Published : 21/04/2021 05:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌ కట్టడికి పటిష్ఠ కార్యాచరణ

ఈనాడు-ఈటీవీతో కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌

ఈనాడు డిజిటల్‌, గుంటూరు

జిల్లాలో కరోనా కట్టడికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో సంఘటితంగా కొవిడ్‌ వైరస్‌ నివారణ, నియంత్రణ చర్యలను చేపడుతున్నామని పేర్కొన్నారు. బాధితులకు ప్రణాళికాయుతంగా వైద్య చికిత్సలు అందిస్తున్నామని, నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు. పడకలు, ఆక్సిజన్‌, ఔషధాలు, ఇతర సదుపాయాలను మెరుగుపర్చేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామన్నారు. కొవిడ్‌ కేసుల తాకిడి తీవ్రమవుతున్న నేపథ్యంలో జిల్లాలో వైరస్‌ వ్యాప్తి తీరు, యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ముఖాముఖీలో వివరించారు.

జిల్లాలో కరోనా బాధితుల ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌ ప్రక్రియ క్రమపద్ధతిలో జరగడం లేదు. పరీక్షలు, ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోంది.?

ఇంతవరకు ఆర్టీపీసీఆర్‌ నిర్ధారణ పరీక్షలు రోజుకు 4వేల నుంచి 5వేల వరకు జరుగుతున్నాయి. వీటిని 8వేలకు పెంచేందుకు చర్యలు చేపట్టాం. సిబ్బంది కొరత, రవాణా సమస్యలుండేవి. వీటిని అధిగమించాం. కరోనా పాజిటివ్‌ బాధితుల గుర్తింపు, కాంటాక్టు ట్రేసింగ్‌, హోం ఐసోలేషన్‌ వంటి కీలక అంశాలపై దృష్టి పెడుతున్నాం.

ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలకు విరుద్ధంగా బాధితుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. వీటిని ఎలా అడ్డుకుంటారు?

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యసేవలు, ఫీజుల వసూల అమలుపై విజిలెన్స్‌ బృందాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. ప్రభుత్వం నిర్దేశించిన రుసుమును మాత్రమే వసూలు చేయాలి. ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టప్రకారం చర్యలు చేపడతాం. అవసరమైతే అలాంటి ఆస్పత్రుల అనుమతులు రద్దు చేయడానికీ వెనుకాడబోం.

రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు నల్లమార్కెట్‌లో లభిస్తున్నాయి. వీటినెలా అదుపు చేయనున్నారు? జిల్లాలో ఆక్సిజన్‌ నిల్వలు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి?

రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. విరివిగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ధర తగ్గినందున అందరికీ అందుబాటులోకి రానున్నాయి. అనవసరంగా బ్లాక్‌ చేయడం చట్టవిరుద్ధం. మరోవైపు గతంలో పోల్చిచూస్తే ఆక్సిజన్‌ నిల్వలు పెరిగాయి. ఆక్సిజన్‌ నిల్వలను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నాం.

జిల్లాలో పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వీటి నియంత్రణకు యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపడుతోంది..?

కరోనా నిరోధానికి ప్రణాళికాయుతంగా చర్యలు చేపడుతున్నాం. అవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రజలకు సూచిస్తున్నాం. కరోనా కేసుల గుర్తింపుతో పాటు వైద్యచికిత్సలను వేగవంతం చేస్తున్నాం. జీజీహెచ్‌తో పాటు మిగతా ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచుతున్నాం. ప్రజలు మాస్కు కచ్చితంగా ధరించాలి. లేకుంటే రూ.100 జరిమానా విధించనున్నాం. ఇలాంటి సమయంలో వైద్యులు, ప్రైవేటు ఆస్పత్రుల క్రియాశీల పాత్రను ఐఎంఏ సమావేశంలో వివరించాం. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో సగం బెడ్లను జిల్లా యంత్రాంగం ఆధీనంలో ఉంచుతాం. జిల్లాలో సంఘటితంగా కరోనాను ఎదుర్కొనేలా ప్రణాళిక రూపొందించాం. గత రెండ్రోజులుగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఓ డ్రైవ్‌లా వ్యాక్సిన్లు వేశాం. బుధవారం నుంచి 45 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయనున్నాం.

కాగితాలపై కన్పిస్తున్న పడకలు, క్షేత్ర స్థాయిలో కన్పించడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. జీజీహెచ్‌ ఎదుట పడకల కోసం ఇప్పటికీ నిరీక్షిస్తున్న ఘటనలు కన్పిస్తున్నాయి. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు?

ఇలాంటి ఫిర్యాదులు మా దృష్టికి కూడా వచ్చాయి. కరోనా లక్షణాలతో వచ్చేవారికి, 104కు ఫోన్‌ చేసినవారికి పరీక్షలు నిర్వహించాక హోం ఐసోలేషన్‌కు సిఫార్సు చేయాలా? కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు పంపాలా? ఆస్పత్రుల్లో చేర్చాలా అనే విషయాన్ని వైద్యులు నిర్ణయిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల పరిస్థితిపై ఇప్పటికే సమీక్ష నిర్వహించాం. కాగితాలపై చూపిస్తున్న పడకలు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటాయని హామీ ఇస్తున్నాం.

వైద్యులు, సిబ్బంది కొరత పీడిస్తోంది. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు?

గత ఏడాది సెప్టెంబరులో గరిష్ఠంగా పడకలకు తగ్గట్లుగా వైద్యులు, సిబ్బంది నియామకం జరిగింది. అదే రీతిన ప్రస్తుతం వైద్యులు, సిబ్బందిని నియమించనున్నాం. ఇప్పటికే వెయ్యి మంది ఆరోగ్య కార్యకర్తలను నియమించాం. మరో 500 మందిని నియమించనున్నాం. పాజిటివిటీ రేటు బట్టి నియామక ప్రక్రియ కొనసాగనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని