4 ఆస్పత్రుల్లో పీఎస్‌ఏ ప్లాంట్లు
logo
Published : 12/05/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

4 ఆస్పత్రుల్లో పీఎస్‌ఏ ప్లాంట్లు

గాలి నుంచి ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసుకునే అవకాశం

ఈనాడు-అమరావతి: జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆక్సిజన్‌ను సొంతంగానే ఎక్కడికక్కడ ఆస్పత్రుల్లో ఉత్పత్తి చేసుకోవడానికి వీలుగా అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలతో పాటు జ్వరాల ఆస్పత్రి, తెనాలి జిల్లా ఆస్పత్రి, నరసరావుపేట ఏరియా ఆస్పత్రిలో మాత్రమే లిక్విడ్‌ రూపంలో తీసుకొచ్చిన ఆక్సిజన్‌ను ట్యాంకుల్లో నిల్వ చేసుకుని వార్డులకు పైపుల ద్వారా అందించే ఏర్పాట్లు ఉన్నాయి. ప్రస్తుతం వీటికి విశాఖ నుంచి లిక్విడ్‌ ఆక్సిజన్‌ వస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో గతేడాది నుంచి ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పడకలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. దాన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం గతంలోనే రాష్ట్రంలోని గుంటూరు బోధనాస్పత్రి సహా ఐదు ఆస్పత్రుల్లో గాలి నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసుకునే ప్లాంట్లను మంజూరు చేసింది. వీటిని ప్రెజర్‌ స్వింగ్‌ అడాప్షన్‌(పీఎస్‌ఏ) ప్లాంట్లు అంటారు. ప్రస్తుతం జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో కూడా వాటి ఏర్పాటుకు అనుమతిచ్చింది. ఇందులో భాగంగా జిల్లాలో గుంటూరు జ్వరాల ఆస్పత్రి, తెనాలి జిల్లా ఆస్పత్రి, నరసరావుపేట, బాపట్ల ఏరియా ఆస్పత్రులు ఎంపికయ్యాయి. వీటిల్లో నిమిషానికి వెయ్యి, 1500 లీటర్ల ఆక్సిజన్‌ సామర్థ్యం ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం ఆయా ఆస్పత్రుల్లోని ట్యాంకుల్లో ఉన్న లిక్విడ్‌ అడుగంటే లోపు తిరిగి నిల్వలు వస్తాయో రావోనన్న ఆందోళన ఆస్పత్రి అధికారులు, ఆక్సిజన్‌ సరఫరా చేసే గుత్తేదారులను వెంటాడుతోంది. పీఎస్‌ఏ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే ఆక్సిజన్‌ను గాలి నుంచి ఉత్పత్తి చేసుకుని నేరుగా దాన్ని వార్డుల్లోని పడకలకు సరఫరా చేయొచ్చు. ఇందుకు సంబంధించిన ప్లాంట్ల పరికరాలను కేంద్రం సరఫరా చేస్తుందని, వాటిని బిగించుకుని ఉత్పత్తి చేసుకోవచ్చని ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లా నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. 24 గంటల పాటు ఈ ప్లాంట్లు పనిచేస్తే రోజుకు 200 సిలిండర్లకు సరిపడా ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుందని ఏపీఎంఎస్‌ఐడీసీ వర్గాలు తెలిపాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని