Updated : 21/04/2021 06:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంటి వద్ద చికిత్సలే అధికం

హోం ఐసోలేషన్‌లో 4,820 మంది

ఈనాడు, అమరావతి

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో కరోనా నిర్ధారణ పరీక్షల కోసం నిరీక్షిస్తూ..

ప్రైవేటు ఉద్యోగి నరేష్‌కు జ్వరం, వంటి నొప్పులు ఉండడంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్‌ రావడంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా అదే విధంగా లక్షణాలు కనిపించడంతో కరోనా చికిత్స తీసుకుంటున్నారు. ఆస్పత్రులకు వెళ్లే వారి కంటే ఇంటి వద్ద చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ఇంకా లెక్కల్లోకి రాని వారి జాబితా చాలానే ఉంది. జిల్లాలో కొవిడ్‌ రెండో దశలో వ్యాప్తి తీవ్రంగా ఉంది. గత 24 గంటల్లో దాదాపు 441 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో చాలా మంది హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. వైద్యులు సూచించిన ప్రకారం మందులు వాడుతున్నారు. జిల్లాలో దాదాపు 4820 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పడకలు నిండిపోతున్నాయి. ఇప్పటికే 1659 పడకలకు 1064 పూర్తయ్యాయి. ప్రతి ఆస్పత్రిలో సగం కొవిడ్‌ రోగులకు కేటాయించాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జీజీహెచ్‌, మచిలీపట్నం జిల్లా ఆస్పత్రి, పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రి, ఇబ్రహీంపట్నంలో నిమ్రా ఆసుపత్రులను కేటాయించారు. జీజీహెచ్‌లో ఇప్పటికే 80 శాతం పడకలు నిండిపోయాయి. పిన్నమనేనిలో ఇంకా ప్రారంభించలేదు. నిమ్రాలోనూ ప్రారంభం కాలేదు. గూడవల్లిలో నారాయణ కళాశాలను కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా ఏర్పాటు చేశారు. ఇక్కడ 500 పడకలు ఉన్నాయి.

రోగుల పడిగాపులు..

ప్రభుత్వ ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ల వద్ద రోగులు పడిగాపులు పడుతున్నారు. అధికారుల నుంచి సిఫార్సు ఉంటేగానీ పడకలు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. జీజీహెచ్‌లో, గూడవల్లి కేర్‌ సెంటర్‌లో చెట్లకింద రోగులు కూర్చున్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చేర్చుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మంగళవారం పెద్ద వివాదం తలెత్తింది. అక్కడి డాకర్లపై ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనూ చేర్చుకోవడం లేదని ఫిర్యాదులు ఉన్నాయి. స్వల్ప లక్షణాలు ఉంటే ఇంట్లోనే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దిగువ మధ్య తరగతి ప్రజలు ఒకే ఇంట్లో వేర్వేరుగా ఉండలేని పరిస్థితి ఉంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు రూ.లక్షల్లో గుంజుతున్నారు. ఒకటో పట్టణ న్యాయవాది కుటుంబంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన వీరికి వారం రోజులకే రూ.25 లక్షలు ఖర్చు చేసినట్లు బంధువులు చెబుతున్నారు. అయినా ప్రాణాలు కాపాడలేకపోయారు. తీరా న్యాయవాది ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

జిల్లాలో మరణ మృదంగం..

కొవిడ్‌ రెండో దశలో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. గత 15 రోజుల్లోనే జిల్లాలో 28 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో యువకులు ఉండడం విశేషం. వృద్ధులతో పాటు 45 ఏళ్ల లోపువారు ఉన్నారు. ఇతర జిల్లాలకు చెందిన వారు విజయవాడ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరు కొంత మంది మరణించారు. వారిని జిల్లా లెక్కల్లోకి తీసుకోలేదు. విజయవాడ ఒకటో పట్టణంలో న్యాయవాది కుటుంబంలో రెండు రోజుల వ్యవధిలోనే నలుగురు మృత్యువాత పడడం కలకలం రేపింది. ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది. కుటుంబ సభ్యులు అందరూ హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. కుటుంబంలో ఒకరికి వస్తే మిగిలిన వారికి వ్యాప్తి చెందడానికి తక్కువ సమయం తీసుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. విజయవాడ దంత కళాశాలలో ట్రూఏజ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కరోనా పాజిటివ్‌ ఉన్నవారికి అక్కడ ప్రాణవాయువు శాతాన్ని పరీక్షిస్తారు. ఇంటి వద్ద చికిత్స పొందేందుకు తగిన మందులు అందజేస్తున్నారు. ఇంటి వద్ద ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోతే ఆసుపత్రికి తీసుకురావాలని సూచిస్తున్నారు. 104, 108కి ఫోన్‌ చేసి తగిన సలహాలు, సూచనలు పొందవచ్చని చెబుతున్నారు.

స్వీయ నియంత్రణే మార్గం..

కరోనా నియంత్రణకు ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు. బహిరంగ సభలు, సామూహిక ప్రదేశాలకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడం లేదని అధికారులు భావిస్తున్నారు. కానీ జనసమర్థ ప్రాంతాలు పూర్తిగా తగ్గిపోవాలని అభిప్రాయపడుతున్నారు. మాస్క్‌, శానిటైజేషన్‌, భౌతిక దూరం పాటించడం ద్వారా నియంత్రించవచ్చని చెబుతున్నారు. వీలైనంత మందికి వ్యాక్సిన్‌ వేయాలని భావిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని