విత్తనాలు అమ్మారు.. ధాన్యం కొనరా?
logo
Published : 07/05/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విత్తనాలు అమ్మారు.. ధాన్యం కొనరా?

ఈనాడు, అమరావతి

రోడ్లు మీదే ధాన్యపు రాశులు

పెనమలూరు మండలం వణుకూరు గ్రామానికి చెందిన కిలారు సుధాకర్‌ రబీలో 8 ఎకరాలను సాగు చేశారు. ఎకరానికి 40 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. తీరా రైతు భరోసా కేంద్రానికే వెళితే సుధాకర్‌ సాగు చేసిన రకం ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతున్నారు. అదేమంటే వాటిని మిల్లు ఆడిస్తే నూక వస్తుందని రబీలో ప్రభుత్వం నిషేధించిన రకమని చెప్పారు. ఇదే ధాన్యం.. ప్రైవేటు వ్యాపారులు బస్తా రూ.950 చొప్పున కొనుగోలు చేశారు. దీనివల్ల రైతు బస్తాకు రూ.450 చొప్పున నష్టపోయారు. ఒక్క వణుకూరు గ్రామంలో దాదాపు 2వేల ఎకరాలకు పైగా ఎంటీయూ 1153, ఎంటీయూ 1156 రకాలను సాగు చేశారు. వ్యవసాయ శాఖ (ఏపీసీడ్స్‌) ఆ విత్తనాలు అమ్మితే.. ఆ రకాలను ప్రభుత్వమే కొనుగోలు చేయకపోవడం విచిత్రం.
కంకిపాడు మండలం పునాదిపాడుకు చెందిన మద్ధాలి సాయిబాబు 20 ఎకరాల్లో రబీ సాగు చేశారు. 10 ఎకరాల్లో ఎంటీయూ 1156, మరో 10 ఎకరాల్లో ఎంటీయూ 1153 రకాలను సాగు చేశారు. ఎకరానికి సగటున 35 బస్తాల దిగుబడి వచ్చింది. మొత్తం 700 బస్తాల ధాన్యం రోడ్డుమీద పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. వీటిని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. వ్యాపారులు సైతం చాల తక్కువ ధరకు అడుగుతున్నారు. ఈ రైతు కూడా ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలనే కొనుగోలు చేశారు.

నిషేధించిన వంగడాలు..! : రబీలో ఎంటీయూ 1010, ఎంటీయూ 1153, ఎంటీయూ 1156, ఎంటీయూ 1001 వంగడాల సాగును ప్రభుత్వం నిషేధించింది. ధాన్యం మిల్లు ఆడించినప్పు నూక ఎక్కువగా వస్తుందని, కొన్ని గింజ రంగు మారుతున్నాయని, బియ్యం వండిన తర్వాత తినేందుకు అనువుగా ఉండటం లేదని ఈ నిర్ణయం తీసుకున్నారు.  దీంతో వీటిని సాగు చేయవద్దని, రబీలో కేవలం ఎంటీయూ 1121 రకాన్ని మాత్రమే వేయాలని వ్యవసాయ శాఖ ప్రచారం చేసింది. దీనిపై చాలామంది రైతులకు అవగాహన లేక నిషేధించిన రకాలనే సాగుచేశారు.
ప్రస్తుత పరిస్థితి..! : జిల్లాలో దాదాపు 2.75లక్షల ఎకరాల్లో రబీ సాగు చేశారు. కానీ ఎంటీయూ 1121 చాలా తక్కువ విస్తీర్ణంలో ఉండగా, ఎక్కువగా ఎంటీయూ 1156, 1153 సాగు చేశారు. కొన్ని మండలాల్లో 1010, 1001 వేశారు. ప్రస్తుతం ఈ నాలుగు రకాలను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. తిరువూరు  ప్రాంతంలో ఇప్పటికే 80 శాతం కోతలు అయిపోయాయి. ఎక్కువ శాతం రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు. బస్తా ధాన్యం ఎంఎస్‌పీ ప్రకారం రూ.1401 రావాల్సి ఉండగా.. కేవలం రూ.950 నుంచి రూ.1050 వరకు మిల్లర్లకు విక్రయించుకున్నారు.  జిల్లాలో దాదాపు 1.50లక్షల ఎకరాల్లో ప్రభుత్వం వద్దన్న ఎంటీయూ రకాలు సాగు చేసిన రైతుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.   రబీ సాగుకు ముందు ఈ విత్తనాలను ఏపీ సీడ్స్‌ ద్వారా కొనుగోలు చేశామని రైతులు చెబుతున్నారు.  
సమన్వయం లేకనే..! :   ఈ క్రాప్‌లో పంట విస్తీర్ణంతో పాటు సాగు రకాలు నమోదు చేయాల్సి ఉంది. గతంలో తప్పనిసరి కాకపోవడంతో దానిని రైతులు విస్మరించారు. తర్వాత రైౖతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి వచ్చింది. వ్యవసాయ శాఖకు, ఆర్‌బీకేలకు మధ్య సమన్వయం లేకపోవడంతో రైతులు పెద్దఎత్తున ఆ రకాలను సాగు చేసి ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

నష్టం ఎవరు భరిస్తారు..?

- కడియాల రామ్మోహన్‌రావు, రైతు, వణుకూరు
నేను 15 ఎకరాలు రబీ సాగు చేశాను. మా గ్రామంలో వీఏఏ కానీ, ఏవో కానీ ఎంటీయూ 1156, 1153 రకాలు వద్దని చెప్పలేదు. కానీ సీడ్స్‌ కూడా సరఫరా చేశారు. ఏ వంగడానికైనా కష్టం ఒక్కటే. పెట్టుబడి అంతే అయింది. ఇప్పుడు కొనుగోలు చేయబోమని, నూక వస్తుందని చెబుతున్నారు. దీనికి ఎవరు బాధ్యలు. నష్టాన్ని ఎవరు భరించాలి. ప్రైవేటుగా వ్యాపారులు తక్కువ చేసి కొనుగోలు చేస్తున్నారు. వీటిని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాను.

మాకు అవగాహన లేదు..!

- వెనిగళ్ల నాగేశ్వరరావు, రైతు, వణుకూరు
ఈ రకాలు సాగు చేయకూడదనేది  రైతులకు అవగాహన లేదు. ముందుగా గ్రామాల వారీగా హెచ్చరిస్తే ఎందుకు వేస్తారు. నేను 9 ఎకరాల్లో సాగు చేశాను. 300 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ఎవరికి విక్రయించాలనేది సమస్యగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

నూక శాతం ఎక్కువ ఉంది..!

- కె.మాధవీలత, జేసీ
గత ఏడాది చాలా స్పష్టంగా వ్యవసాయ శాఖ కరపత్రాల ద్వారా ఏయే రకాలు సాగు చేయాలనేది ప్రచారం నిర్వహించి రైతుల్లో అవగాహన కల్పించింది. అయినా వాటినే సాగు చేశారు. వీటిలో నూక శాతం ఎక్కువగా ఉంది. అందుకే బియ్యం ఆడించేందుకు పనికి రావని అధికారులు చెబుతున్నారు. ఎఫ్‌సీఐ తీసుకోవడం లేదు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు చేయాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని