిని ప్రశ్నించగా ‘పురుగుల మందు తాగమని’ చెప్పడంతో హుటాహుటీన విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా మారడంతో ఇద్దరు చిన్నారులను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తొలుత భావన, సాయంత్రం వాణి, చిన్నారి అక్షయ మృత్యు ఒడికి చేరారు. కాగా, ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ మేరకు సీఐ హనీష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని