AP News: కారణం చూపాలంటే..కాసులివ్వాలిసేందే
eenadu telugu news
Updated : 05/06/2021 08:37 IST

AP News: కారణం చూపాలంటే..కాసులివ్వాలిసేందే

మరణ ధ్రువపత్రాల కోసం తంటాలు

ఈనాడు, అమరావతి న్యూస్‌టుడే, విజయవాడ వైద్యం

విజయవాడ నగరం ఆంజనేయస్వామి వాగు ప్రాంతానికి చెందిన వెంకట్రావు(65) అనే వ్యక్తికి కొవిడ్‌ సోకడంతో జీజీహెచ్‌లో మరణించారు. చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 24న మృతిచెందారు. ఆయన మరణ ధ్రువపత్రాన్ని జీజీహెచ్‌ అధికారులు మే 18న జారీ చేశారు. దీనిలో ఆ వ్యక్తి జీజీహెచ్‌లో చనిపోయారని ఉంది. ఆ పత్రంతో బీమా కోసం దరఖాస్తు చేస్తే.. తిరస్కరించారు. ఏ కారణం వల్ల చనిపోయారో స్పష్టంగా ఉండాలని బీమా సంస్థ అధికారులు పేర్కొన్నారు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు మళ్లీ జీజీహెచ్‌కు వచ్చి అడిగితే, మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇదే సమయంలో దళారులు రంగంలోకి దిగుతున్నారు. మీరు మరణ ధ్రువీకరణ పత్రంలో కారణం(కాజ్‌ ఆఫ్‌ డెత్‌) కావాలని అడుగుతున్నారు కదా..! దీనికి రూ.10 వేలు ఖర్చు అవుతాయి.. నేను ఇప్పిస్తాను.. అంటూ వస్తున్నారు. వారికి సొమ్ము ముట్టజెబితే కాజ్‌ ఆఫ్‌ డెత్‌ (కారణం)తో ధ్రువపత్రం వస్తుంది. లేకపోతే అందులో కొవిడ్‌తో చనిపోయాడని ఉండదు. గుండె పోటు.. ఇతర కారణాలు ఉంటాయి.

2014 నుంచే ఇలా..!

కుటుంబ సంక్షేమ శాఖ ఇచ్చే మరణ ధ్రుపత్రంలో 2014 నుంచే కాజ్‌ఆఫ్‌ డెత్‌( మరణానికి గల కారణాలను) నిలిపివేశారని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి బీమా పరిహారం కోసం ధ్రుపత్రంలో కాజ్‌ ఆఫ్‌ డెత్‌ తప్పనిసరిగా ఉండాలి. సహజమరణం అయితే పరిహారం తక్కువగా ఉంటుంది. ప్రమాదవశాత్తూ జరిగితే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కొవిడ్‌తో చనిపోయిన వారికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రూ.4లక్షల వరకు ప్రయోజనం కల్పిస్తున్నాయి.అధికారులు మాత్రం కాజ్‌ ఆఫ్‌ డెత్‌ లేకుండా ఇస్తున్నారు. దీంతో మళ్లీ కుటుంబసభ్యులు వచ్చి జీజీహెచ్‌కు ఆర్జీ పెట్టుకుంటున్నారు. ఏ కారణంతో చనిపోయారో దానిలో పేర్కొంటున్నారు. దీని కోసం రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు డిమాండ్‌ను బట్టి వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఆ మొత్తం ఇస్తే.. ప్రత్యేక పత్రంలో రోగి రిఫరెన్సుతో అనుబంధ పత్రం అందిస్తున్నారు. ఓ వైపు చికిత్సకు వేలకు వేలు ఖర్చు చేసినా, తమ వారు దక్కలేదని వేదనలో ఉంటే.. ధ్రువపత్రాల కోసం ఇలా వేధిస్తున్నారని పలువురు వాపోతున్నారు.

జీజీహెచ్‌లోనే దందా..!

ఓ విభాగానికి చెందిన అధికారి దీనిపై బేరాలు ఆడుతూ అందిన కాడికి గుంజుతున్నారు. రెండోసారి అర్జీ పెట్టుకున్న తర్వాత కాజ్‌ ఆఫ్‌ డెత్‌తో ప్రత్యేక పత్రం అందజేస్తున్నారు. ఇటీవల కాలంలో వందల సంఖ్యలో ఆర్జీలు అందాయి. గత నెలలోనే దాదాపు 975 మంది జీజీహెచ్‌లో కన్ను మూశారు. వీరికి మరణ ధ్రువపత్రాలు సాధారణంగానే కాజ్‌ ఆఫ్‌ డెత్‌ లేకుండా ఇచ్చేశారు. అవి చెల్లకపోవడంతో తిరిగి మళ్లీ జీజీహెచ్‌కు వరుస కట్టారు. వీరితో బేరాలు చేసుకుని రూ.10 వేల నుంచి రూ.25వేలు గుంజుతున్నారు. ఇతర జిల్లాల వారు తిరగడం కష్టంగా మారుతుంది. దీంతో అడిగినంత సమర్పించుకుని ఒక్క రోజులో పత్రం తీసుకుంటున్నారు. బీమా సొమ్ము రూ.లక్షల్లో వస్తున్నప్పుడు మాకు అడిగినంత ఇస్తే ఏమవుతుందంటూ.. డిమాండ్‌ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.


ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జారీ

ప్రభుత్వ నిబంధనల ప్రకారం మరణ ధ్రువపత్రంలో వ్యక్తి పేరు, వివరాలు, వయస్సు, మరణించిన తేదీ మాత్రమే ఉండాలి. కాజ్‌ ఆఫ్‌ డెత్‌ వద్ద మాత్రం ఖాళీగానే ఉంచాలి. అది కావాలంటే ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేసి పొందొచ్ఛు దీనికి నగదు వసూలు చేస్తే నాకు గానీ లేదా సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకువస్తే, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

- ఒ.శ్రీనివాసరావు, మెడికల్‌ రికార్డ్‌ ఆఫీసర్‌, విజయవాడ జీజీహెచ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని