విపత్తు వేళ.. విశేష సేవ
logo
Published : 12/05/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విపత్తు వేళ.. విశేష సేవ

కరోనా క్లిష్ట  సమయంలో విధులు
నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే

కరోనా విజృంభిస్తున్న వేళ వారి ఉద్యోగం కత్తి మీద సాము వంటిది. ప్రస్తుత ఆరోగ్య విపత్తే కాదు ఇలాంటివి వారు ఎన్నో చూశారు. అనారోగ్యానికి గురైన వారికి మానవతతో వారు సాంత్వన చేకూర్చుతున్నారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో వారి సేవలు ఆదర్శనీయం. ఆరోగ్యంపై బెంగ వద్దు.. మీకు అండగా మేమున్నామంటూ  వారు నింపుతున్న మనోధైర్యం బాధితులను సాంత్వన చేకూరుస్తోంది. కరోనా రోగులకు సేవలందించే క్రమంలో వారు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వస్తోంది. నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారి ఆదర్శ సేవలపై ‘న్యూస్‌టుడే’ కథనం  

జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో సుమారు మూడు వేల మంది నర్సులు పని చేస్తున్నారు. ప్రైవేట్‌ రంగంలో మరో మూడు వేల మంది సేవలు అందిస్తున్నారు. గుంటూరు సర్వజనాసుపత్రితో పాటు తెనాలి జిల్లా ఆసుపత్రి, ప్రాంతీయ, సామాజిక వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వారి సేవలు కీలకం. కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లోనూ బాధితులకు సేవలందిస్తున్నారు.

జాగ్రత్తలు తీసుకుంటూ విధులు

- వీకేఎన్‌ జయలక్ష్మి, విజయవాడ పాతాసుపత్రి  
30 సంవత్సరాలుగా నర్సింగ్‌ వృత్తిలో ఉన్నాను. ప్రస్తుతం ఎంపీహెచ్‌ఎస్‌ఎఫ్‌గా విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొవిడ్‌ బారిన పడిన గర్భిణులకు సేవలందిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబానికి కూడా దూరంగా ఉంటున్నాను.  వారానికి ఒకసారి మాత్రమే అన్ని జాగ్రత్తలు తీసుకని వారిని కలుస్తున్నాను. కొవిడ్‌ బారిన పడిన రోగులకు చికిత్స కంటే ధైర్యమే ఎక్కువగా అవసరం. వారు కోలుకుని ఇంటికెళితే ఎంతో సంతోషంగా ఉంటుంది.

కఠిన పరిస్థితులెదురైనా..

- ఎన్‌.హేమకల్యాణి, స్టాఫ్‌ నర్సు, విజయవాడ
నేను 36 సంవత్సరాల నుంచి నర్సుగా సేవలందిస్తున్నాను. ప్రస్తుతం విజయవాడ కొత్తాసుపత్రి, పాతాసుపత్రిలకు స్టాఫ్‌ నర్సుగా విధులు నిర్వహిస్తున్నాను. 2002లో రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో ఖైదీలకు సేవ చేశాను. ఎంతటి కఠినమైన వారికైనా సేవ చేయాలనేది నర్సుల అభిమతం. విజయవాడ పాతప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొద్దిమందికి మాత్రం కొవిడ్‌ సోకుతుంది. అలాంటి వారికి ధైర్యం చెప్పి కాన్పు చేస్తున్నాం. జిల్లాలోని పలు స్వచ్ఛందసేవా సంస్థల్లో పనిచేస్తున్నాను. ప్రతి రెండు నెలలకు గర్భిణులకు వారు తీసుకోవాల్సిన ఆహర అలవాట్లు తదితర వాటిపై అవగాహన కల్పిస్తున్నాను. అందరూ కరోనా విషయంలో భయపడుతున్నారు. ఆందోళన వీడి జాగ్రత్తలు పాటిస్తే సునాయాసంగా వైరస్‌ను జయించవచ్చు.

ఆ వ్యాఖ్యలు బాధిస్తున్నాయ్‌

- పి.అరుణ, స్టాఫ్‌ నర్స్‌,  విజయవాడ జీజీహెచ్‌
16 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్నాను. పలు స్వచ్ఛంద సేవా సంస్థల్లో పని చేశాను. ప్రస్తుత సమయంలో ప్రాణాలకు తెగించి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. కొంత మంది విధులు సరిగ్గా నిర్వహించడం లేదంటూ విమర్శలు మా మనస్సును బాధిస్తున్నాయి. ప్రభుత్వం మాకు తోడ్పాటునందిస్తే, సమాజం నుంచి సహయం ఉంటే మరింత ఉత్సాహంతో విధులు నిర్వహిస్తాం.

వారి ఆరోగ్యమే మాకు ఆనందం

- కౌతరపు రాజేశ్వరీ, హెడ్‌ నర్సు, విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రి
గతంలో స్టాఫ్‌ నర్సుగా చేశాను. 35 సంవత్సరాల నుంచి సర్వీసులో ఉన్నాను. కరోనా కాలాన్ని ఒక  ఛాలెంజ్‌గా తీసుకున్నాం. ప్రస్తుత  పరిస్థితులు బాగాలేదు. మేము విధులకు వస్తుంటే మా కుటుంబ సభ్యులు ఎంతో భయపడుతున్నారు. మాలో చాలా మందికి కొవిడ్‌ సోకింది. అయినా మా వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తున్నాం. రోగి ప్రాణాన్ని కాపాడటంతో పాటు కోలుకుని వెళ్తే మొదట   సంతోషించేది మేమే. వారి ఆరోగ్యమే మాకు ఆనందం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని