ట్రాక్టర్లపై కూలిన విద్యుత్తు నియంత్రికలు
logo
Published : 07/05/2021 03:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రాక్టర్లపై కూలిన విద్యుత్తు నియంత్రికలు

రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

కొల్లూరు, న్యూస్‌టుడే: విద్యుత్తు నియంత్రికలు విరిగిపడిన రెండు వేర్వేరు సంఘటనల్లో ఒకరు మృతి చెందగా, ఇరువురు తీవ్ర గాయాలపాలయ్యారు. మండలంలోని జువ్వలపాలెం సమీపంలోని పొలాల్లో గురువారం ఈ రెండు ఘటనలు జరిగాయి. పొలంలో వ్యర్థాలను రోటావేటర్‌తో కలియదున్నే సమయంలో ఇవి చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. జువ్వలపాలేనికి చెందిన వేములపల్లి కుటుంబరావుకు చెందిన మొక్కజొన్న పొలంలో రోటావేటర్‌తో దున్నేందుకు కేసన విజయకుమార్‌కు చెందిన ట్రాక్టరుపై డ్రైవర్‌గా పనిచేస్తున్న భూపతి అనిల్‌(20) వెళ్లారు. ఈ క్రమంలో పొలంలో విద్యుత్తు నియంత్రికకు అండగా ఏర్పాటుచేసిన ఇనుప తీగను ఆయన గమనించకపోవడంతో అది రోటావేటర్‌కు చుట్టుకుపోయింది. దీంతో నియంత్రికను అమర్చిన విద్యుత్తు స్తంభం విరిగి టాక్టర్‌ నడుపుతున్న అనిల్‌పై పడిపోయింది. దీంతో ఆయన తీవ్ర విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. ట్రాక్టరుపై ఈయన పక్కనే కూర్చున్న జంపని వినోద్‌ తీవ్రంగా గాయపడడంతో ఈయన్ను తెనాలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.  
ఇదే తరహా సంఘటన జువ్వలపాలెం కొత్త ఎస్సీ కాలనీ సమీపంలోనూ చోటుచేసుకుంది. చిలుమూరు ప్రేమ్‌కుమార్‌కు చెందిన ట్రాక్టర్‌పై చోదకునిగా పనిచేస్తున్న భట్టిప్రోలు మండలం పెదలంకకు చెందిన అజిత్‌కుమార్‌ మొక్కజొన్న కోసిన మన్నె శ్రీహరిరావుకు చెందిన పొలంలో రోటావేటర్‌ వేస్తుండగా నియంత్రికను అమర్చిన విద్యుత్తు స్తంభం విరిగి మీదపడింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అజిత్‌కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈయన్ను తొలుత తెనాలి, తర్వాత గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అనిల్‌ మృతిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. అతని కుటుంబసభ్యులు నిరాకరించి మృతదేహాన్ని వారి ఇంటికి తరలించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని