Published : 09/05/2021 07:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పండని తమలపాకు రైతుల కష్టం

కొవిడ్‌ నేపథ్యంలో కొనుగోళ్లు లేని ఫలితం..

పొన్నూరు, న్యూస్‌టుడే


చింతలపూడి సమీపంలోని తమలపాకు తోటల్లో తీగ కడుతున్న కూలీలు

కరోనా వైరస్‌ అన్ని వర్గాల ప్రజల ఆదాయ వనరులనూ దెబ్బతీసింది. ప్రస్తుత నిషేధాజ్ఞల కారణంగా తమలపాకుల ఎగుమతులు సైతం పూర్తిగా స్తంభించిపోయాయి. కోతకు వచ్చి ఆకులేమో గుబురుగా పెరుగుతున్నాయి. కొనేవారు లేకపోవడంతో రైతులు నెలరోజుల వ్యవధిలోనే ఎకరానికి రూ.లక్ష మేర నష్టపోతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో తోటలు సాగులో ఉన్నాయి. ఒక్క పొన్నూరు మండలంలోని చింతలపూడి, ములుకుదురు, మాచవరం, గాయంవారిపాలెం, ఆరెమండ గ్రామాల్లోనే 600 ఎకరాల్లో తమలపాకును సాగుచేస్తున్నట్టు ఉద్యానశాఖ అధికార గణాంకాలు చెబుతున్నాయి. జిల్లా రైతులు తమలపాకులను మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, హైదరాబాద్‌లకు లారీల ద్వారా ఎగుమతి చేస్తున్నారు.

శుభకార్యాలు లేక.. విక్రయాలు జరగక

కరోనా వ్యాప్తి నేపథ్యంలో శుభకార్యాలపై ఆంక్షలు విధించారు. దీంతో తమలపాకుల వాడకం తక్కువైంది. కొనుగోళ్లూ నిలిచిపోయాయి. తోటలేమో ఎక్కువ భాగం కోతకు వచ్చాయి. గత నెలలో 100 పంతాల ధర రూ.3 వేల వరకూ పలికింది. ప్రస్తుతం ఎకరానికి 3 వేల పంతాలకు పైగా దిగుబడి సిద్ధంగా ఉంది. కొనుగోళ్లు లేకపోవడంతో ఎకరానికి సుమారు లక్ష రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారని అంచనా.

కోసి పారవేస్తున్నారు..

తమలపాకులను ప్రతి 20 నుంచి 25 రోజుల లోపు కూలీలతో కోయిస్తారు. అందుకుగాను ఎకరానికి 25 మంది కూలీలకు సుమారు రూ.12 వేల లోపు కూలీ చెల్లిస్తున్నారు. 25 రోజుల లోపు తమలపాకులను కోయకపోతే అవి బరువెక్కి, నేలకు ఒరుగుతాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఆకులను కోసి, పొలం బయట పారబోస్తున్నారు. వైరస్‌ సోకుతుందేమోననే భయంతో కొంతమంది కూలీలు పనులకు రావడానికి కూడా భయపడుతున్నారని కొందరు సాగుదారులు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని