Published : 21/04/2021 05:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విద్యుత్తు బస్సులు వస్తున్నాయ్‌

ఈనాడు, అమరావతి

ప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న విద్యుత్తు బస్సుల ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అద్దె ప్రాతిపదికన తీసుకునే ఈ వాహనాలను నగరానికి వంద కేటాయించారు. న్యాయ సమీక్ష అనంతరం వాహనాలు రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి విజయవాడ నగరంతో పాటు, గుంటూరు జిల్లాలోని కొన్ని మార్గాల్లో నడపనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ప్రతిపాదనలు ఆర్టీసీ ఎండీ కార్యాలయానికి చేరాయి. రెండు జిల్లాల్లోని ఎనిమిది రూట్లలో తిరగనున్నాయి. వీటి వల్ల కాలుష్యానికి అడ్డుకట్ట పడడంతో పాటు పెరుగుతున్న ఇంధన ఖర్చు కూడా తగ్గుతుంది.

ఏయే మార్గాల్లో..?

పది లక్షల జనాభా దాటడంతో విజయవాడ నగరానికి ఈ వాహనాలను కేటాయించారు. సిటీకి వచ్చే వంద బస్సులు తిరిగేందుకు రూట్లు కూడా దాదాపు ఖరారయ్యాయి. వీటిని విద్యాధరపురం డిపోకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ నుంచి హనుమాన్‌ జంక్షన్‌, అమరావతి, మంగళగిరి, హైకోర్టు, గన్నవరం, ఉయ్యూరు, మచిలీపట్నం, జగ్గయ్యపేట మార్గాల్లో నడుస్తాయి. ఫేమ్‌-2 పథకం కింద కేంద్రం ఈ బస్సులకు రాయితీని అందించనుంది. నగరంతో పాటు, సబర్బన్‌ సర్వీసుల కింద వీటిని తిప్పనున్నాయి.

* వీటి కోసం ప్రత్యేక ఛార్జింగ్‌ పాయింట్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం రెండు ప్రాంతాలను ఎంపిక చేశారు. పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌, విద్యాధరపురం డిపోల్లో రానున్నాయి. పీఎన్‌బీఎస్‌లో 900 కేవీఏ, విద్యాధరపురంలోని ఆర్టీసీ వర్క్‌షాపులో 5000 కేవీఏ సామర్థ్యం గల ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. గతంలో గన్నవరం డిపోలో 2,700 కేవీఏ సామర్థ్యం గల స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. ఈ ప్రతిపాదనను ప్రస్తుతం విరమించుకున్నారు. వీటికి విద్యుత్తు సరఫరా కోసం ఇప్పటికే ఆర్టీసీ అధికారులు సీపీడీసీఎల్‌కు ప్రతిపాదనలు కూడా ఇచ్చారు.

ఎన్నో ప్రయోజనాలు

సిటీ సర్వీసులు మొత్తం 425 ఉన్నాయి. వీటిలో 225 సీఎన్‌జీ బస్సులు తిరుగుతున్నాయి. ఇవి పాడవుతున్నాయి. మిగిలినవి డీజిల్‌తో నడిచేవి. డీజిల్‌ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ధరలు పెరిగే కొద్దీ భారం మోయలేని విధంగా తయారవుతోంది. మొత్తం వ్యయంలో దాదాపు 32 శాతం ఇంధనం కోసమే ఖర్చు అవుతోంది. విద్యుత్తుతో నడిచే బస్సుల నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుంది. ఒకసారి ఛార్జి చేస్తే 150 కి.మీ వరకు నడుస్తాయి.

* విజయవాడ నగరంలో కాలుష్యం బాగా పెరుగుతోంది. ప్రమాదకర కార్బన్‌ మోనాక్సైడ్‌ ఆందోళనకర స్థాయిలో విడుదల అవుతోంది. ఆర్టీసీలో పాత బస్సులు ఎక్కువ ఉండడంతో వీటి నుంచి కాలుష్యం వస్తోంది. ఎలక్ట్రిక్‌ వాహనాలతో ఈ బెడద ఉండదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని