Published : 21/04/2021 05:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏసీబీ కేసులే లక్ష్యంగా దోపిడీ

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

మాట్లాడుతున్న ఏఎస్పీ మలికగర్గ్‌

మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: ఏసీబీ డీఎస్పీ, పోలీసు అధికారులమని చెప్పి పలువురిని మోసం చేసి దోపిడీకి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం వారిని విలేకరుల ముందు ప్రవేశపెట్టిన ఏఎస్పీ మలికగర్గ్‌, డీఎస్పీ రమేష్‌రెడ్డిలు వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా నల్లమడ మండలం, వెలమద్ది గ్రామానికి చెందిన రాచంపల్లి శ్రీనివాసులు అలియాస్‌ మంగలి శ్రీను 20 ఏళ్లుగా వివిధ నేరాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. పెడన మండల పీఆర్‌ఏఈ ఏసీబీ కేసులో పట్టుబడగా వారి కుటుంబ సభ్యులకు ఏసీబీ డీిఎస్పీనంటూ ఫోన్‌చేసి రూ.లక్ష తీసుకున్నాడనీ దీనిపై పెడన పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందన్నారు. మొదట్లో చైన్‌స్నాచింగ్‌, ద్విచక్రవాహనాలు, ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ కదిరి, పూతలపట్టు, పీలేరు, మదనపల్లి, పాకాల, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల్లో 17 కేసుల్లో నిందితునిగా ఉన్నాడని తెలిపారు. 2009 నుంచి 2013వరకు కడప సెంట్రల్‌ జైల్లో ఐదేళ్ల జైలుశిక్ష అనుభవించాడని, 2019లో బెంగళూరులో 6 చైన్‌స్నాచింగ్‌ కేసుల్లో అరెస్టయినట్లు చెప్పారు. ఆ తరువాత అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆన్‌లైన్‌లో డైలీహంట్‌ లాంటి వాటిల్లో వార్తలు చూసి ఏసీబీ, పోలీసు అధికారులమని చెప్పి వారినుంచి డబ్బులు దండుకుంటున్నట్లు తెలిపారు. అనకాపల్లి పరిధిలో మహిళల పట్ల ప్రధానోపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వచ్చిన వార్త చూసి ఆయన నుంచి రూ.50వేలు వసూలు చేశాడు. హిందూపురంలో సస్పైండ్‌ అయిన జైల్‌వార్డెన్‌నుంచి రూ.లక్ష, గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎస్సై నుంచి రూ.50వేలు, ఆత్మకూరులో ఓవ్యక్తి నుంచి రూ.2లక్షలు. శ్రీకాకుళం జిల్లా జెఆర్‌కెపురం ప్రాంతంలో ఓ కేసులో అరెస్టయిన ఎస్సై నుంచి రూ.4లక్షలు, ప్రొద్దుటూరులో రూ.7.40లక్షలు ఇలా వివిధ ప్రాంతాల్లో ఏసీబీ అధికారిని అనిచెప్పి రూ.లక్షలు కాజేశాడని వివరించారు. మరో నిందితుడు నూతేటి జయకృష్ణ అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కొట్టాల పల్లి గ్రామానికి చెందినవాడని అతను కూడా ఇదే తరహాలో దాడులకు పాల్పడుతున్నట్లు చెప్పారు. పెడన మున్సిపల్‌ కమిషనర్‌ను బెదిరించిన విషయంలో ఇతనిపై కేసు నమోదయ్యిందని, పోలీసు అధికారిగా చలామణి అవుతూ ఎంతోమంది నుంచి నగదు దోచుకున్నాడని వివరించారు. గత పదేళ్లలో 25కుపైగా కేసులు నమోదయ్యాయని, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల్లో 16 కేసుల్లో అరెస్టయి నెల్లూరు జైల్లో శిక్ష అనుభవించాడని చెప్పారు. ఏసీబీ డీిఎస్పీ అని చెప్పి వివిధ జిల్లాల్లో రూ.లక్షలు వసూలు చేశాడు. రోడ్డుపక్కన చిరువ్యాపారులతో ఫోన్‌ చేసుకుని ఇస్తానని చెప్పి వారి ఫోన్‌ తీసుకుని సిమ్‌ కాజేసి ఆ నెంబరు నుంచి నేరాలకు పాల్పడతాడనీ, నేరం చేసిన వెంటనే వాడిన ఫోను, సిమ్‌ను ఇతర ప్రాంతాలు వెళ్లే రైళ్లలో వేసి పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాడని వివరించారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో రాచంపల్లి శ్రీనివాసులు నుంచి రూ.98,500ల నగదు, జయకృష్ణ నుంచి నేరాలకు ఉపయోగించిన సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఈ అంతర రాష్ట్ర దొంగలను అత్యంత చాకచక్యంగా పట్టుకున్న బందరు రూరల్‌ సీఐ కొండయ్య, ఎస్సై మురళి బృందాన్ని అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని