Published : 21/04/2021 05:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉద్యోగుల గుండెల్లో గుబులు

ఈనాడు డిజిటల్‌, గుంటూరు

ఫిర్యాదుదారు ఒక్కరే లోపలకు రావాలంటూ అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌ గేటుకు ఏర్పాటు చేసిన ప్రకటన

పెరుగుతున్న కొవిడ్‌ కేసులతో జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల్లో భయం నెలకొంది. రెవెన్యూ, పోలీస్‌, పంచాయతీరాజ్‌, విద్య, వైద్యశాఖల కార్యాలయాల్లో పనిచేసే కొందరు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. దీంతో పోలీస్‌స్టేషన్లు, కార్యాలయాల వద్ద సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఉద్యోగుల విధులకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు కల్పించాలని కోరుతున్నారు. గుంటూరు జిల్లాలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. రెండో విడతలో కేసులు రోజురోజుకీ రెట్టింపవుతున్న పరిస్థితి. కరోనా బారిన పడుతున్న వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలోనూ విధులు నిర్వహించాల్సి రావడం ఉద్యోగులకు సవాలుగా మారింది. కీలకమైన రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ, పురపాలక శాఖ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. కరోనా విధులు కూడా నిర్వర్తించాల్సి రావడంతో కార్యాలయానికి రావడం తప్పనిసరి అవుతోంది. ఈ క్రమంలో వారు కూడా వైరస్‌ కాటుకు గురవుతున్నారు.

జిల్లా పరిపాలనకు కీలకమైన కలెక్టరేట్‌, జడ్పీ, డీఎంహెచ్‌వో, డీఈవో, ఎస్పీ ఆఫీసుల్లోనూ కొందరికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే పారిశుద్ధ్య చర్యలు చేపట్టే నగరపాలక సంస్థ, ఆయా మున్సిపాలిటీల ఉద్యోగులు కొందరు కరోనా బారిన పడ్డారు. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్లలో వైరస్‌ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్నిచోట్లా మాస్కు తప్పనిసరి చేశారు. మాస్క్‌ లేనివారికి లోపలకు రావొద్దని సూచిస్తున్నారు. కొందరు ఉద్యోగులకు కరోనా రావడంతో మిగిలిన వారితోనే కార్యాలయాలు నడుపుతున్నారు. ముఖ్యమైన ఫైళ్లను మాత్రమే చూస్తున్నారు. అలాగే సందర్శకుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించే క్రమంలో అత్యవసరమైన వాటిని మాత్రమే తీసుకుంటున్నారు. పోలీస్‌స్టేషన్లలో ఏదైనా ఫిర్యాదు కోసం వచ్చేవారు కూడా ఒక్కరు మాత్రమే రావాలని నోటీసులు అంటిస్తున్నారు. ఎక్కువ మందిని కార్యాలయాల్లోకి రానీయకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏదైనా పని కోసం వచ్చిన వారికి కరోనా ఉంటే తాము కూడా బాధితులుగా మారాల్సి వస్తుందనే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది.

గుంటూరు మండల విద్యావనరుల కేంద్రంలోకి సందర్శకులు నేరుగా వెళ్లకుండా కట్టిన తాడు

విడతల వారీగా పనిచేస్తే వ్యాప్తి తగ్గుతుంది

-మోహన్‌రావు, ఏపీ పంచాయతిరాజ్‌ ఉద్యోగుల సంఘం ఆర్గనైజింగ్‌ సెక్రటరీ

ఉద్యోగులను విభజించి సగం మంది మాత్రమే పనిచేసేందుకు అనుమతిస్తే కొంతమేర కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గించవచ్ఛు అలాగే కార్యాలయం ప్రవేశ ద్వారం వద్దే రిసెప్షన్‌ ఏర్పాటు చేసి విజ్ఞప్తులు స్వీకరించడం లేదా వారికి సంబంధించిన పని చేసి పెట్టేలా చర్యలు తీసుకోవాలి. ఎక్కువ మందిని కార్యాలయాల్లోకి అనుమతిస్తే వైరస్‌ వ్యాప్తిని ఆహ్వానించినట్లే అవుతుంది.

ఒక ఆస్పత్రిని ఉద్యోగుల కోసం కేటాయించాలి

-రాజశేఖర్‌, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు, గుంటూరు జిల్లా

వివిధ ప్రభుత్వ పథకాలు, అలాగే ధ్రువపత్రాల కోసం ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాలకు వస్తున్నారు. వారిలో ఎవరికి పాజిటివ్‌ ఉన్నా చుట్టుపక్కల వారితో పాటు ఉద్యోగులకు ప్రమాదమే. ఇప్పటికే కొందరు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. మా వైపు నుంచి స్వీయ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి రావడంతో ఎక్కడో ఒకచోట వైరస్‌ సోకుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు సరైన వైద్యం అందడం లేదు. ఏదో ఒక ఆస్పత్రిని పూర్తిగా ఉద్యోగుల కోసం కేటాయిస్తే సమస్య కొంత పరిష్కారం అవుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని