Published : 21/04/2021 05:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జిల్లా ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు 50 శాతం పడకలు


కొవిడ్‌-19 నియంత్రణ చర్యలపై సమీక్షిస్తున్న మంత్రి వెలంపల్లి, వేదికపై ఎమ్మెల్యే మల్లాది, జిల్లా కొవిడ్‌ ప్రత్యేక అధికారిణి సునీత, కలెక్టరు ఇంతియాజ్‌

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలోని ఆసుపత్రుల్లో 50 శాతం పడకలను కరోనా బాధితులకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరు విడిది కార్యాలయంలో జిల్లాలో కొవిడ్‌-19 నియంత్రణ చర్యలపై మంగళవారం సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలను అందించేందుకు 50 శాతం పడకలను తప్పనిసరిగా కేటాయించాలన్నారు. కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలను మరింత అప్రమత్తం చేయాలని చెప్పారు. బాధితులను ఆసుపత్రుల్లో చేర్పించుకోవడానికి, వైద్య పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కొవిడ్‌ కేసులతో పాటు ఇతర సాధారణ వ్యాధులకు చికిత్స అందించాలని పేర్కొన్నారు. తక్కువ ప్రమాద స్థాయిలో ఉండే బాధితులకు హోమ్‌ ఐసోలేషను పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఆసుపత్రుల్లో అత్యవసర మందులు, ఆక్సిజన్‌ తగినంతగా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, అక్కడ ప్రభుత్వం నిర్దేశించిన ధరలను ప్రదర్శించాలని సూచించారు. జిల్లా కొవిడ్‌ ప్రత్యేక అధికారిణి కె.సునీత మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని, లక్ష్య సాధనలో విజయం సాధించాలన్నారు. గతంలో కొవిడ్‌ సేవలు అందించిన ఆసుపత్రులకు అగ్నిమాపక శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపాలన్నారు. కలెక్టరు ఇంతియాజ్‌ మాట్లాడుతూ.. ఫ్రంట్‌లైన్‌ వారియర్సుకు 94 శాతం మేర వ్యాక్సినేషను పూర్తి చేసినట్టు తెలిపారు. త్వరలో 3వ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. సమీక్షలో జేసీలు ఎల్‌.శివశంకర్‌, కె.మాధవీలత, వీఎంసీ కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్‌, డీసీపీ హర్షవర్ధన్‌రాజు, వైద్య శాఖ అధికారులు ఎం.సుహాసిని, శివప్రసాద్‌, జ్యోతిర్మణి, జి.గీతాభాయి, నవీన్‌, బాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని