Published : 21/04/2021 05:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెక్‌ పవర్‌ ఎప్పుడొస్తుందో?

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

ర్పంచులకు ఇంకా చెక్‌ పవర్‌ ఇవ్వలేదు. పంచాయతీల్లో నిధులున్నా పనులు చేయించి బిల్లులు చెల్లించే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో ఏ సమస్య నెలకొన్నా ప్రజలు వెంటనే సర్పంచుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నా, బ్లీచింగ్‌ తదితరాలు కొనుగోలు చేయాలన్నా, వీధి దీపాలు, చేతి పంపులకు మరమ్మతులు చేయించాలన్నా నిధులు అవసరం. నేటికీ చెక్‌ పవర్‌ ఇవ్వకపోవడంతో ఆయా పనులు చేయించలేక సతమతమవుతున్నామని కొందరు సర్పంచులు చెబుతున్నారు.

3న బాధ్యతల స్వీకరణ

జిల్లాలో మొత్తం 977 పంచాయతీలు ఉన్నాయి. 958 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. వివిధ కారణాల వల్ల మిగతా చోట్ల ఎన్నికలు జరగలేదు. ఎన్నికల్లో గెలిచిన తరువాత బాధ్యతల స్వీకరణ కోసం నెలన్నర రోజులు ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ నెల 3వ తేదీన బాధ్యతలు అప్పగించారు. ఇంత వరకూ చెక్‌ పవర్‌ ఇవ్వలేదు. ఆర్థిక స్తోమత ఉన్న వారు సొంత నిధులు వెచ్చించి పనులు చేయిస్తున్నారు. లేనివారు ఇబ్బంది పడుతున్నారు. అటు ప్రజలకు సమాధానం చెప్పలేక.. ఇటు పెట్టుబడి పెట్టి పనులు చేయించలేక సతమతమవుతున్నారు. చెక్‌ పవర్‌ ఎప్పుడొస్తుందో తెలియక కొన్ని చోట్ల ఉప సర్పంచులుగా ఉన్న షాడో సర్పంచులు ముందస్తుగా సొమ్ము ఖర్చు చేసేందుకు వెనుకాడుతున్నారు. ఫలితంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రభుత్వ సూచన మేరకు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ సర్పంచులకు చెక్‌ పవర్‌ ఇవ్వాలి. ఈ నెల చివరికి చెక్‌ పవర్‌ ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని డీఎల్‌పీవో చంద్రశేఖర్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని