Published : 09/05/2021 07:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రాణవాయువు లోటు!

ఈనాడు, అమరావతి

జిల్లాలో కరోనా వైరస్‌తో బాధపడుతున్న రోగులకు చాలా వరకు ప్రాణవాయువు అందక అనేక నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అయినా యంత్రాంగం సమస్యను అధిగమించలేకపోతోంది. జిల్లాలో చోటుచేసుకుంటున్న మరణాలకు, యంత్రాంగం చెబుతున్న లెక్కలకు ఆచరణలో ఏమాత్రం పొంతన ఉండడం లేదు. కొన్ని మరణాలు ప్రభుత్వ రికార్డులకు ఎక్కడం లేదు. గడిచిన వారం రోజుల నుంచి ప్రాణవాయువు నిల్వలపై నిత్యం జిల్లా ఉన్నతాధికారులు సమీక్షలు చేస్తున్నా సమస్య మాత్రం ఇంకా జఠిలంగా మారుతోంది. గుంటూరు నగరంతో పాటు తెనాలి, నరసరావుపేట, బాపట్ల, మంగళగిరి శ్మశానవాటికల్లో సగటున రోజుకు ఒక్కో దానిలో పదుల సంఖ్యలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. దీన్నిబట్టి జిల్లాలో ఏ స్థాయిలో మరణాలు ఉంటున్నాయో ఊహించుకోవచ్చు.

● జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న కరోనా రోగులకు రోజువారీ ప్రాణవాయువు 27.8 కిలోలీటర్లు అవసరమని అధికారులు అంచనా వేయగా శనివారం ఉన్న నిల్వలు 20.1 కిలోలీటర్లు మాత్రమే. దీన్నిబట్టి ఎంత లోటు ఉందో స్పష్టమవుతోంది. ఒక కేఎల్‌ అంటే 120 డీ టైప్‌ రకం సిలిండర్లతో సమానం. ఒకవైపు ప్రాణావాయువే లోటు అనుకుంటే మరోవైపు దాని వృథా కూడా అధికంగా ఉంటోంది. రోగులనే ఆక్సిజన్‌ సిలిండర్లు అమర్చుకోవాలని ఆస్పత్రి అధికారులు సూచించి చేతులు దులిపేసుకుంటున్నారు. సహజంగా ఆయా వార్డుల్లో ఉండే స్టాఫ్‌ నర్సులు ఆక్సిజన్‌ ఆన్‌, ఆఫ్‌ వంటివి చూడాలి. రోగి భోజనం చేసేటప్పుడు, మరుగుదొడ్లకు వెళ్లినప్పుడు ఆక్సిజన్‌ సరఫరాను నిలిపివేయాలి. దీనిపై చాలా మంది రోగులకు అవగాహన లేక వాల్వ్‌ ఆపడం లేదు. ఇలా వృథాకు బాగా ఆస్కారం ఉంటోందని ఆక్సిజన్‌ సరఫరాను పర్యవేక్షించే అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం 20 శాతం మేర వృథా ఉంటుందన్నారు. రోగుల వద్దకు వెళితే తాము కరోనా బారినపడతామని స్టాఫ్‌ నర్సులు అంటీముట్టనట్లు ఉంటున్నారని, దీంతో ఆక్సిజన్‌ సిలిండర్లు అమర్చుకోవడం నుంచి వినియోగం దాకా ప్రతిదీ రోగి స్థాయిలోనే జరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

ప్రతి నలుగురిలో ఇద్దరికి...

రోజురోజుకు ఆక్సిజన్‌ అవసరాలు పెరుగుతున్నాయి. ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో చేరుతున్న ప్రతి నలుగురిలో కనీసం ఇద్దరికి ప్రాణవాయువు అవసరం ఏర్పడుతోందని వైద్యులు చెబుతున్నారు. సగటున రోజుకు వెయ్యి మందికి పైగా చికిత్స పొందే గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలతో పాటు గుంటూరు జ్వరాల ఆస్పత్రి, తెనాలి జిల్లా ఆస్పత్రి, నరసరావుపేట, బాపట్ల ప్రాంతీయ ఆస్పత్రులు, మంగళగిరి ఎయిమ్స్‌ ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న ఈ ఆస్పత్రులకే డిమాండ్‌ మేరకు ప్రాణవాయువు సమకూర్చలేని పరిస్థితి. ఆక్సిజన్‌ స్థాయి 80-90 మధ్య ఉన్న వారికి దాన్ని నిరంతరం అందిస్తే వారు మూడు, నాలుగు రోజుల్లో కోలుకుంటారు. అలాంటిది ఆక్సిజన్‌ నిల్వలు ఆస్పత్రిలో అందుబాటులో లేక 80-90 మధ్య శాచురేషన్‌ ఉన్నవారు సైతం ప్రాణాలు కోల్పోతున్నారని జీజీహెచ్‌ వైద్యుడొకరు పేర్కొన్నారు. అపస్మారక స్థితిలోకి జారుకున్నవారికి సైతం ఆక్సిజన్‌ అందించడం ద్వారా బతికించవచ్చని, వారికి ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులు ఏమీ లేకపోతే ప్రాణవాయువు అందించడం ద్వారా త్వరగా కోలుకునేలా చేయొచ్చని వైద్యవర్గాలు చెబుతున్నాయి. కానీ యంత్రాంగానికి ఇదేం పట్టడం లేదు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ కరోనా తీవ్రత బాగా ఉన్న జిల్లాల్లో గుంటూరు ఒకటి. సగటున రోజుకు ఇక్కడ వెయ్యికి తగ్గకుండా కేసులు వస్తున్నాయి. డిశ్ఛార్జ్‌లు ఏ స్థాయిలో ఉంటున్నాయో అంతకు రెండింతలు నిత్యం ఆస్పత్రుల్లో చేరేవారు ఉంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆక్సిజన్‌ నిల్వలను బాగా సమకూర్చుకుని రోగుల అవసరాల మేరకు దాన్ని అందించగలిగితే మరణాలు తగ్గటమే కాదు త్వరగా కోలుకుంటారని వైద్యులు సూచిస్తున్నారు. కోస్తా జిల్లాల ఆరోగ్య వరప్రదాయినిగా పేరుగడించిన గుంటూరు జీజీహెచ్‌కు ఒక్క గుంటూరు, ప్రకాశం నుంచే కాదు కోస్తా జిల్లాల నుంచి రోగులు తరలివస్తున్నారు. ప్రాణవాయువు ఇండెంట్‌ పెంచాలని జిల్లా ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నా సరఫరా మాత్రం ఏమాత్రం మెరుగుకాలేదని ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారి ఒకరు చెప్పారు.

6300 పడకలు

జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ఆరోగ్యశ్రీ, నాన్‌ ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అన్నింటిలో కలిపి 6300 ఆక్సిజన్‌ పడకలు ఉన్నాయి. వీటిల్లో 3838 నాన్‌ ఐసీయూ ఆక్సిజన్‌ పడకలు. మిగిలినవి నాన్‌ ఐసీయూ నాన్‌ ఆక్సిజన్‌ పడకలు. ఒకవైపు ఇన్ని వేలల్లో పడకలు ఉంటే ఆక్సిజన్‌ నిల్వలు ఆ మేరకు ఆస్పత్రుల్లో లేక రోగులకు పూర్తి స్థాయిలో అందటం లేదని అంటున్నారు. శాచురేషన్‌ స్థాయిని బట్టి రోగికి 5, 10, 15 లీటర్ల సామర్థ్యంతో కూడిన ఆక్సిజన్‌ సిలిండర్లు అమర్చి ప్రాణవాయువును అవసరం మేరకు అందించేలా ఏర్పాట్లు ఉంటాయి. ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఉన్న అరకొర నిల్వలతో అందరు రోగులకు వచ్చేలా దాన్ని సర్దుబాటు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వ్యాధి తీవ్రత కలిగిన రోగులకు అది అందకుండా పోతోందని, దీంతో పరిస్థితి విషమించి ప్రాణాపాయానికి దారితీస్తోందని అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం ఆక్సిజన్‌ను డిమాండ్‌ మేరకు సమకూర్చుకోవడంతో పాటు వృథాపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని