Published : 12/05/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్ముదామన్నా అడిగే వారేరి?

మందకొడిగా సాగుతున్న మినుముల కొనుగోళ్లు
పొన్నూరు, న్యూస్‌టుడే

ఓ రైతు గోదాములో నిల్వ చేసిన మినుము బస్తాలు

కరోనా వైరస్‌ అన్ని వర్గాల ప్రజలను ప్రశాంతతకు దూరం చేసింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామన్నా అడిగే నాథుడే లేకపోవడంతో రైతులు అనేక ఆర్థిక   ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగు కోసం ఎక్కువమంది అప్పులు తెచ్చి పెట్టుపడులు పెట్టారు. వాటికి వడ్డీలు పెరుగుతున్నాయి. వైరస్‌ భయంతో వ్యాపారులు మినుములు కొనుగోలు చేయడానికి వెనకాడుతున్నారు. ఇతర ఇబ్బందులూ తలెత్తడంతో వీటి కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుని మినుముల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.
జిల్లాలో రబీలో గత ఏడాది 76,713, ఈ ఏడాది 73,915 హెక్టార్లలో మినుము పంటను సాగుచేసినట్టు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది 2798 హెక్టార్లలో మినుము పంట తక్కువగా సాగైంది. గతంలో జిల్లాలో అత్యధికంగా ఈ పంటను రైతులు సాగు చేయడానికి మొగ్గు చూపారు. కాలక్రమేణా పైరును తెగుళ్లు ఆశించడం పెరిగింది. వీటి నివారణకు వేలాది రూపాయలు ఖర్చుచేసి, పురుగులమందులు పిచికారీ చేసినా   ఆశించిన ఫలితం మాత్రం కనిపించలేదు. ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దిగుబడులు   ఆశించిన మేర రావడం లేదు. దీంతో రైతులు నేడు మొక్కజొన్న, తెల్లజొన్న, పెసర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులోనూ కొనసాగితే మినుము పంట కనుమరుగయ్యే అవకాశాలున్నాయని సాగుదారులు చెబుతున్నారు.
ఈ ఏడాది అధికంగా వర్షాలు కురవడంతో సకాలంలో మినుము పంటను సాగు చేయలేకపోయారు. సమయం గడిచిన తర్వాత విత్తనాలు చల్లారు. దీంతో అవి సరిగా మొలకెత్తలేదు. ఆనక పైరుకు తెగుళ్లు ఆశించాయి. ఒక్కో రైతు ఐదు, ఆరుసార్లు పురుగుల మందులను పిచికారీ చేశారు. డబ్బులు ఖర్చు అయ్యాయే తప్ప తెగుళ్లు, పురుగులను మాత్రం నివారించలేకపోయారు. ఎకరానికి రూ.20 వేల వరకూ ఖర్చు పెట్టినా సరాసరిన 2 నుంచి 4 క్వింటాళ్ల వరకే దిగుబడులు వచ్చాయి.
గతంలో క్వింటా మినుములు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ధర పలికాయి. అయితే ఈ ఏడాది రూ.7 వేల ధర మాత్రమే పలుకుతున్నాయి. పైరుపై పెట్టిన ఖర్చులు పెరిగిపోవడంతో వ్యాపారులు చెల్లిస్తున్న ధర ఎంతమాత్రం గిట్టుబాటు కావడంలేదని   రైతులు వాపోతున్నారు. కరోనా ప్రభావం మినుముల కొనుగోళ్ల ప్రక్రియపై పడింది. లావాదేవీలు నిర్వహించే ప్రక్రియలో కొన్ని ఆర్థిక  ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఆలోచనతోనే వ్యాపారులు మినుములు కొనుగోలు చేయడానికి అంతగా మొగ్గుచూపడం లేదు.
మినుముల కొనుగోలుకు జిల్లాలో పొన్నూరు ప్రధాన కేంద్రంగా ఉంది. గతంలో ఈ సీజన్‌లో ఈ పట్టణం లారీలు, ట్రాక్టర్లు, రైతులు, వ్యాపారులతో కోలాహలంగా ఉండేది. నేడు కరోనా భయంతో బోసిపోయి కన్పిస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులను ఆదుకోవాల్సి ఉంది.

గిట్టుబాటు కావడం లేదు

- నన్నపనేని శివరామకృష్ణ, రైతు, నిడుబ్రోలు
మినుము పైరుకు ఎప్పటికప్పుడు ఖర్చులు పెరుగుతున్నాయి. దిగుబడులు ఆశించిన మేర రావడం లేదు.  రైతుకు గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం రాయితీపై పురుగుల మందులు పంపిణీ చేసి ఆదుకోవాలి. సాగు ఖర్చులు కూడా రాకపోవడంతో మరో పంట వైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

- పూల సుబ్రమణ్యం, కౌలు రైతు, కసుకర్రు
ప్రస్తుతం రైతుల వద్ద మినుము నిల్వలు పేరుకుపోయాయి. వీటికి పురుగులు పడుతున్నాయి.  అప్పటికీ మేము ఆరబెట్టి నిల్వ చేస్తున్నాం. బయట మార్కెట్‌లో సరకు కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాకు రూ.10 వేల ధర చెల్లించేలా   చర్యలు చేపట్టాలి.  


ఆదేశాలు రాలేదు..

- రమేష్‌బాబు, మార్క్‌ఫెడ్‌ డీఎం
మినుముల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయమని ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి మార్గదర్శకాలూ అందలేదు. ఆదేశాలు వస్తే వెంటనే కొనుగోలు కేంద్రాలను  ప్రారంభించి, కొనుగోళ్లకు శ్రీకారం చుడతాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని