కనికరమే లేదు..!
logo
Published : 12/05/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కనికరమే లేదు..!

వైరస్‌ బూచితో అంబులెన్స్‌కు రూ.వేలు వసూలు

ఈనాడు, అమరావతి

ఆగిరిపల్లి మండలం గొల్లనపల్లి గ్రామంలో కరోనా సోకిన ఓ వ్యక్తిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చేందుకు ప్రైవేటు అంబులెన్సు మాట్లాడారు. అంబులెన్సు యజమాని రూ.28వేలు ఛార్జీ వసూలు చేశారు. ప్రభుత్వ అధికారులు నిర్ణయించిన ధరల ప్రకారం రూ.3800 మాత్రమే వసూలు చేయాల్సి ఉంది. కానీ కరోనా రోగి ఇతర కారణాలు చెప్పి అధిక మొత్తం వసూలు చేశారు. గొల్లనపల్లి నుంచి జీజీహెచ్‌ వరకు 45 కి.మీ దూరం ఉంది. 41 కి.మీ నుంచి 60 కి.మీ దూరం ఉంటే రూ.3,800 వసూలు చేయాలని అధికారులు స్థిర ఛార్జీలు నిర్ణయించారు.
ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి నుంచి గుణదల శ్మశానవాటిక కిలోమీటరు దూరం ఉంటుంది. జీజీహెచ్‌ మార్చురీ గది నుంచి శ్మశాన వాటికకు మృతదేహాన్ని తరలించేందుకు రూ.5వేలు రవాణా కోసం వసూలు చేస్తున్నారు. దహన సంస్కారాలు, ఇతర కార్యక్రమాలకు దళారీ రూ.20వేల వరకు వసూలు చేస్తున్నారు. జీజీహెచ్‌ నుంచి కృష్ణలంక స్వర్గపురి సుమారు 10 కి.మీ దూరం ఉంటుంది. ఇక్కడకు మృతదేహాన్ని తరలించడానికి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు సమయాన్ని బట్టి వసూలు చేస్తున్నారు.
కరోనా రోగులను తరలించేందుకు, మృతదేహాలను మహాప్రస్థానానికి రవాణా చేసేందుకు అంబులెన్సుల పేరుతో వాహనాలు భారీగా వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఎక్కడా అమలు కావడం లేదు. జీజీహెచ్‌ వద్ద ప్రైవేటు అంబులెన్సుల యజమానులు సిండికేట్‌గా మారి సీరియల్‌ ప్రకారం రవాణా చేస్తున్నారు. జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి ఆస్పత్రికి కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తులను తీసుకొచ్చేందుకు కనీసం మానవత్వాన్ని మరిచి వసూలు చేస్తున్నారు. రూ.వేలల్లో రుసుములు చెల్లించలేక జీజీహెచ్‌కు వస్తున్న పేద రోగులపై కూడా కనికరం చూపడం లేదు. ఆ రోజంతా ఖాళీగా ఉన్నా సరే ఒక్క బేరం తగిలితే చాలు అన్నట్లు అంబులెన్సులు వ్యవహరిస్తున్నాయి. నెలకు నాలుగైదు బేరాలు తగిలినా చాలా వరకు గిట్టుబాటు అవుతుందన్న ధోరణిలో ఉన్నారు. ఎవరైనా అంబులెన్స్‌ డ్రైవర్‌ మానవత్వం ప్రదర్శించి తక్కువ ధరకు తీసుకెళ్తే అతనికి ఇతర సిండికేట్‌ గ్యాంగ్‌ నుంచి వేధింపుల ముప్పు ఉన్నట్లే. ఓ వ్యక్తి లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. అంబులెన్సులకు మృతదేహాలను ఆయన సర్దుబాటు చేస్తారు. దీనికి ఆయన కొంత కమీషన్‌ తీసుకుంటారు. పక్కనే ఉన్న శ్మశానవాటికకు రూ.వేలల్లో వసూలు చేయడం దారుణమని అధికారులు సైతం వాపోతున్నారు. కేవలం మనోభావాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. జీజీహెచ్‌లో రోజుకు దాదాపు 50 మృతదేహాలు బయటకు వస్తున్నాయి. ఇతర జిల్లాల వారు ఉంటున్నారు. తమ సొంత గ్రామాలకు తీసుకెళ్లకుండా ఇక్కడే అంతిమయాత్ర పూర్తి చేస్తున్నారు. అధికారులు ఒకవైపు మరణించిన వారందరూ కొవిడ్‌తో కాదని, ఇతర వ్యాధుల వల్ల కూడా చనిపోతున్నారని చెబుతున్నారు. జీజీహెచ్‌ రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రి కావడంతో అక్కడ జరిగిన ప్రతి మరణాన్ని కొవిడ్‌ ఖాతాలోనే వేస్తున్నారు. కనీసం అడ్మిషన్‌ లభించక మెట్లమీదే ప్రాణాలు వదిలిన ఘటనలు ఉన్నాయి. సగటున 50 మృతదేహాలకు స్వర్గపురి, గుణదల, కృష్ణలంకలోని గ్యాస్‌ ఆధారిత శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న శ్మశాన వాటికను నగరపాలక సంస్థ తమ ఆధీనంలోకి తీసుకుని ఉచిత దహనాలు చేస్తోంది. ఒక్క శ్మశానవాటికలో 20కి తక్కువ కాకుండా దహనాలు చేస్తున్నారు. ఖననాలు సరే సరి. అవి ఇతర శ్మశానవాటికల్లో చేస్తున్నారు. కేవలం అంబులెన్సుల పేరుతో మృతదేహానికి రూ.5వేల నుంచి రూ.10వేలు వసూలు చేస్తున్నారు. దహన సంస్కారాలకు వసూలు వేరే. తీవ్ర శోకంలో ఉన్న కుటుంబ సభ్యుల నుంచి కనీసం కనికరం చూపడం లేదు. తాము అంత ఇచ్చుకోలేమన్నా వినిపించుకోని పరిస్థితి.

ఈ ధరలను డ్రైవర్‌ బేటా, ఇంధనం అన్నీ కలిపి స్థిర చార్జీలుగా నిర్ణయించారు. ఇవి ఎక్కడా అమలు కావడం లేదు. వీటిని అమలు చేయాలని ప్రైవేటు ఆస్పత్రులకు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌కు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజులు గడుస్తున్నా అమలు జరిగిన దాఖలాలు లేవు. ఒకవైపు రోగి బంధువుల్లో ఆత్రుత, ఆందోళనను  అంబులెన్సుల డ్రైవర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇక ఆక్సిజన్‌, ఇతర సౌకర్యం ఉన్న అంబులెన్సులకు ధరలు చుక్కలను అంటుతున్నాయి. అంబులెన్సుల్లో కరోనా పాజిటివ్‌ రోగిని తీసుకొచ్చిన తర్వాత జీజీహెచ్‌లో దించి వేస్తున్నారు. అక్కడ పడక లభించకపోతే.. ఇతర ఆసుపత్రికి వెళ్లాలంటే.. తిరిగి అక్కడ సిండికేట్‌ను సంప్రదించాలి. మరో అంబులెన్సులో తీసుకెళ్లాల్సి ఉంటుంది.

డ్రైవర్ల ఆగడాలతో నిర్ణయం
అంబులెన్సు డ్రైవర్ల ఆగడాలు అధికారుల దృష్టికి వెళ్లడంతో గరిష్ఠ రుసుములు నిర్ణయించారు. మొదట కొవిడ్‌, నాన్‌కోవిడ్‌ అని రెండు రకాలుగా ధరలు, డ్రైవర్‌ బేటా అంటూ అదనంగా పట్టిక రూపొందించారు. దీనిపై విమర్శలు రావడంతో తిరిగి ఒకే స్థిర ధరలను నిర్ణయించారు. వాటిని అమలు చేయాలని జిల్లా పోలీసు యంత్రాంగం అంబులెన్స్‌ డ్రైవర్లకు, యజమానులకు అవగాహన కల్పించారు. అయినా అదే తీరు. ఇలాంటి సమయాల్లోనే తమకు డిమాండ్‌ ఉంటుందన్న వాదన తెస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు యజమానులు ముందుకు రావడం లేదు.
ప్రత్యామ్నాయం..!
మృతదేహాలను శ్మశానవాటికలకు తరలించేందుకు ప్రభుత్వ అంబులెన్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక్క అంబులెన్సులో రెండు మూడు మృతదేహాలను ఒకేసారి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇలా ఏర్పాటు చేస్తే జీజీహెచ్‌ వద్ద ప్రైవేటు సిండికేట్‌ను నియంత్రించే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని