కాటేసిన కరోనా
logo
Published : 12/05/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాటేసిన కరోనా

అరగంట వ్యవధిలో సతీపతుల మృతి

రామకోటేశ్వరశర్మ, స్వరాజ్యలక్ష్మి దంపతులు (పాత చిత్రం)

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: కరోనాతో చికిత్సపొందుతూ గుంటూరు జిల్లా తెనాలికి   చెందిన నెమలికంటి రామకోటేశ్వరశర్మ(89), స్వరాజ్యలక్ష్మి(85) దంపతులు కేవలం అరగంట వ్యవధిలోనే కన్నుమూశారు. ఇటీవల కొవిడ్‌ సోకడంతో భార్య తెనాలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో, భర్త ఓ ప్రైవేటు వైద్యశాలలో చేరి కరోనా చికిత్స పొందుతున్నారు. సోమవారం రాత్రి 10 గంటలకు భార్య, 10.30కు భర్త తుదిశ్వాస విడిచారు. ఆయన ప్రభుత్వ వైద్యవిభాగంలో సూపర్‌వైజర్‌గా పనిచేసి ఉద్యోగవిరమణ చేశారు. బ్రాహ్మణ పరిషత్తు తెనాలిశాఖ గౌరవాధ్యక్షునిగా వ్యవహరించారు. వీరి మృతికి పరిషత్‌ అధ్యక్షుడు పరాశరం వెంకటరామగోపాల్‌, ప్రధాన కార్యదర్శి పోతావఝల పురుషోత్తమశర్మ సంతాపం తెలిపారు.

12 రోజుల తేడాతో భార్యాభర్తలు ..

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగి కుటుంబాన్ని కరోనా కాటేసింది. 12 రోజుల వ్యవధిలో దంపతులు మృతి చెందడంతో విషాదం అలముకుంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తహసీల్దారు కార్యాలయంలో చైన్‌మెన్‌గా పని చేస్తున్న గంజిమాల చిత్తరంజన్‌ (50), ఆయన భార్య కుమారి (45) గత నెలాఖరులో కరోనా బారిన పడ్డారు. ఆమె గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో, ఆయన ఒంగోలు జీజీహెచ్‌లో చేరారు. చికిత్స పొందుతూ గత నెల 29న కుమారి మృతి చెందారు. ఈ విషయం తెలిస్తే చిత్తరంజన్‌ ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని కుటుంబ సభ్యులు ఆయనకు చెప్పకుండా ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. వైరస్‌తో పోరాడుతూ ఆయన సోమవారం రాత్రి మృతి చెందారు. ఈ దంపతులకు బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదివే కుమారుడు, ఇంటర్మీడియట్‌ పూర్తయిన కుమార్తె ఉన్నారు. వారి స్వగ్రామమైన సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో స్థానిక యువత పీపీఈ కిట్లతో మంగళవారం చిత్తరంజన్‌ అంత్యక్రియలు నిర్వహించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని