Published : 21/04/2021 05:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిల్వలు @ 2,22,164 బస్తాలు


మిరప బస్తాల లారీలతో కిక్కిరిసిన యార్డు

మిర్చియార్డు, న్యూస్‌టుడే: గుంటూరు మిర్చియార్డుకు సరకు వస్తూనే ఉంది. కరోనా కేసుల విస్తృతిని దృష్టిలో పెట్టుకుని ఈ వారంలో మిగిలిన రోజులు క్రయవిక్రయాలు నిలిపివేయాలని పాలకవర్గం, అధికారులు నిర్ణయించారు. లావాదేవీలు జరిపేందుకు వారంలో చివరి రోజని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున మిర్చి బస్తాలను అమ్మకం నిమిత్తం తరలించారు. మంగళవారం మిర్చియార్డుకు మొత్తం 1,66,421 బస్తాలు వచ్చాయి. 1,43,146 బస్తాలు క్రయవిక్రయాలు జరిగాయి. దీంతో మొత్తం నిల్వలు 2,22,164 బస్తాలకు చేరుకున్నాయి. రెండు లక్షల బస్తాలకు పైగా నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో సెలవులు ప్రకటించినప్పటికీ లావాదేవీలు కొనసాగించే యోచనలో అధికారులు ఉన్నారు. వచ్చే సరకును మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించబోమని, రైతులు యార్డుకు మిర్చిని తీసుకురావద్దని స్పష్టం చేశారు. యార్డులో మిగిలిపోయిన బస్తాలన్నీ అమ్మకాలు పూర్తవడానికి శనివారం వరకు పట్టే అవకాశం ఉందని వ్యాపారులు, అధికారులు పేర్కొంటున్నారు.

టిక్కీలతో కిక్కిరిసిన యార్ఢు. మిర్చియార్డుకు వచ్చిన బస్తాలు, నిల్వ ఉన్న బస్తాల సంఖ్య సుమారు నాలుగు లక్షలు ఉందని గణాంకాలు చెబుతున్నాయి. 3,88,585 బస్తాలు కమీషన్‌ ఏజెంట్ల దుకాణాలు, రహదారులు, వాహనాల్లో ఉండటంతో యార్డు పరిసరాలన్నీ మిర్చి టిక్కీలతో కిక్కిరిసిపోయాయి. వాహనాలు ముందుకు కదిలే వీల్లేకపోవడంతో బారులు తీరాయి. ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. సరకు నాణ్యత లేకపోవడంతో రైతులు ఆశించిన ధర పడక క్రయవిక్రయాలు నెమ్మదించాయి. ఈ ప్రభావం తూకాలపై పడింది. క్రితం రోజు వచ్చిన బస్తాలు లెక్క కూడా కొంతమేర మంగళవారంలోకి థవచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు. డీలక్స్‌ రకాల మార్కెట్‌ స్థిరంగా ఉంది. నాణ్యత మాత్రం లేదని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. 334, నెంబర్‌ 5, 273, 341, 4884, సూపర్‌ 10 రకాల మిర్చి సగటు ధర రూ.5000 నుంచి రూ.14,000 ఉండగా, తేజ రకం మిర్చికి రూ.6000 నుంచి రూ.15,400, బాడిగ రకాలకి రూ.8000 నుంచి రూ.17,000, తాలు రూ.4,500 నుంచి రూ.8,500 ధర లభించింది. తాలు మిర్చి నాసిరకంగా ఉండంతో ధర రూ.500 నుంచి రూ.1000 మేర తగ్గింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని