Published : 09/05/2021 07:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిత్యావసర సరకులకు రెక్కలు

చల్లపల్లి గ్రామీణం, మోపిదేవి, న్యూస్‌టుడే

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసర సరకుల ధరలకు రెక్కలొచ్చాయి. వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ వినియోగదారుల్ని దోచుకుంటున్నారు. సరకుల ధరల పట్టికల్ని వ్యాపారులు దుకాణాల వద్ద ప్రదర్శించడం లేదు. దీంతో వారు చెప్పిన రేటుకే వస్తువుల్ని కొనుగోలు చేయక తప్పడం లేదు. ప్రస్తుతం కరోనా రెండో దశ తీవ్రంగా ఉంది. ఈ తరుణంలోనే శుభకార్యాలు వచ్చాయి. మరోవైపు కరోనాతో లేదా సహజ మరణాలు సంభవించినా కార్యక్రమాల తంతు ముగియాలంటే నిత్యావసర సరకులు ఎంతో అవసరం. పాక్షిక లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ్యాపార సమయాలను తగ్గించారు. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోననే భయంతో వినియోగదారులు ఎగబడి నెలకు సరిపడా సరకులను నిల్వ చేసుకునే యత్నంలో ఉన్నారు. ఇదే అదనుగా చేసుకొని వ్యాపారులు రోజుకో రకంగా ధరలు నిర్ణయిస్తున్నారు. దీంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.

గతేడాది కరోనా సమయంలో ఏర్పాటు చేసిన నిత్యావసరాల విక్రయ ధరల పట్టిక

నిత్యావసర సరకుల ధరలు అంతకంతకూ పెరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. అత్యధిక మంది దుకాణదారులు ధరల పట్టికల్ని పూర్తిగా తొలగించారు. రైతు బజారులో ధరల పట్టికను ప్రదర్శిస్తారు. అంతకుమించి విక్రయించడానికి వీల్లేదు. అదే తరహాలో బహిరంగ మార్కెట్‌లో ధరల పట్టిక ఎందుకు నిర్ణయించరని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ శాఖలు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కూడా దీనిపై దృష్టి సారించకపోవడం దారుణమని పలువురు ఆరోపిస్తున్నారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం ధరలు నిర్ణయించి కట్టుదిట్టంగా అమలు చేసింది. ప్రస్తుతం కరోనా రెండో దశ లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం ఈ ప్రక్రియను గాలికొదిలేయడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అదేమని ప్రశ్నిస్తుంటే సరకు సరఫరా లేదంటున్నారని వినియోగదారులు వాపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రతి దుకాణం వద్ద వ్యాపారులు ధరల పట్టికలు ప్రదర్శించి దాని ప్రకారమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ధరల పట్టిక ఏర్పాటు చేయాలి

దుకాణాల వద్ద పట్టికలు లేకపోవడంతో వినియోగదారులకు అసలు ధరలు తెలియడం లేదు. దీంతో వ్యాపారులు చెప్పిందే వేదమవుతోంది. గతంతో పోలిస్తే ధరలపై నియంత్రణ కొరవడింది. వినియోగదారులకు న్యాయం చేయాలి.

- ఎం.కామేశ్వరరావు, వినియోగదారుడు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని