ఆక్సిజన్‌ సరఫరా, కొవిడ్‌ సేవలకు 26 బృందాలు
logo
Published : 12/05/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆక్సిజన్‌ సరఫరా, కొవిడ్‌ సేవలకు 26 బృందాలు

వీసీలో పాల్గొన్న కలెక్టరు ఇంతియాజ్‌, జిల్లా అధికారులు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో ఆక్సిజన్‌ సరఫరా పరిశీలనకు, ఇతర కొవిడ్‌ అనుబంధ సేవలు, పనుల పర్యవేక్షణకు 26 బృందాల ఏర్పాటు, నోడల్‌ అధికారులను నియమించినట్టు కలెక్టరు ఇంతియాజ్‌ తెలిపారు. సేవల పనితీరును జాయింటు కలెక్టర్లు పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు 104 కాల్‌ సెంటరు ఒన్‌ స్టాఫ్‌ సొల్యూషన్‌ సేవా కేంద్రంగా సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్సు (వీసీ) నిర్వహించి కొవిడ్‌, ఉపాధి హామీ పనులు, స్పందన, వై.ఎస్‌.ఆర్‌. జలకళ, అర్బన్‌ క్లినిక్స్‌, ఇళ్ల స్థలాలు, రానున్న ఖరీఫ్‌ ముందస్తు కార్యాచరణపై కలెక్టర్లతో సమీక్షించారు. నగరంలోని   విడిది కార్యాలయం నుంచి ఇంతియాజ్‌ హాజరై జిల్లాలోని పరిస్థితులను వివరించారు. వైరస్‌ తీవ్రత ఎక్కువగా లేని వారిని, స్వల్ప లక్షణాలు కన్పించిన వారిని కొవిడ్‌ కేర్‌ కేంద్రాల ద్వారా వైద్యుల పర్యవేక్షణతో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అన్ని ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సీఎంకు వివరించారు.
అర్హులకు టిడ్కో ఇళ్లు..
జిల్లాలో జలకళ పథకానికి 3,849 మంది దరఖాస్తు చేయగా, 2,638 దరఖాస్తులను ఆమోదించినట్టు కలెక్టరు తెలిపారు. వీటి పనుల నిర్వహణకు భూగర్భ జల శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వేచేస్తున్నారు. ఈక్రమంలో 868 పనులకు మంజూరు ఉత్తర్వులు ఇచ్చినట్టు వెల్లడించారు. జిల్లాలో అర్హులైన వారిలో 2,76,141 మందికి ఇళ్ల పట్టాలు, 26,853 మందికి టిడ్కో గృహాలు కేటాయించినట్టు తెలిపారు. 1,503 కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పనులను చేపట్టనుండగా, ఇప్పటి వరకు 1,495 కాలనీల్లో పనులు పురోగతిలో ఉన్నట్టు వివరించారు. స్పందన ఫిర్యాదుల పరిష్కారం విషయంలో ఆరోగ్యశ్రీ కార్డులు, పింఛను కానుక, బియ్యం కార్డులు, ఇళ్ల స్థలాలతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీరు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
17 నుంచి విత్తనాలు, ఎరువుల పంపిణీ
రానున్న ఖరీఫ్‌ సీజనులో ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈనెల 17వ తేదీ నుంచి విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహార మందులను రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ద్వారా పంపిణీ చేయనున్నట్టు కలెక్టరు ఇంతియాజ్‌ తెలిపారు. మార్కెటింగు సౌలభ్యం కలిగిన పంటలను గుర్తించి వీటిపై రైతులకు అవగాహన కల్పించేందుకు సూచనలు చేయనున్నట్టు చెప్పారు. ఈనెల 18న మత్స్య కార భరోసా ద్వారా రూ.10 వేల చేయూతను అందిస్తామని, 25న ఖరీఫ్‌ పంటల బీమా మొత్తాన్ని రైతుల ఖాతాలకు జమ చేయనున్నట్టు తెలిపారు. వీసీలో ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, జేసీలు కె.మాధవీలత, మోహన్‌కుమార్‌, వీఎంసీ కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్‌, శిక్షణ కలెక్టరు ఎస్‌.ఎస్‌.శోభిక తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని