ఆందోళన వీడుదాం..జాగ్రత్తలు పాటిద్దాం..
logo
Published : 07/05/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆందోళన వీడుదాం..జాగ్రత్తలు పాటిద్దాం..

అప్రమత్తంగా ఉండాలని నిపుణుల సూచన
ఈనాడు, అమరావతి

కొవిడ్‌ సృష్టిస్తున్న కల్లోలం అందరిలోనూ తీవ్ర మానసిక ఆందోళన రేపుతోంది. స్నేహితులు, తెలిసిన వాళ్లు వైరస్‌ బారిన పడుతుండడం.. కొందరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుండడంతో.. ఎంత ధైర్యంగా ఉన్న వారిలోనైనా భయాందోళనలు నెలకొంటున్నాయి.  విజయవాడ, గుంటూరు నగరాల్లో నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. దీంతో బయటకు అడుగుపెట్టాలంటేనే చాలామంది గుండెల్లో వణుకు మొదలవుతోంది. గత కొవిడ్‌ సమయంలోనూ ఇలాంటి ఆందోళనకర పరిస్థితిని ఎదుర్కోలేదని.. మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే.. మరింత ధైర్యంగా, దృఢంగా ఉండాల్సిన సమయం ఇదని సూచిస్తున్నారు.

ఒక్కరు మాస్కు పెట్టకపోయినా..
ముక్కుకు, నోటికి మాస్కు పెట్టుకున్నా.. కళ్లలో నుంచి శరీరంలోనికి ప్రవేశిస్తోందంటూ ప్రస్తుతం చాలామంది వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  వందలో 99మంది మాస్కులు పెట్టుకుని.. ఒక్కరు పెట్టకపోయినా.. దానివల్ల కలిగే అనర్థం చాలా ఎక్కువగా ఉంటోంది. అందరూ మాస్కులు పెట్టుకోవడం వల్ల.. బాధితుల నుంచి గాలిలోనికి వైరస్‌ రావడం ఆగిపోతుంది. వైరస్‌ బారినపడిన వాళ్లు తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా.. వాళ్లు పెట్టుకున్న మాస్కును దాటి వైరస్‌ రాదు. దానివల్ల ఇతరులకు వ్యాపించడం జరగదు. అందుకే.. ఖచ్చితంగా 100శాతం అందరూ మాస్కులు పెట్టుకోవాలి.  

ఆయుధాలెన్నో..

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోజూ రెండు వేల మందికి పైగా వైరస్‌ బారినపడుతున్నారు. ప్రస్తుతం రెండు జిల్లాల్లో 25వేల మంది వరకు వైరస్‌ బారినపడి చికిత్స పొందుతున్న వాళ్లున్నారు.  వీరి కుటుంబాలు, స్నేహితులు.. అందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆందోళనకు గురికావొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. యోగా, ధ్యానం లాంటివి చేస్తే మానసిక ఆందోళనను తగ్గించడంతో పాటు తమవాళ్లకు అండగా నిలబడే ధైర్యాన్ని, ప్రశాంతతను ఇస్తాయి.

ఈ సమయంలోనైనా వాటి జోలికెళ్లొద్దు..
అనారోగ్యకరమైన ఆహార అలవాట్లను మానుకోవాలని వైద్య నిపుణులు ఎంతగా హెచ్చరిస్తున్నా.. విజయవాడ, గుంటూరు నగరాల్లో ఫాస్ట్‌ఫుడ్‌ సంస్కృతికి అలవాటుపడిన వాళ్ల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ప్రస్తుతం ఇలాంటి వారిపై కొవిడ్‌ ప్రభావం ఎక్కువ ఉంటోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  ఈ సమయంలో పండ్లు, ఆకుపచ్చని కూరగాయలతో కూడిన పౌష్ఠికాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

అర్ధరాత్రి జీవనశైలి  మారాలి..
రెండు నగరాల్లోనూ రాత్రి జీవనశైలి బాగా పెరిగిపోయింది. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండడం.. ఉదయం ఆలస్యంగా లేవడం.. ఎక్కువ మందికి అలవాటుగా మారిపోయింది. నిద్రలేమి సమస్యలు బాగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అనారోగ్యకరమైన ఈ జీవనశైలిని కూడా మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి 8గంటల్లోపు భోజనం ముగించుకుని.. త్వరగా పడుకోవడం, ఉదయాన్నే లేచి యోగా, ధ్యానం లాంటివి చేయడం వల్ల.. వైరస్‌ బారినపడినా.. దానిని ఎదుర్కొనే శక్తి వస్తుంది.

ఒక్క ఆదివారం చాలు..

వైరస్‌ ప్రభావం ఇంత తీవ్రంగా ఉన్నా.. ఆదివారం వచ్చిందంటే.. చేపల మార్కెట్లు, రైతుబజార్లు, మాంస దుకాణాలు, సూపర్‌మార్కెట్లు కిక్కిరిసిసోతున్నాయి. మాస్కులు సరిగా ధరించకపోవడం, కనీసం గాలిదూరే సందు కూడా లేకుండా ఒకరినొకరు నెట్టుకునేంతలా ఆదివారాల్లో జనం కనిపిస్తున్నారు. వైరస్‌ ఉద్ధృత వ్యాప్తికి వారాంతాలు కూడా ఓ కారణమని అధికారులు చెబుతున్నారు. కనీసం ఇప్పటికైనా.. అప్రమత్తమై.. వారాంతాల్లో మార్కెట్లపై దాడి చేసే పంథాను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ?

పిల్లలందరినీ ఒకచోట చేరనివ్వొద్దు..
ప్రస్తుతం చాలా చోట్ల పిల్లలందరూ ఆడుకునేందుకు ఒకేచోట చేరడంతో.. ఒకరికి వైరస్‌ ఉన్నా.. అది మిగతా వారికి వ్యాప్తి చెందుతోంది. అపార్టుమెంట్లు, కాలనీల్లో ఈ పరిస్థితి ఎక్కువ ఉంటోంది. పిల్లలకు వైరస్‌ సోకినా.. వారిపై ప్రభావం తక్కువగానే ఉంటోందని వైద్యులు సూచిస్తున్నారు. కానీ.. వారి ద్వారా పెద్దవాళ్లకు సోకి.. పరిస్థితి విషమిస్తోంది. అందుకే.. ఎట్టిపరిస్థితుల్లోనూ పిల్లలను ఆడుకునేందుకు కూడా ఇంటి గడప దాటనివ్వొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఎన్నడూ ఊహించని పరిస్థితులు..
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గతంలో ఎన్నడూ ఊహకు కూడా అందనివే. చుట్టూ ఎటుచూసినా వైరస్‌ బారినపడుతున్న వాళ్లే కనిపిస్తున్నారు. ఈ సమయంలో ఆందోళన చెందడం సహజమే. కానీ.. ఇది మరింతగా పరిస్థితులను విషమంగా మారుస్తుంది. అందుకే..  ధైర్యంగా ఉండాల్సిన సమయం ఇది.  మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు యోగా, ధ్యానం ఎంతో ఉపయోగపడతాయి. కొవిడ్‌ నిబంధనలను అందరం కలిసి పాటించాలి. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉన్నా.. సమాజం మొత్తం మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

- డాక్టర్‌ టి.ఎస్‌.రావు, కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని