Published : 09/05/2021 07:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరకుల పంపిణీలో జాప్యం!

ఈనాడు, అమరావతి

కరోనా, ఎండీయూ సహాయ నిరాకరణ, రేషన్‌ డీలర్ల సమస్యలు వెరసి ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం అందించే బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ సక్రమంగా సాగడం లేదు. ఈ నెలలో రెండు కోటాలు విడుదల కావడంతో మరింత జాప్యం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా సాయం కింద వ్యక్తికి 5 కేజీల బియ్యం ఉచితంగా అందించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సంచార వాహనాల యూనిట్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. చాలా మంది వాహనాలను తాము నడపలేమనే స్థితిలో వదిలేశారు. ఒక వాహనానికి మూడు రేషన్‌ దుకాణాలను అనుసంధానం చేశారు. వాహన డ్రైవర్‌, వాలంటీర్ల సహకారంతో పంపిణీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం వాహనాలు లేని ప్రాంతంలో వీఆర్వోలు లాగిన్‌ కావాల్సి ఉంది. వివిధ పనుల్లో ఉన్న వీఆర్వోలు రేషన్‌ విధులకు సక్రమంగా హాజరుకావడం లేదు. దీంతో పంపిణీ సవ్యంగా సాగడం లేదు. మరోవైపు ఈ నెల 10న సమ్మె చేయాలని రేషన్‌ డీలర్లు నిర్ణయించారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రేషన్‌ పంపిణీ జరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటోంది.

మొరాయించిన వాహనాలు..!
ఇంటింటికీ రేషన్‌ బియ్యం పథకం కింద ప్రభుత్వం ఎండీయూ(మొబైల్‌ పంపిణీ యూనిట్లు ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి నిరుద్యోగ యువతకు అందజేసిన వాహనాలు కొన్ని రోజులకే నిలిచిపోయాయి. తమకు గిట్టుబాటు కావడం లేదని చాలా మంది యువకులు వాటిని తిరిగి అప్పగించారు. బియ్యం మూటలు తాము మోయలేమని నిరాసక్తతను వ్యక్తం చేశారు. దీంతో వీరికి సహాయకులు వాలంటీర్లు ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నెలకు పారితోషికాన్ని రూ.21వేల నుంచి రూ.26 వేలకు పెంచింది. అయినా కొద్ది మంది హాజరవుతున్నారు. ఇంటింటికి కాకుండా వీధిలో ఒక ప్రాంతంలో వాహనం నిలిపి అక్కడే పంపిణీ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు మళ్లీ వరుసలో నిలబడి సరకులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఈపోస్‌ పనిచేయక సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం కరోనాతో మరిన్ని సమస్యలు పెరిగాయి. తొలి వారంలోనే పూర్తి చేయాల్సిన పంపిణీ ప్రస్తుతం 30 శాతం వరకే అయింది. పట్టణ ప్రాంతాలు విజయవాడ, మచిలీపట్నం, పురాల్లో కేవలం 20శాతం వరకే అయినట్లు తెలిసింది. లబ్ధిదారులు రేషన్‌ దుకాణాలకు వెళితే మీ ఇంటికే వస్తుందని చెబుతున్నారు. ఎండీయూ లేని ప్రాంతాల్లో రేషన్‌ డీలర్లకే అప్పగించి పంపిణీ చేయిస్తున్నారు. ఇక్కడ లాగిన్‌ వెసులుబాటు మాత్రం వీఆర్వోలకు ఇచ్చారు. దీంతో జాప్యం జరుగుతోంది. నిత్యావసరాల పంపిణీపై ప్రతి రోజూ సమీక్షిస్తున్నా పంపిణీ ముందుకు సాగడం లేదని అధికారులు చెబుతున్నారు. శనివారం నాటికి జిల్లాలో దాదాపు 13లక్షల రేషన్‌ కార్డులు ఉంటే 4.12లక్షల కార్డులకు మాత్రమే రేషన్‌ పంపిణీ అయింది. ఇంకా సుమారు 70 శాతం కావాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సరకులు ఒకేసారి ఇస్తున్నారు. జిల్లాలో దాదాపు 83,583 కార్డులు పోర్టబిలిటీ ఉన్నాయి. జిల్లాలో ఉన్న రేషన్‌ డీలర్ల సంఘాల్లో కొన్ని ఈనెల 10న బంద్‌కు పిలుపునిచ్చాయి. మరికొన్ని బంద్‌కు మద్దతు ప్రకటించలేదు.

జిల్లాలో మొత్తం రేషన్‌ కార్డులు 12,98,567

సంచార పంపిణీ యూనిట్లు (ఎండీయూ) 817

నిలిచిపోయిన ఎండీయూ: సుమారు 200

పంపిణీ చేసిన కార్డులు 4,12,583

రేషన్‌: 31%పూర్తి

దుకాణాలు 2,353

డీలర్లపై ఒత్తిడి తగదు..!
- కాగిత కొండ, రేషన్‌ డీలర్ల జిల్లా అధ్యక్షుడు

రేషన్‌ పంపిణీలో డీలర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కరోనా మొదటి దశలో సరకులు పంపిణీ చేసి డీలర్లు మరణించారు. వారికి సహాయం అందలేదు. వెంటనే సహాయం అందించాలని డిమాండ్‌ చేస్తున్నాం. ప్రస్తుతం డీలర్లను ఫ్రంట్‌ లైన్‌ వారియర్లుగా గుర్తించి టీకాలు ఇవ్వాలని కోరుతున్నాం. ఎండీయూలు మానేస్తే వారికి ఒకేసారి రూ.5వేలు పారితోషికం పెంచారు. తాము ఎప్పటి నుంచో కమిషన్‌ పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని కోరుతున్నాం.

పంపిణీ చేయిస్తున్నాం..!
-కె.మాధవీలత, జేసీ

ప్రజా పంపిణీలో కొన్ని సాంకేతిక సమస్యలు రావడం వల్ల జాప్యం జరుగుతోంది. ఎండీయూలు అన్నీ పని చేస్తున్నాయి. మానేసిన వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తున్నాం. ప్రభుత్వం పారితోషికం కూడా పెంచింది. వీఆర్వోలకు లాగిన్‌ సౌకర్యం కల్పించాం. కొన్ని దుకాణాల్లో సాంకేతికంగా సమస్య వచ్చింది. వాటిని పరిష్కరించి రెండు కోటాలు ప్రజలకు అందిస్తున్నాం. మరో నాలుగైదు రోజుల్లో మొత్తం అందజేస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని