Published : 11/06/2021 08:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాట్సాప్‌ హ్యాక్‌

పోలీసులకు సవాలు విసురుతున్న కేటుగాళ్లు

ఈనాడు-అమరావతి

డిజిటల్‌ యుగంలో అన్ని వర్గాల వారు సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. వీటిని తమ మోసాలకు అడ్డాలుగా మార్చుకుంటున్నారు సైబర్‌ నేరగాళ్లు. సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ, ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్‌బుక్‌ హ్యాకింగ్‌ చేసి సన్నిహితులకు డబ్బులు కావాలని సందేశాలు పంపించి మోసం చేయడం చూశాం. తాజాగా ఇదే పద్ధతిలో వాట్సాప్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి, బురిడీ కొట్టిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. హ్యాకింగ్‌కు గురైన వ్యక్తి కాంటాక్ట్‌ జాబితాలోని వారికి వాట్సాప్‌ సందేశం పంపించి అందినకాడికి దండుకుంటున్నారు. విజయవాడ నగరానికి చెందిన ఓ వ్యక్తి భారీగా నగదు బదిలీ చేసి మోసపోయారు. ఈ తరహా మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు.

ఎన్‌ఆర్‌ఐ ఖాతాను హ్యాక్‌ చేసి...

బెజవాడలోని వన్‌టౌన్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల అమెరికాలోని తన బంధువు నుంచి వాట్సాప్‌ సందేశం వచ్చింది. ఆసుపత్రి ఖర్చుల కోసం తన మిత్రుడికి డబ్బు అవసరం ఉందని, తాను ఇచ్చిన బ్యాంకు ఖాతాకు రూ.78వేలు పంపాలన్నది సారాంశం. వెంటనే డబ్బును ఖాతాకు బదిలీ చేశారు. మరికొంత నగదు అవసరం అని, మరో రెండు ఖాతాలను ఇచ్చి వాటికి పంపమని అడగడంతో మొత్తం రూ.2.78 లక్షలు జమ చేశాడు. ఈ విషయాన్ని అమెరికాలోని తన బంధువుకు ఫోన్‌ చేసి చెప్పాడు. డబ్బు పంపించమని తాను ఎటువంటి సందేశం ఇవ్వలేదని సమాధానం ఇచ్చాడు. తన వాట్సాప్‌ హ్యాక్‌ అయి ఉంటుందని బదులిచ్చాడు. దీంతో నిర్ఘాంతపోయి సైబర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖాతాలకు డబ్బు వెళ్లినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది.

* ఏదో ఒక ఫోన్‌ నెంబరుకు అనుసంధానం అయిన తర్వాతే వాట్సాప్‌ పని చేస్తుంది. అదే నెంబరుతో వేరొక పరికరంపై చూసే వెసులుబాటు ఉంది. దీని కోసం అసలు వినియోగదారుడికి ఆరు అంకెల ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేయాల్సి ఉంది. ఆ వ్యక్తికి ఫోన్‌ చేసి ఓటీపీని సంపాదిస్తున్నారు. దీని ద్వారా వాట్సాప్‌ను యాక్టివేట్‌ చేస్తున్నారు. దీంతో పాటు ఎస్‌ఎంఎస్‌లో ఓ లింక్‌ కూడా వస్తుంది. దీనిపై క్లిక్‌ చేసినా.. నియంత్రణ అంతా అవతలి వ్యక్తి చేతికి వెళ్తుంది.

అప్రమత్తతతోనే రక్షణ

వాట్సాప్‌కు సంబంధించి ఓటీపీ చెప్పమని అడిగితే స్పందించకూడదు. ఎస్‌ఎంఎస్‌లో వచ్చే లింక్‌ను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్‌ చేయకూడదు. ఒకవేళ వాట్సాప్‌ హ్యాక్‌ అయితే.. కాంటాక్టులో ఉన్న వారికి ఈ విషయాన్ని తెలియజేయాలి. వాట్సాప్‌ యాప్‌లోని ఓ ఫీచర్‌ ద్వారా కేటుగాళ్లకు చెక్‌ చెప్పొచ్ఛు సెట్టింగ్స్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసిన తర్వాత వచ్చే అకౌంట్‌ అనే మరో ఆప్షన్‌పై నొక్కాలి. అందులోని ‘టు స్టెప్‌ వెరిఫికేషన్‌’ను యాక్టివేట్‌ చేసుకోవాలి.

అనవసర లింక్‌లను క్లిక్‌ చేయొద్దు: నల్లమోతు శ్రీధర్‌, సైబర్‌ రక్షణ నిపుణుడు

ఏపీకే అప్లికేషన్స్‌ అనుసంధానం చేసిన సంక్షిప్త సందేశాలు, కోడ్‌లను మోసగాళ్లు వాట్సప్‌కు పంపుతారు. వాటిని క్లిక్‌ చేసిన వెంటనే అప్లికేషన్‌ సెల్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అవుతుంది. ఎప్పటికప్పుడు సెల్‌లో ఉన్న మెసేజ్‌లను రీడ్‌ చేసి నేరస్థులకు పంపుతూ ఉంటుంది. వాట్సప్‌ హ్యాక్‌ కాకుండా ఉండేందుకు రెండు అంచెల వెరిఫికేషన్‌ పద్ధతిని ఉపయోగించుకోవాలి. ఎస్‌ఎంఎస్‌, నోటిఫికేషన్లను రీడ్‌ చేసే అప్లికేషన్స్‌ ఉంటే వెంటనే తొలగించాలి. వాట్సప్‌కు వచ్చే అనవసరమైన లింక్‌లను క్లిక్‌ చేయొద్ధు

- ఈనాడు, అమరావతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని