Published : 21/04/2021 05:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్యాకేజీల పేరుతో ఇబ్బంది పెట్టొద్దు


సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీరంగనాథరాజు, చిత్రంలో హోంమంత్రి సుచరిత, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, జేసీ ప్రశాంతి, నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి

కలెక్టరేట్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: కొవిడ్‌-19 పాజిటివ్‌తో ఆసుపత్రులకు వచ్చే వారికి ప్యాకేజీల పేరుతో ఇబ్బందులకు గురిచేయకుండా అందరికీ అందుబాటులో ధరలు ఉండాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో మంగళవారం ఐఎంఏ (ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌) ఆఫీస్‌ బేరర్లతో సమావేశమయ్యారు. ఇన్‌ఛార్జి మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ గుంటూరు జీజీహెచ్‌ అంటే ఐదు జిల్లాల ప్రజలకు ఉపయోగపడే ఆసుపత్రి అని, అందుకు అనుగుణంగానే ఇక్కడ వైద్య సేవలకు అన్నీ సిద్ధం చేయాలన్నారు. అటు పశ్చిమ గోదావరి నుంచి ఇటు నెల్లూరు వరకు ఆయా జిల్లాల ప్రజలు గుంటూరు జీజీహెచ్‌లో మంచి వైద్యం అందుతుందనే నమ్మకంతో వస్తారన్నారు. ఇక్కడ కార్పొరేట్‌ ఆసుపత్రులు కూడా కొవిడ్‌-19 పరిస్థితుల నేపథ్యంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ అందరికీ వైద్యం అందించాలని కోరారు. కొత్తగా ఆసుపత్రుల ఏర్పాటుకు అనుమతులు మంజూరయ్యేలా హోంమంత్రి సుచరిత చర్యలు చేపడుతున్నారన్నారు. గతంలో మాస్కులు, పీపీఈ కిట్లు సక్రమంగా అందుబాటులో లేని సమయంలో వైరస్‌ను కట్టడి చేశామని, ఇప్పుడు కూడా అదేవిధంగా వైరస్‌ను కట్టడి చేసేందుకు రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖలన్నీ సమన్వయంతో పని చేయాలన్నారు. అధికార యంత్రాంగం ఎన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినా ప్రజలు వాటిని పాటించి, అమలు చేయాలని కోరారు. మాస్కును ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్‌ చేసుకోవడం వంటివి క్రమం తప్పక పాటించాలని సూచించారు. కరోనా వైరస్‌కు బాధితులకు ఇచ్చే ఇంజక్షన్లను కూడా వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ ప్రస్తుతం మెడికల్‌ ఎమర్జెన్సీలో ఉన్నామని, ఎప్పుడు ఎవరికి వైరస్‌ సోకుతుందో తెలియడం లేదన్నారు. గతంలో వెయ్యి కేసులు రావడానికి మూడు నెలల సమయం పట్టిందని, ఇప్పుడు వారం రోజుల్లోనే వెయ్యికి చేరాయన్నారు. కరోనా సెకండ్‌వేవ్‌లో రోగి పరిస్థితి తీవ్రంగా మారుతోందని, కుటుంబంలో అందరూ వైరస్‌ బారిన పడుతున్న సందర్భాలు ఉన్నాయన్నారు. అందుకు తగినట్లుగా ఆసుపత్రుల్లో బెడ్లను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ లక్షణాలున్న వారిని క్వారంటైన్‌ కేంద్రంలోనూ, ఆక్సిజన్‌, ఇతర వైద్య చికిత్సలు అవసరమైన వారికి ఆసుపత్రుల్లోనూ చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ప్రజలు బయటకు వచ్చే సమయంలో వైరస్‌ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను పాటించాలన్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. సమావేశంలో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, జేసీలు పి.ప్రశాంతి, కె.శ్రీధర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో యాస్మిన్‌, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ నందకిశోర్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు రామచంద్రరాజు, ఆప్నా అసోసియేషన్‌ అధ్యక్షుడు హనుమంతరావు, ఐఎంఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని