Published : 09/05/2021 07:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాడి పట్టేదెవరు..?

నాన్‌కొవిడ్‌ కేసులు గుంటూరుకే..
ఈనాడు, అమరావతి

ఖాళీగా కొత్తాస్పత్రి ఓపీ

* ఏ.కొండూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి ప్రతి నెలా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి మూత్రపిండాల శుద్ధి (డయాలసిస్‌) చేయించుకునేవారు. గత రెండు నెలలుగా ఆయన ఆస్పత్రికి వస్తే ఇక్కడ సౌకర్యం లేదని చెబుతున్నారు. కారణం జీజీహెచ్‌ పూర్తిగా రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రిగా మారిపోయింది. సిబ్బంది మాత్రం గుంటూరు వెళ్లాలని సలహా ఇస్తున్నారు.
* ఇటీవల ప్రసాదంపాడులో ఒక ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తే ప్రథమ చికిత్స చేసిన అనంతరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ రోగులకు చికిత్స సౌకర్యం లేదని చెబుతున్నారు.

విజయవాడ జీజీహెచ్‌లో ప్రస్తుతం సాధారణ రోగులకు చికిత్స లేదు. రోడ్డు ప్రమాదాలు, ఇతర సంఘటనల్లో గాయపడిన వారు చికిత్స తీసుకొనేందుకు నానా కష్టాలు పడుతున్నారు. సాధారణ రోగుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రులు సైతం కొవిడ్‌ ఆస్పత్రులుగా మారాయి. దీంతో దీర్ఘకాలిక వ్యాధులు, సాధారణ జబ్బులు చేసిన వారు ఎక్కడ చికిత్స తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొవిడ్‌ మొదటి దశలో జీజీహెచ్‌ను పూర్తి స్థాయి రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చారు. నాడు సాధారణ రోగులను పక్కనే ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రెండో దశలో అక్కడ కూడా ఏర్పాటు చేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నిరుపేదలు గుంటూరు ఆస్పత్రికి వెళ్లాలంటే ఆపసోపాలు పడుతున్నారు. అక్కడ రద్దీ ఎక్కువగా ఉండడంతో చికిత్స సక్రమంగా అందడం లేదని వాపోతున్నారు.

విజయవాడలో జీజీహెచ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడ మొత్తం వెయ్యి పడకలు ఉన్నాయి. సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌ ఏర్పాటు చేశారు. జిల్లా ఆసుపత్రి బందరులో ఉంది. విజయవాడ బోధనాసుపత్రి కావడంతో పీజీ విద్యార్థులు వైద్య సేవలు అందిస్తుంటారు. జీజీహెచ్‌లో సాధారణ పరిస్థితుల్లో ఓపీకి రోజుకు 2వేల నుంచి 2,500 మంది రోగులు వివిధ సమస్యలతో వస్తుంటారు. ఇన్‌పేషంట్లుగా సుమారు 600 మంది సగటున ఉంటారు. రోజుకు 15 మందికి పైగా డయాలసిస్‌ నిర్వహిస్తుంటారు. కొవిడ్‌ మొదటి దశలో ఇక్కడ ఉన్న రోగులను పక్కనే ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఓపీనీ అక్కడే నిర్వహించారు. కొవిడ్‌ రెండో దశ ప్రారంభానికి ముందు జిల్లా ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లుగా వివిధ విభాగాల్లో 600 మంది ఉండే వారు. వారిని క్రమేపీ డిశ్ఛార్జ్‌ చేశారు. కొందరికి నయమైంది. మరికొందరికి శస్త్ర చికిత్స వాయిదా వేశారు. ఇలా మొత్తం 500 మందిని పంపిచేశారు. 100 మంది మాత్రం కొంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండేవారు. వీరిని కూడా డిశ్ఛార్జ్‌ చేసి మొత్తం కరోనా రోగులకు కేటాయించారు. ఇన్‌పేషెంట్లను ఇళ్లకే పంపించారు. వాస్తవానికి వారికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆస్పత్రికి వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే వారికి నోఎంట్రీ పెట్టేశారు. వారు ఎక్కడికి వెళ్లాలనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు. వారికి మందులు ఇచ్చే అవకాశాలు లేవు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు క్రమం తప్పకుండా ప్రతి నెలా, లేదా రెండు నెలలకు ఒకసారి వస్తుంటారు. అలాంటి వారికి ప్రస్తుతం అవకాశం లేదు. కుక్కకాటు, పాముకాటు, విద్యుదాఘాతం, ఇతర సీరియస్‌ సమస్యలపై చికిత్స ఆశించి వచ్చే వారు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న దంత కళాశాలను సైతం ట్రైఏజ్‌ కేంద్రంగా మార్చారు. అక్కడ కొవిడ్‌ స్వల్ప లక్షణాలతో ఉన్న రోగులకు పరీక్షలు నిర్వహించి ఇంటి వద్ద చికిత్స పొందేందుకు కిట్లు ఉచితంగా అందజేస్తున్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఆ రోగులనే పరీక్షిస్తున్నారు.

ఈఎస్‌ఐ ఆస్పత్రికి రాగా... ఇక్కడ లేదు గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లమని చెబుతూ...

నెగెటివ్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే..!
సాధారణ వ్యాధులు సోకినవారికి, అత్యవసర చికిత్స తీసుకోవాల్సిన వారికి ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ప్రవేశం లభించడం లేదు. దాదాపు ప్రైవేటు ఆసుపత్రులు అన్నీ కొవిడ్‌ ఆస్పత్రులుగా మారాయి. 20 నుంచి 250 మంది పడకల వరకు ఆయా ఆసుపత్రుల సామర్థ్యాన్ని బట్టి ఏర్పాటు చేశారు. కొన్ని ఆసుపత్రులు లగ్జరీ లాడ్జీలను తీసుకొని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లుగా మార్చారు. సాధారణ రోగులు చికిత్సకు వెళ్లాలంటే ముందుగా కొవిడ్‌ వైరస్‌ సోకలేదని నిర్ధారించే నెగెటివ్‌ రిపోర్టు తీసుకొని వెళ్లాల్సి ఉంది. దీంతో సాధారణ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలాల్లో పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో రోగులను జీజీహెచ్‌కు రిఫర్‌ చేస్తున్నారు. జీజీహెచ్‌వారు మాత్రం గుంటూరు సర్వజన ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. గుంటూరులో ఒక విభాగంలో ఓపీ చూస్తున్నారు. అక్కడ కొవిడ్‌ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. సాధారణ రోగుల కోసం గతంలో మాదిరిగా ఈఎస్‌ఐ లేదా.. దంత కళాశాల విభాగాల్లో ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు. ప్రధానంగా కిడ్నీ, హృద్రోగ సమస్యలు ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని