Published : 21/04/2021 05:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిందే


నోడల్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: కొవిడ్‌-19 ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 శాతం పడకలు కచ్చితంగా జిల్లా వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణలోనే ఉంచాలని, ఆ దిశగా నోటీసులు జారీ చేయాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్య ప్రతినిధులు, నోడల్‌ అధికారులతో కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌, ఆసుపత్రుల నిర్వహణ, కరోనా నివారణ చర్యలపై మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్‌ ఆక్యుపెన్సీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని, 104 కాల్‌ సెంటర్‌కి వైరస్‌ సోకిన వారు ఎవరు ఫోన్‌ చేసినా.. వెంటనే ఆసుపత్రుల్లో చేర్పించేలా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లోని వైద్యసేవలు, ఇతర వసతులపై తహసీల్దార్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని సూచించారు. హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. ఇప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకోని ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్‌కేర్‌ వర్కర్లను వివరణ కోరుతూ షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలన్నారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లంతా వ్యాక్సిన్‌ తీసుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్‌, నాన్‌కొవిడ్‌ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, ఆక్సిజన్‌ సిలిండర్లు, అంబులెన్సుల కొరత లేకుండా నెట్‌వర్క్‌ ఆసుపత్రులు, వైద్యారోగ్య శాఖ బృందంగా ఏర్పడి పని చేయాలన్నారు. జేసీ పి.ప్రశాంతి మాట్లాడుతూ పాజిటివ్‌ వ్యక్తుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వ్యాపార సంస్థలు, బ్యంకులు, ఇతర సంస్థల్లో ఉద్యోగులకు కరోనా సోకితే వెంటనే సంబంధిత సంస్థను మూసివేసి అక్కడ పని చేసే వారందరికీ పరీక్షలు నిర్వహించిన తర్వాతే ప్రారంభించేందుకు అనుమతించాలన్నారు. నిబంధనలను పాటించని సంస్థలను వెంటనే మూయించాలని, ఇరుకు ప్రదేశాల్లో ఉన్న మార్కెట్లను నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జేసీ-2 కె.శ్రీధర్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ అధికారి యాస్మిన్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాధ, డీపీవో కేశవరెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, ప్రత్యేక ఉప కలెక్టర్‌ కొండయ్య, ఆసుపత్రి మేనేజ్‌మెంట్‌ నోడల్‌ అధికారి డేవిడ్‌రాజు, నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని