పిడుగురాళ్లలోని రెండు ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు
logo
Published : 07/05/2021 03:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిడుగురాళ్లలోని రెండు ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-నెహ్రూనగర్‌

కొవిడ్‌ చికిత్సకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్న పిడుగురాళ్లలోని రెండు ఆస్పత్రులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. వాటి దోపిడీపై సాక్ష్యాధారాలతో బాధితులు ఫిర్యాదు చేయగా స్పందించిన జిల్లా నిఘా విభాగం ఎస్పీ జాషువా రెండు రోజుల కిందట విచారణకు ఆదేశించారు. పల్నాడు ఆసుపత్రి, అంజిరెడ్డి ఆసుపత్రి రెండింటిలో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని తమ పరిశీలనలో తేలిందని ఎస్పీ ‘ఈనాడు’కు తెలిపారు. నిర్వాహకులపై క్రిమినల్‌ కేసులు నమోదుకు ఆదేశించగా, ఇప్పటికే పోలీసులు పలువురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద రోగులను చేర్చుకుని అధిక మొత్తంలో ఫీజులు తీసుకుంటున్నాయని సాక్ష్యాధారాలతో ఫిర్యాదులు అందాయని ఎస్పీ పేర్కొన్నారు. పల్నాడు ఆసుపత్రిలో ఓ రోగి నుంచి ఆరు రోజుల వైద్యసేవలకు రూ.3.15 లక్షలు సొమ్ము చేసుకున్నట్లు గుర్తించామన్నారు. అదే విధంగా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ రూ.2200కు ప్రభుత్వం సరఫరా చేయగా దాన్ని రూ.10 వేలకు విక్రయించినట్లు నిగ్గు తేల్చామని వెల్లడించారు. అంజిరెడ్డి ఆసుపత్రిలో ఒక పేషెంట్‌ నుంచి రూ.1.5 లక్షలు వసూలు చేశారని, ఇది కూడా ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కన్నా అధికంగా ఉందని పేర్కొన్నారు. ఆ రెండు ఆసుపత్రులపై చట్టపరమైన చర్యలకు నివేదించనున్నట్లు ఎస్పీ వివరించారు. జిల్లాలో కరోనా వైద్యసేవలు అందిస్తున్న అన్ని ఆసుపత్రులపై నిఘా ఉంచామని ఎవరైనా చట్ట విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జాషువా హెచ్చరించారు. ఫిర్యాదుదారులకు పూర్తిగా భద్రత కల్పిస్తామని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని