Published : 21/04/2021 05:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌ బారిన ఖాకీలు

20 రోజుల్లో 50 మందికి..

ఈనాడు - అమరావతి

క్షణ విధుల్లో నిమగ్నమైన పోలీసుల్లో చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. రెండో దశ రోజు రోజుకూ ఉద్ధృతం అవుతుండడంతో పాజిటివ్‌ బారిన పడే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 20 రోజుల్లో సుమారు 50 మందికి కొవిడ్‌ సోకింది. వారి కుటుంబ సభ్యుల్లో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. సకాలంలో పరీక్షలు నిర్వహించడం, చికిత్స అందించడం వంటి చర్యలను ఉన్నతాధికారులు ప్రారంభించారు. వీటిని పర్యవేక్షించడానికి ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.

బెజవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 4వేల మంది వరకు అధికారులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో సుమారు 400 మంది వరకు మొదటి దశలో కొవిడ్‌ బారిన పడ్డారు. సీపీ నుంచి హోంగార్డు వరకు పాజిటివ్‌ వచ్చింది. ఏడాది కాలంలో ముగ్గురు మరణించారు. గత ఏడాది లాక్‌డౌన్‌, కంటెయిన్‌మెంట్‌ జోన్లలో విధులు నిర్వర్తించిన అనేక మంది పోలీసు అధికారులు, సిబ్బంది దీని బారిన పడ్డారు. బయటకు రావాలంటేనే హడలిపోయే పరిస్థితుల్లోనూ రేయింబవళ్లు పోలీసులు భద్రతా విధులు నిర్వహించారు. ఈ ప్రయత్నంలో జిల్లాలో కరోనా బారిన పడి, చికిత్స తీసుకొని తిరిగి విధుల్లో చేరారు. కొందరు మృత్యువాత పడ్డారు. పలువురికి ఇంకా ఆరోగ్య సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి.

* లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించడం, ఫలితాన్ని బట్టి వైద్యం అందించడం వంటివి ఈ సెల్‌ పర్యవేక్షిస్తుంది. పాజిటివ్‌ వచ్చిన వారికి భోజనం కూడా సరఫరా చేస్తున్నారు. కరోనా వచ్చిన సిబ్బంది కుటుంబ సభ్యులకు కూడా తోడ్పాటు అందిస్తున్నారు. చికిత్స అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా ముందస్తుగా బెడ్లను కూడా ఉంచారు. కార్యాలయంలో విధులు నిర్వర్తించే వారికి, వారి పిల్లల ద్వారా సోకినట్లు గుర్తించారు. మాస్కులు, శానిటైజర్లను, విటమిన్‌ ట్యాబ్లెట్లను కూడా సిబ్బంది అందరికీ అందిస్తున్నారు. పోలీసుల కోసం ప్రత్యేకంగా టీకా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే రెండు విడతలు వేశారు. మొదటి విడతలో 95 శాతం మందికి, రెండో విడతలో 60 శాతం మంది వేయించుకున్నారు. మిగిలిన వారి కోసం మళ్లీ మంగళవారం నుంచి ప్రారంభించారు.


రెండో దశలో మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. మూడు వారాల్లో 50 మంది వైరస్‌ బారిన పడగా, ఓ హోంగార్డు మృత్యువాత పడ్డాడు. తమిళనాడు ఎన్నికలలో బందోబస్తుకు నగరం నుంచి దాదాపు 200 మంది వెళ్లారు. వీరిలో పది మందికి కరోనా సోకింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వారిలో లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు. అందులో బయటపడింది. వీరు కాకుండా మరో 40 మందికి కూడా పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఏడీసీపీ నుంచి కార్యాలయ ఉద్యోగుల వరకు ఉన్నారు. వీరిలో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. రోజుల వ్యవధిలో సిబ్బంది కొవిడ్‌ బారిన పడడంతో సీపీ శ్రీనివాసులు ప్రత్యేక సెల్‌ను ప్రారంభించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని