రయ్..రయ్
Published : 16/05/2021 05:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రయ్..రయ్

16వ జాతీయ రహదారి పనులు కొలిక్కి

 ఎక్స్‌ప్రెస్‌ మార్గంలో రాకపోకలు షురూ

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే


ఆరు వరసల రహదారిపై రాకపోకలు

16వ జాతీయ రహదారి విస్తరణ పనులు దాదాపుగా కొలిక్కి వచ్చాయి. గతేడాది మొదటి దశ కరోనా ప్రభావం, భారీ వర్షాలు కారణంగా పనుల వేగం మందగించినా, ఎన్‌హెచ్‌ఏఐ, గుత్త సంస్థ లక్ష్మీ ఇన్‌ఫ్రాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఈ ఏడాది ఆరంభం నుంచి కార్యాచరణ వేగవంతమైంది. మొత్తంగా హనుమాన్‌జంక్షన్‌ బైపాస్‌ మినహా, కలపర్రు నుంచి చిన్నఆవుటపల్లి వరకు ఎక్స్‌ప్రెస్‌ మార్గం అందుబాటులోకి వచ్చింది. దీంతో గత కొన్ని రోజులుగా వాహనాలన్నీ నేరుగా, జోరుగా ఈ రహదారిపై పరుగులు పెడుతున్నాయి.

తాజా పరిస్థితి

విస్తరణ పనులన్నీ ముగింపు దశకు చేరుకున్నాయి. కల్వర్టులు, అండర్‌ పాస్‌లు, సర్వీసు రహదారి నిర్మాణాలు ఎప్పుడోనే పూర్తయ్యాయి. ఎక్స్‌ప్రెస్‌ హైవేగా తీర్చిదిద్దేందుకు గతంలో ఉన్న నాలుగు వరసల రహదారిని, ఆరు వరసలుగా నిర్మించే కార్యాచరణ కూడా పూర్తయిపోయింది. ఎక్స్‌ప్రెస్‌ మార్గానికి, సర్వీసు రహదారికి సంబంధం లేకుండా నిర్మాణాలు, నిర్దేశిత ప్రణాళికకు అనుగుణంగా ఎంపిక చేసిన గ్రామాల వద్ద అనుసంధానం చేసే పనులు జరుగుతున్నాయి. రహదారిపై మార్కింగ్‌లు, సైన్‌ బోర్డుల ఏర్పాటు కూడా మొదలయ్యాయి. వీటితో పాటు బస్‌ షెల్టర్లు, శౌచాలయాల నిర్మాణం మాత్రం పూర్తి కావాల్సి ఉంది.

బైపాస్‌ పనుల్లో వేగం

భూ సేకరణ సమస్య పరిష్కారం కావడంతో 16వ జాతీయ రహదారిలో అంతర్భాంగా నిర్మిస్తున్న హనుమాన్‌జంక్షన్‌ బైపాస్‌ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మొత్తం 6.72 కి.మీ. మేర బైపాస్‌ వ్యాపించి ఉండగా, భూ వివాదం కారణంగా ఒక కి.మీ. మేర మాత్రమే పనులు జరగలేదు. కలెక్టర్‌, ఇతర అధికారుల జోక్యంతో భూ వివాదం పరిష్కారమై, గత మూడు నెలలుగా ఒక కి.మీ. పనులతో పాటు, మొత్తం బైపాస్‌ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. రెండు నెలల లోపుగానే బైపాస్‌ మార్గం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.


రెండు నెలల్లో పూర్తి

- రవికాంత్‌, పీఎం, లక్ష్మీ ఇన్‌ఫ్రా

ఎక్స్‌ప్రెస్‌ మార్గం పనులు దాదాపుగా పూర్తయినట్లే. బైపాస్‌తో కలిపి ఇంకా 10 శాతం మేర మాత్రమే జరగాల్సి ఉంది. మరో రెండు నెలల్లో వీటిని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. కొవిడ్‌ రెండో దశ వలన కొంతమేర పనుల్లో వేగం తగ్గింది. వీలైనంత త్వరగానే మొత్తం 27.4 కి.మీ. మార్గాన్ని అందుబాటులోకి తెస్తాం.


దూసుకుపోతున్నాయి..

కలపర్రు నుంచి చిన్నఆవుపటల్లి వరకు విస్తరణ పనులు ఇప్పటికే పూర్తవడంతో ట్రాఫిక్‌ రద్దీ నుంచి వాహనదార్లకు ఉపశమనం లభించింది. ఏడాది పైగా కేవలం ఇరువైపులా ఉన్న సర్వీసు రహదారులపై మాత్రమే రాకపోకలు సాగించిన వాహనదార్లు, ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌ మార్గంలో దూసుకుపోతున్నారు. 16వ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వారు ఇటు చిన్నఆవుటపల్లి నుంచి అటు కలపర్రు టోల్‌గేట్‌ వరకు, అటు కలపర్రు టోల్‌గేట్‌ నుంచి, ఇటు చిన్నఆవుటపల్లి వరకు రయ్‌ రయ్‌ మంటూ జోరుగా ముందుకు వెళ్లిపోతున్నారు. ఈ మార్గం అందుబాటులోకి రావడం వలన సమయం, ఇంధనం చాలా ఆదా అవుతుందని వాహనదార్లు చెబుతున్నారు


పనుల తీరు ఇలా..

● చిన్నఆవుటపల్లి నుంచి కలపర్రు వరకు నాలుగు వరసలుగా ఉన్న జాతీయ రహదారిని ఆరు వరసలుగా విస్తరించడం

● పథకం: భారతమాల యోజన

● మొత్తం దూరం: 27.4

● అంచనా వ్యయం: రూ.513 కోట్లు

● నిర్మాణ సంస్థ: లక్ష్మీ ఇన్‌ఫ్రాTags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని